
సూరత్: వజ్రాల వ్యాపారానికి గుజరాత్ రాష్ట్రం పెట్టింది పేరు. మరీ ముఖ్యంగా సూరత్ నగరంలో వజ్రాల వ్యాపారం జోరుగా సాగుతోంది. సూరత్ నగరంలో ప్రముఖ వజ్రాల వ్యాపార సంస్థల్లో కిరణ్ జెమ్స్ ఒకటి. 50 వేల మందికి పైగా ఈ సంస్థలో పనిచేస్తున్నారంటే కిరణ్ జెమ్స్ ఎంత పెద్ద ఎత్తున వజ్రాల వ్యాపారం చేస్తుంటుందో అర్థం చేసుకోవచ్చు. అలాంటి సంస్థ మాంద్యం కారణంగా వ్యాపారం మందగొడిగా సాగుతుండటంతో కీలక నిర్ణయం తీసుకుంది.
సంస్థలో పనిచేస్తున్న 50 వేల మంది ఉద్యోగులకు 10 రోజుల పాటు సెలవులు ప్రకటించింది. ఆగస్ట్ 17 నుంచి 27 వరకూ కిరణ్ జెమ్స్.. ఉద్యోగులకు వెకేషన్ హాలిడేస్ ఇస్తున్నట్లు వెల్లడించింది. ఈ సెలవులపై కిరణ్ జెమ్స్ చైర్మన్ వల్లభభాయి లఖానీ స్పందిస్తూ.. సెలవులు ప్రకటించిన మాట వాస్తవమేనని, ఈ పది రోజులు ఉద్యోగుల వేతనం నుంచి కొంత కోత విధించనున్నట్లు చెప్పారు.
మాంద్యం కారణంగా సెలవులు ప్రకటించక తప్పడం లేదని, అయితే ఈ పది రోజుల సెలవు కాలంలో కూడా కొంత మొత్తాన్ని జీతంలో చెల్లిస్తామని ఉద్యోగులకు ఊరట కలిగించే విషయం చెప్పారు. మాంద్యం వల్ల వ్యాపారం మందగొడిగా సాగుతోందని తెలిపారు. ముడి వజ్రాలకు కొరత ఏర్పడటం, పాలిష్డ్ వజ్రాలకు డిమాండ్ తగ్గడంతో ఆటుపోట్లను తట్టుకునేందుకు ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదని కిరణ్ జెమ్ చైర్మన్ పేర్కొన్నారు.
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, ఇజ్రాయిల్-పాలస్తీనా గొడవల కారణంగా వజ్రాల వ్యాపారం ప్రపంచవ్యాప్తంగా అంతంత మాత్రంగానే నడుస్తోంది. 2022లో వజ్రాల వ్యాపారం టర్నోవర్ రూ.2,25,000 కోట్లు కాగా, ఇవాళ రూ.1,50,000 కోట్లకే పరిమితమైంది. గత రెండేళ్లుగా వజ్రాల వ్యాపారం ఆటుపోట్ల మధ్య మందగొడిగా సాగుతోంది. సూరత్లో 4 వేలకు పైగా డైమండ్ పాలిషింగ్ యూనిట్స్ ఉన్నాయి. 10 లక్షల మందికి పైగా ఈ వజ్రాల తయారీ సంస్థల్లో పనిచేస్తున్నారు.