గుండె పగిలింది: ఫైనల్లో ఈజీగా గెలిచే మ్యాచ్ చేజారింది

గుండె పగిలింది: ఫైనల్లో ఈజీగా గెలిచే మ్యాచ్ చేజారింది

బర్మింగ్‌హామ్:  కామన్ వెల్త్ గేమ్స్ లో ఫస్ట్ గోల్డ్ మెడల్ సాధించి చరిత్ర సృష్టించాలనుకున్న మహిళా భారత్ కల కలగానే మిగిలిపోయింది. ఇంగ్లాండ్‌లోని బర్మింగ్‌హామ్ ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్ (గోల్డ్ మెడల్) గెలవాలనుకున్న భారత జట్టుకు తీవ్ర నిరాశ కలిగింది. 162పరుగుల లక్ష్యఛేదనలో ఇండియా చివరి ఓవర్లో ఆలౌటైంది. దీంతో 9 పరుగుల తేడాతో ఆసీస్ అనూహ్య విజయం సాధించింది. అసాధారణ పోరాటం చేసిన కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ (65పరుగులు 43బంతుల్లో 7ఫోర్లు, 2సిక్సర్లు) ఇన్నింగ్స్‌కు విలువ లేకుండా పోయింది. వరుసగా వికెట్లు కోల్పోతుండడం భారత్ కొంపముంచింది. ఒకానొక దశలో భారత్ గెలుపు ఖాయమనిపించింది. కానీ మన ప్లేయర్ల వరుస ఔట్లతో మ్యాచ్ ఆస్ట్రేలియా వైపు తిరిగింది. అష్లీ గార్డ్‌నర్ 3 కీలక వికెట్లు తీసి మ్యాచ్ మలుపు తిప్పింది. చివరి 5 ఓవర్లు మ్యాచ్ నువ్వా నేనా అనేలా సస్పెన్స్ గా సాగింది. థ్రిల్లింగ్ మ్యాచ్ లో ఆసిస్ విక్టరీ సాధించింది.. గోల్డ్ మెడల్ కొట్టేసింది.

హర్మన్ ప్రీత్ కౌర్, జెమీమా పోరాడినా..
ఇక ఛేదనకు దిగిన ఇండియాకు ఆదిలోనే దెబ్బ తగిలింది. స్టార్ బ్యాటర్లు ఎస్ మంధాన్ (6), సఫాలీ వర్మ (11) వెంటవెంటనే ఔటయిపోవడంతో స్కోరు బోర్డు నెమ్మదించింది. అయితే ఈ తరుణంలో కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్.. జెమీమా రోడ్రీగ్స్ (33పరుగులు 33బంతుల్లో 3ఫోర్లు)తో కలిసి ఇన్నింగ్స్ నిర్మించింది. వీరిద్దరు స్ట్రైక్ రోటేట్ చేసుకుంటూ స్కోరుబోర్డును ముందుకుతీసుకెళ్లారు. మూడో వికెట్‌కు 96పరుగుల విలువైన భాగస్వామ్యం అందించారు. అయితే ఈ జోడీని స్కట్ విడదీసింది. జెమీమా 118పరుగుల వద్ద బౌల్డ్ అయింది. అప్పటికీ భారత్ 33బంతుల్లో 44పరుగులు చేస్తే చాలు. ఇక ఆ తర్వాత ఇండియా రెగ్యులర్‌గా వికెట్లు కోల్పోతూనే ఉంది. హర్మన్ చెత్త షాట్ ఆడి ఔటైంది. ఇక చివర్లో దీప్తి శర్మ (13) కాస్త టచ్‌లో కన్పించినా ఎల్బీడబ్ల్యూగా వెనుదిరగడంతో భారత ఓటమి ఖాయమైంది. చివరి ఓవర్లో 11పరుగులు చేయాల్సిన తరుణంలో ఒక రనౌట్, ఒక ఎల్బీడబ్ల్యూతో భారత్ ఆలౌటైంది. దీంతో ఫస్ట్ కామన్ వెల్త్ గోల్డ్ మెడల్ ఆస్ట్రేలియా చేతుల్లోకి వెళ్లింది. భారత్ రజత పతకంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

అంతకుముందు బెత్ మూనీ హాఫ్ సెంచరీతో..
ఇక తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్‌ బ్యాటర్లలో కెప్టెన్ మెగ్ లానింగ్ (36పరుగులు 26బంతుల్లో 5ఫోర్లు, 1సిక్సర్), ఓపెనర్ బెత్ మూనీ (61పరుగులు 41బంతుల్లో 8ఫోర్లు) రాణించారు. అలీషా గార్డ్ నర్ (25పరుగులు 15బంతుల్లో 2ఫోర్లు, 1సిక్సర్) ఉన్నంత సేపు ప్రమాదకరంగా ఆడింది. దీంతో ఆ జట్టు నిర్ణీత 20ఓవర్లలో 8వికెట్లు కోల్పోయి 161పరుగులు చేయగలిగింది. భారత బౌలర్లలో స్నేహ రానా 2, రేణుక సింగ్ 2, దీప్తి శర్మ, రాధాయాదవ్ తలా ఓ వికెట్ తీశారు.