మెదక్లో కొనసాగుతున్న నామినేషన్ల జోరు

మెదక్లో కొనసాగుతున్న నామినేషన్ల జోరు
  •     ఉమ్మడి జిల్లాలో20 నామినేషన్లు దాఖలు

మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట, వెలుగు : ