- పర్యటనతో విస్తరణ పనులకు శ్రీకారం
- ఆదివాసీల ఆచార, సంప్రదాయాలకు తగ్గట్టుగా ఆలయ పునర్నిర్మాణం
- రూ.236 కోట్లతో మాస్టర్ ప్లాన్ కింద అభివృద్ధి పనులు
- 10 వేల మంది ఒకేసారి తల్లులను దర్శించుకునేలా గద్దెల ప్రాంగణం
- సమ్మక్క ,సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజుల గద్దెలన్నీ ఒకే వరుసలోకి
- గోవిందరాజు, పగిడిద్దరాజుకు ప్రాణప్రతిష్ఠతో మొదలైన భక్తుల రాక
హైదరాబాద్ / వరంగల్ / ములుగు, వెలుగు: ఆదివాసీ కుంభమేళా జరిగే మేడారం రూపురేఖలు 3 నెలల్లోనే మారిపోయాయి. ఆదివాసీల ఆచార, సంప్రదాయాలకు తగ్గట్టుగా ఆలయం పునర్నిర్మాణమవుతున్నది. మాస్టర్‌ప్లాన్ ప్రకారం అభివృద్ధి పనులు వేగంగా పూర్తవుతున్నాయి. రెండేండ్లకు ఒకసారి నిర్వహించే సమ్మక్క జాతరకు కోటిన్నరకు పైగా భక్తులు తరలివస్తారు. కానీ అరకొరవసతుల కారణంగా గిరిజన పూజారులు, భక్తజనం ఇబ్బందులు పడుతున్నారు. గత ప్రభుత్వం ప్రతిసారీ తాత్కాలిక పనులతో సరిపెట్టింది. కానీ ఈసారి రాష్ట్ర ప్రభుత్వం మేడారంలో మాస్టర్‌ప్లాన్‌లో భాగంగా శాశ్వత అభివృద్ధి పనులకు అడుగులు వేసింది.
ఈ ఏడాది సెప్టెంబర్ 23న సీఎం రేవంత్రెడ్డి మేడారంలో పర్యటించి, ఆలయ ప్రధాన పూజరుల సంఘం, అధికారులు, చరిత్రకారులతో సమావేశమయ్యారు. గిరిజన సంస్కృతీ, సంప్రదాయాలకు తగ్గట్టుగా ఆలయ పునర్నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. ప్రారంభించిన 90 రోజుల్లోనే 90శాతానికి పైగా పునరుద్ధరణ పనులు పూర్తికావచ్చాయి. మరో 10 శాతం పనులను జనవరి5 కల్లా పూర్తిచేసే లక్ష్యంతో అధికారులు, శిల్పులు, సిబ్బంది రేయింబవళ్లు శ్రమిస్తున్నారు. ఇప్పటికే సమ్మక్క– సారలమ్మ గద్దెలను ఒకే వరుసలోకి తీసుకురావడంతోపాటు ఈ నెల 24న గోవిందరాజు, పగిడిద్ద రాజును గద్దెలపై ప్రాణప్రతిష్ఠ చేసి, ధ్వజస్తంభాలను ప్రతిష్టించారు. దీంతో భక్తులు పెద్దసంఖ్యలో తరలివస్తున్నారు.
100 రోజులు డెడ్‍లైన్ పెట్టుకొని..
సెప్టెంబర్ 23న మంత్రులు సీతక్క, కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస్‍రెడ్డితో కలిసి సీఎం రేవంత్రెడ్డి మేడారంలో పర్యటించారు. సమ్మక్క పూజరులు, కోయ చరిత్రకారులు, ఉన్నతాధికారులతో కలిసి పునరుద్ధరణ పనులపై చర్చించారు. ఆదివాసీ సంప్రదాయాలకు తగ్గట్టుగా గద్దెల ప్రాంగణం విస్తరణ, ఇతర పునరుద్ధరణ పనులకు ఓకే చెప్పారు. మొదట్లో సిమెంట్కాంక్రీట్తో పనులు చేయాలనే ప్రతిపాదన వచ్చినా.. వెయ్యేండ్ల వరకు చెక్కుచెదరకూడదనే ఉద్దేశంతో రాతి కట్టడాలకు ఓకే చెప్పారు. దీంతో రూ.236.02 కోట్లతో పనులు మొదలుపెట్టారు. 100 రోజుల్లో ప్రధాన పనులన్నీ పూర్తి చేయాలని ఆదేశించారు. అనుకున్నట్లుగానే పనులన్నీ చివరి దశకు చేరుకున్నాయి.
3 షిఫ్టుల్లో 400 మందితో పనులు ..
ఆలయ పునర్నిర్మాణ పనుల కోసం సుమారు 400 మంది సిబ్బంది ప్రతీ రోజు 3 షిఫ్టుల్లో పనిచేస్తున్నారు. స్తంభాలపై శిల్పాలు, చిత్రాలు చెక్కుతున్న ఆళ్లగడ్డ, రాయచోటి ప్రాంతాల్లో మరో 300 మంది కార్మికులు పనిచేస్తున్నట్లు ఆర్ అండ్ బీ ఈఈ సురేశ్ తెలిపారు. జనవరి 5 కల్లా ప్రాంగణం విస్తరణ పనులు కంప్లీట్ చేసి పూజారులకు అందజేస్తామని ఆయన వివరించారు. కోయల వద్ద దొరికిన 900 ఏండ్లనాటి తాళపత్ర గ్రంథాల ఆధారంగా ప్రధాన స్వాగత తోరణంపై సమ్మక్క వంశీయుల చరిత్ర తెలిపే 59 బొమ్మలు చెక్కించారు. దాదాపు 750 మంది కోయ వంశీయుల పేర్లకు సంబంధించి7 వేల బొమ్మలు వేశారు. డాక్టర్ హరిప్రసాద్ ఆధ్వర్యంలో 250 మంది శిల్పులు పనిచేస్తున్నారు.
