అమెరికాలో చదువుకున్నోళ్లు..సంపాదనలోనూ ఇండియన్సే ముందు

అమెరికాలో చదువుకున్నోళ్లు..సంపాదనలోనూ ఇండియన్సే ముందు

వెలుగు బిజినెస్​ డెస్క్​ అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్న  మన భారతీయులు ఎక్కువ చదువుకున్న వాళ్లని, సంపాదనలోనూ వారే ముందున్నారని ఒక స్టడీలో తేలింది. ఇతర దేశాల నుంచి వలస వచ్చిన వాళ్లతో పోల్చినా, అమెరికన్లతో పోల్చినా భారతీయుల ఆదాయం ఎక్కువగా ఉందని వాషింగ్టన్​కు చెందిన మైగ్రేషన్​ పాలసీ ఇన్​స్టిట్యూట్​ రీసెర్చ్​ (ఎంపీఐ) స్టడీ వెల్లడించింది.మన దేశం నుంచి అమెరికా వెళ్లిన వారి  కుటుంబాలు 2021 లో సగటున 1.5 లక్షల డాలర్లను ఆర్జించగా, ఇతర దేశాల వలసదారుల కుటుంబాలు, అమెరికన్​ కుటుంబాల సంపాదన ఇందులో సగం కంటే తక్కువగా అంటే 70 వేల డాలర్లుగానే ఉందని ఈ స్టడీ పేర్కొంది.

80 శాతం మందికి బాచిలర్​ డిగ్రీ....

2021 డేటా ప్రకారం 25 ఏళ్లు, దానికి పైబడిన భారత ఇమిగ్రెంట్స్​లో   80 శాతం మంది  బాచిలర్​ డిగ్రీ ఉన్న వారేనని తేలింది. ఇతర దేశాల నుంచి  వలస వచ్చిన వారు  లేదా అమెరికన్లలో మూడో వంతు మందికి మాత్రమే బాచిలర్​ డిగ్రీ ఉంది. ఇక అడ్వాన్స్​డ్​ డిగ్రీల విషయం చూస్తే, 49 శాతం మంది మన వాళ్లకి గ్రాడ్యుయేట్​ డిగ్రీనో లేదా ప్రొఫెషనల్​ డిగ్రీనో ఉన్నాయి. ఇతర దేశాల వారిలో కేవలం 15 శాతం మందికి, అమెరికన్లలో కేవలం 13 శాతం మందికే బాచిలర్​ లేదా ప్రొఫెషనల్​ డిగ్రీ ఉన్నట్లు స్టడీ పేర్కొంది. అమెరికాలో మన ఇండియన్లలో  అమెరికా  రెసిడెంట్​ హోదా పొందిన వాళ్లు  49 లక్షల మంది. వీరిలో కొంత మంది ఇండియాలో పుట్టిన వారైతే, మరికొంత మంది పూర్వీకులు భారతీయులు.   అమెరికాలోని మిగతా వలస జనాభాలో ఎక్కువ మంది మెక్సికన్లుండగా, ఆ తర్వాత రెండో ప్లేస్​లో  మన వాళ్లు నిలుస్తున్నారు. చైనీయులు, ఫిలిప్పినోస్​ కంటే మన వాళ్లే ఎక్కువ మంది ఉండటం విశేషం. అమెరికాలోని మొత్తం ఇమిగ్రెంట్స్​లో భారతీయ సంతతికి చెందిన జనాభా 2021లో  6 శాతమని, ఇది క్రమంగా పెరుగుతోందని ఎంపీఐ స్టడీ వెల్లడించింది. 

ఇప్పుడు వెళ్లే వాళ్లందరూ నిపుణులే.....

19, 20 శతాబ్దాలలో మన దేశం నుంచి ఎక్కువ మంది తక్కువ నైపుణ్యం ఉన్న వాళ్లే  అమెరికాకు వలస వెళ్లేవారు.  రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఈ పరిస్థితి మారి, ప్రొఫెషనల్స్​ ఎక్కువ మంది అమెరికాకు వెళ్తున్నారు. అలాగే అనేక మంది ఇండియన్లు  అమెరికాలోని కాలేజీలు, యూనివర్శిటీలలో చదువుకుని బయటకు వస్తున్నారు. భారతీయులలో ఎక్కువ మంది ఉద్యోగాల వల్లో కుటుంబ సంబంధాల ద్వారానో అమెరికాలో ఉంటున్నట్లు ఈ స్టడీ తెలిపింది. అమెరికాలో హయ్యర్​ ఎడ్యుకేషన్​ ఎడ్మిషన్​ తీసుకుంటున్న వారిలో మన దేశం రెండో  ప్లేస్​లో నిలుస్తోంది. ఎంప్లాయర్లు స్పాన్సర్​ చేసే హెచ్​1 బీ టెంపొరరీ వీసాలు పొందే హై స్కిల్డ్​ వర్కర్లలో  కూడా ఎక్కువ మంది మన దేశానికి చెందిన వారే ఉంటున్నారు. 

20 శాతం మంది కాలిఫోర్నియాలోనే.....

ఇండియన్​ ఇమిగ్రెంట్స్​లో  20 శాతం మంది కాలిఫోర్నియాలో నివసిస్తుండగా, ఆ తర్వాత టెక్సాస్​లో 11 శాతం, న్యూ జెర్సీలో 10 శాతం మంది (2015-19 మధ్య కాలంలో) నివసిస్తున్నట్లు ఈ స్టడీ పేర్కొంది. యూఎస్​ సెన్సస్​ బ్యూరో తాజా డేటాలో ఈ వివరాలున్నాయి. ఇక ఎక్కువ మంది ఇండియన్లు నివసించే నగరాలను చూస్తే గ్రేటర్​ న్యూయార్క్​, చికాగో, శాన్​ఫ్రాన్సిస్కో, శాన్​జోస్​,డాలస్​లు ఉన్నాయని, ఈ అయిదు మెట్రో సిటీలలోనూ కలిపితే అమెరికాలోని ఇండియన్లలో  35 శాతం నివసిస్తున్నారని తేలిందని స్టడీ వివరించింది. మన వాళ్లలో ఎక్కువ మంది మేనేజ్​మెంట్​, బిజినెస్​, సైన్స్​, ఆర్ట్స్​ ఆక్యుపేషన్స్​ వంటి ఉద్యోగాలలో ఉంటున్నారని కూడా స్టడీ వెల్లడించింది. అంతేకాదు, మరో విశేషాన్నీ ఈ స్టడీ ప్రత్యేకంగా ప్రస్తావించింది. అమెరికాలో ఎక్కువగా హెల్త్​ ఇన్సూరెన్స్​ కవరేజ్​ తీసుకునే వారిలోనూ మన వాళ్లే  ముందుంటున్నట్లు పేర్కొంది. 2021 లో చూస్తే మన వాళ్లలో 5 శాతం మందికి మాత్రమేఇన్సూరెన్స్​ లేదని తెలిపింది.