పట్టుదల ఉంటే : నాలుగేళ్లలో కోటీశ్వరుడు అయిన ట్యాక్సీ డ్రైవర్

పట్టుదల ఉంటే : నాలుగేళ్లలో కోటీశ్వరుడు అయిన ట్యాక్సీ డ్రైవర్

కృషి, పట్టుదల ఉంటే మనుషులు రుషులు అవుతారనే చందంగా.. ఓ ట్యాక్సీ డ్రైవర్ నాలుగేళ్లలో ఏకంగా కోటీశ్వరుడయ్యాడు. మన పని మనం చేసుకుంటూ ముందుకు సాగుతూ ఉంటే .. ఇక రావాల్సిన ప్రతిఫలం అదే వస్తుంది అని చెబుతూ ఉంటారు పెద్దలు. కొంతమంది విషయంలో ఇది నిజమే అని అనిపిస్తూ ఉంటుంది. ఇక తమ పనిలో నిమగ్నమై దేని గురించి ఆలోచించకుండా ముందుకు సాగుతున్న వారు.. ఏదో ఒక సమయంలో అదృష్టం కలిసి వచ్చి ఇక మంచి జీవితంలోకి అడుగు పెడుతూ ఉంటారు.  అలాగే నిర్దిష్ట లక్ష్యాన్ని పెట్టుకొని  పట్టుదలతో ముందుకు పోతే  ఏదైనా సాధించవచ్చని నిరూపించాడు ఓ ట్యాక్సీ డ్రైవర్ ..


ధనవంతులు కావాలనేది అందరి కల, కానీ అందరి కల నెరవేరాలని అవసరం లేదు. అయితే 4 సంవత్సరాల క్రితం టాక్సీ డ్రైవర్‌గా ఉన్న ఓ వ్యక్తి .. ప్రస్తుతం కోటీశ్వరుడయ్యాడు. పెద్ద వ్యాపారవేత్తగా ఆవిర్భవించాడు.  డబ్బు కూడబెట్టి సొంతంగా ఓ కంపెనీ ఓపెన్ చేసి  వందల మందికి ఉద్యోగాలు ఇస్తున్నాడు. ఏకకాలంలో ఎన్నో వ్యాపారాలు ప్రారంభించాడు. ఇప్పుడు జనాలు శ్రీమంతుడు కావడానికి చిట్కాలు చెపుతున్నాడు. .

వివరాల్లోకి వెళ్తే...

పాకిస్థాన్‌లోని లాహోర్‌కు చెందిన సలీం అహ్మద్ ప్రస్తుతం యూఏఈలో ఉంటూ తన కలలను నెరవేర్చుకుంటున్నాడు. అతను2009లో డ్రైవర్‌గా ఉద్యోగం చేసేందుకు UAE కి వచ్చాడు.  2013వరకు ఇతరుల కోసం ట్యాక్సీలకు డ్రైవర్ గా పని చేశారు.  ఆ తర్వాత ఉబెర్‌లో పనిచేసినా..  మొదటి నుంచి ఏదో ఒక పని చేయాలనే తపన అతనికి ఉండేది.  కానీ సలీం దగ్గర డబ్బులు లేవు.  2019 వరకు టాక్సీలు నడపడం ద్వారా కొంత డబ్బును సేకరించి...  20 మంది డ్రైవర్లతో స్వంత ఫ్లీట్ కంపెనీని ప్రారంభించాడు. నేడు 850  మందికి పైగా  డ్రైవర్లు వారి ఫ్లీట్‌లో ఉన్నారు. వారి టాక్సీలు UAE అంతటా నడుస్తాయి.

ఇప్పుడు  11 కోట్ల బిజినెస్

సలీం 2009లో UAEకి వచ్చినప్పుడు టాక్సీడ్రైవర్‌గా అతనిజీతం  అంటే 1.12 లక్షల రూపాయలు మాత్రమే . ఈ రోజు తన వ్యాపారం 5 మిలియన్ దిర్హామ్ అంటే దాదాపు 11 కోట్ల రూపాయలని సలీం చెపుతున్నాడు.  గతంలో  12 గంటలు పని చేయాల్సి వచ్చిందని .. అప్పుడు  ఇంత డబ్బు సంపాదించగలిగానని తెలిపాడు. ట్యాక్సీ డ్రైవర్ గా ఉన్న సమయంలో అనేక సమస్యలు వచ్చేవని తెలిపాడు.   కానీ 2013లో అతను తన సొంతంగా లిమోసిన్ కొనుగోలు చేసినప్పుడు.. అతను సంపాదించిన డబ్బును  తన వ్యాపారంలో పెట్టుబడిగా  పెట్టేవాడు. ఆ తర్వాత వరుసగా అవకాశాలు వస్తూనే ఉన్నాయి. 2019లో తన  స్వంత కంపెనీ కింగ్ రైడర్స్ డెలివరీ సర్వీసెస్‌ని ప్రారంభించాడు. ఇప్పుడు అందులో  చాలా మంది డ్రైవర్లు కలిసి పనిచేస్తున్నారు.

కలను ఎప్పటికీ వదులుకోకూడదని సలీమ్ చెప్పారు. మీరు ఇతరులకు ఎంత సమయం ఇస్తారో, అంత సమయాన్ని మీ కోసం వెచ్చిస్తే, మీరు ఖచ్చితంగా అనుకున్నది సాధిస్తారని సలీం చెబుతున్నాడు.  ఇంత డబ్బు సంపాదించిన ఆయన ఇప్పుడు విలాసవంతమైన రవాణా సంస్థను ప్రారంభించబోతున్నారు. ఇందుకోసం 20 వాహనాలకు ఆర్డర్ కూడా ఇచ్చారు. సిబ్బందిని కూడా నియమించి వారికి శిక్షణ ఇస్తున్నారు. ప్రస్తుతం తన ఫ్లీట్‌లో 850 వాహనాలు ఉండగా, మరికొన్ని నెలల్లో వీటిని 1000కి పెంచాలని ఆయన యోచిస్తున్నట్టు నాలుగేళ్లలో కోటీశ్వరుడైన ట్యాక్సీ డ్రైవర్ సలీం తెలిపారు.