గద్దెల ప్రాంగణాన్ని విస్తరించి, సమ్మక్క, సారక్క, పగిడిద్దరాజు, గోవిందరాజు కొలువులను ఒకే వరుసలోకి తీసుకురావడంతో భక్తులకు తిప్పలు తప్పనున్నాయి. గతంలో గద్దెల వద్ద వెయ్యి మందికి మించి ఉండే పరిస్థితి లేదు. ప్రస్తుతం 10 వేల మంది భక్తులు ఒకేసారి దర్శించుకున్నా ఇబ్బంది లేకుండా అభివృద్ధి చేశారు. ప్రధానంగా ప్రాంగణం ముందు స్వాగతతోరణంతో పాటు గద్దెల చుట్టూ నిలిపిన పాలరాతి స్తంభాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఈ స్తంభాలపై చెక్కిన 7వేలకు పైగా చిత్రాలు సందర్శకులను కట్టిపడేస్తున్నాయి. సమ్మక్క, సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్ద రాజుల వంశ వృక్షాలు, గొట్టుగోత్రాలతో పాటు గద్దెలపై ప్రతిష్టించే వెదురు బొంగుల నమూనాలు, ఆదివాసుల జీవన శైలికి అద్దంపట్టేలా బతుకు చిత్రాలు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. స్థపతులు ఈమని శివనాగిరెడ్డి, డాక్టర్ మోతీలాల్ పర్యవేక్షిస్తున్నారు. సమ్మక్క-సారలమ్మ ఆర్కియాలజీ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన 15 మంది విద్యార్థులు ఈ చిత్రాల రూపకల్పనలో సాయం అందించారు. ఇక మేడారం జాతర జరిగే ప్రాంతాల్లో రూ.150 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులు కూడా స్పీడ్‌గా జరుగుతున్నాయి.
మాకు చాలా సంతోషంగా ఉంది
మేడారం ఆలయ ప్రాకారం గతంలో తమిళ సంప్రదాయం ప్రకారం సిమెంట్ కాంక్రీట్నిర్మాణంతో ఉండేది. 1980లో అప్పటి ప్రభుత్వం మమ్మల్ని సంప్రదించకుండానే పనులు చేపట్టింది. కానీ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మా అనుమతితో, మేం చెప్పినట్టే పనులు చేస్తున్నది. మా గొట్టు, గోత్రాల ఆధారంగా శిలలపై శిల్పాలు, చిత్రాలకు చోటిచ్చింది. ఈ ప్రాంగణం ద్వారా మా ఆదివాసీ జీవనశైలి భవిష్యత్తు తరాలకు తెలుస్తుంది.
- జగ్గారావు, మేడారం పూజారుల సంఘం అధ్యక్షుడు
900 ఏండ్ల నాటి తాళపత్రాల ఆధారంగా
మేడారం ఆలయ పునర్నిర్మాణంలో రాతితో పనులు చేపట్టాలని, ఆ రాళ్లపై మా గొట్టు, గోత్రాలు తెలిసే చిత్రాలు వేయాలని, ఏయే బొమ్మలను ఏయే పిల్లర్లు, ప్యానెల్స్‌పై వేయాలో మేమే నిర్ణయం తీసుకున్నాం. మాకు ప్రభుత్వం పూర్తి స్వేచ్ఛ ఇచ్చింది. 240 పడిగెలపై ఉన్న సుమారు 2 వేల చిత్రాలను ఆలయ ప్రాకారం లోపల, బయటి వైపు ప్రతి భక్తునికి కనిపించేలా వేయించినం.
- మైపతి అరుణ్ కుమార్, ప్రాజెక్ట్ కోఆర్డినేటర్
మేడారంపై రాజకీయాలు వద్దు
మేడారం ఆధునీకరణ పనులను ఆదివాసీ సంస్కృతీ సంప్రదాయాల ప్రకారమే చేపడుతున్నాం. వీటిపై రాజకీయం చేయవద్దు. కొందరు మీడియా వాళ్లు కావాలని దీనిపై దుష్ప్రచారం చేస్తున్నారు. ఇది సరికాదు. స్వస్తిక్, తిరునామాలులాంటివి ఆదివాసీల జీవితంలో ఒక భాగమే. టెంపుల్ ప్రాకారంలో రెండు వేలకుపైగా ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే గుర్తులను వేశారు. వారికి ఆవేమీ కన్పించవా? విమర్శించే ముందు ఒకసారి ఆదివాసీ పూజారులను అడిగి వివరణ తీసుకోవాలి.
- మంత్రి సీతక్క
ఆదివాసీ పూజారుల ఆమోదంతోనే..
మేడారం పునర్నిర్మాణ పనులను ఆదివాసీ పూజారుల సంఘం ఆమోదంతోనే చేపట్టినం. 250 ఏండ్లపాటు పనులు నిలవాలంటే రాతితోటే నిర్మించాలని నిపుణులు అభిప్రాయపడ్డారు. ఆ ప్రకారమే పనులు చేపట్టాం. పిల్లర్లు, ప్యానెల్స్‌పై ఏ చిత్రాలు వేయాలో ఆదివాసీ పూజారులు, అర్కిటెక్ట్‌లు నిర్ణయించారు. ఇందులో ప్రభుత్వ జోక్యం ఏమాత్రం లేదు. నలుగురు మంత్రులు ఇప్పటికే 6 సార్లు వచ్చి పనులు పర్యవేక్షించారు.
- దివాకర, ములుగు జిల్లా కలెక్టర్
