ఒక వ్యక్తి మరణించిన తర్వాత వారి పేరుపై ఉన్న ఆస్తుల పంపిణీ ఆలస్యమైతే.. ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు చేయడం గందరగోళంగా మారుతుంది. ముఖ్యంగా వీలునామా ఉన్నప్పుడు ఈ ప్రక్రియపై స్పష్టత అవసరం. చనిపోయిన వ్యక్తి ఎస్టేట్ తరపున ఎగ్జిక్యూటర్లు లేదా చట్టపరమైన వారసులు ఎంతకాలం ITRలను దాఖలు చేయాలి అనే ప్రశ్నకు సంబంధించి నిపుణుల సలహాను ఇక్కడ తెలుసుకుందాం.
వీలునామా ఉంటే..
వ్యక్తి చనిపోయిన తర్వాత అతని తరపున ITR దాఖలు చేయడంలో ముఖ్యంగా రెండు దశలు ఉంటాయి:
ఒకటి మరణించిన వ్యక్తి చట్టపరమైన వారసులు, లీగల్ హెయిర్‌గా రిజిస్టర్ చేసుకున్న తర్వాత.. ఏప్రిల్ 1 నుండి వ్యక్తి మరణించిన తేదీ వరకు ఆదాయానికి సంబంధించి ITR దాఖలు చేయాల్సి ఉంటుంది.
ఒకవేళ చెల్లుబాటు అయ్యే వీలునామా లేకపోతే ఈ రెండవ మార్గాన్ని ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఆస్తుల పంపిణీ జరగనట్లయితే.. ఎగ్జిక్యూటర్లు "ది ఎస్టేట్ ఆఫ్ ది డిసీజ్డ్" పేరుతో కొత్త పాన్ కార్డ్ పొంది, వ్యక్తి మరణించిన తేదీ నుండి మార్చి 31 వరకు, ఆ తర్వాత ప్రతి సంవత్సరం ఆస్తులు వారసులకు పూర్తిగా ట్రాన్స్‌ఫర్ అయ్యే వరకు ITR దాఖలు చేయాలి.
ITR దాఖలుకు గడువు ఎంత?
కొంతమంది వారసులు మైనారిటీ తీరేవరకు ఆస్తుల పంపిణీ ఆలస్యం కావచ్చు, అలాంటప్పుడు ఆస్తుల పంపిణీ అయ్యేవరకు ITRలు దాఖలు చేయవచ్చా? అనే సందేహం ఉంటుంది. ఇలాంటి పరిస్థితిలో ఏం చేయాలంటే..
►ALSO READ | Gold Rate: గోల్డ్ సిల్వర్ కొనుగోలుదారులకు శుభవార్త.. రేట్లు తగ్గాయ్ షాపింగ్ చేస్కోవచ్చు..
ఆదాయపు పన్ను చట్టం ప్రకారం "ది ఎస్టేట్ ఆఫ్ ది డిసీజ్డ్" తరపున ITRలను దాఖలు చేయడానికి ఎలాంటి నిర్దిష్ట కాల పరిమితిని సూచించలేదు. అయితే వీలునామాలో పేర్కొన్న సూచనల ప్రకారం ఆస్తుల పంపిణీని రీజనబుల్ సమయంలో పూర్తి చేయాలి. సరైన కారణాలు లేకుండా ఈ పంపిణీని నిరవధికంగా ఆలస్యం చేయడానికి వీలు లేదు. ఆస్తుల పంపిణీ జరగనంత కాలం ఎగ్జిక్యూటర్ ITRను దాఖలు చేయాల్సి ఉంటుంది.
ఒక వ్యక్తి వీలునామా చేయకుండా మరణించినా లేదా వీలునామాలో అన్ని ఆస్తులు కవర్ కాకపోయినా.. వీలునామా లేని ఆస్తులు వ్యక్తిగత చట్టం ప్రకారం వెంటనే చట్టపరమైన వారసులకు సంక్రమిస్తాయి. ఈ సందర్భంలో ఏప్రిల్ 1 నుండి వ్యక్తి మరణించిన తేదీ వరకు ఒకే ఒక్క ITRను లీగల్ హెయిర్స్ దాఖలు చేస్తే సరిపోతుంది. ఆ తర్వాత ఆస్తులపై వచ్చే ఆదాయాన్ని వారసులు తమ వ్యక్తిగత ITRలలో చూపించాలి. కాబట్టి వీలునామా ప్రకారం ఆస్తులు పంపిణీ అయ్యే వరకు ఎగ్జిక్యూటర్లు "ది ఎస్టేట్ ఆఫ్ ది డిసీజ్డ్" తరపున ITR దాఖలు చేయవచ్చు. కానీ.. ఆస్తుల ట్రాన్స్‌ఫర్ మాత్రం అనవసరంగా ఆలస్యం చేయకూడదు.
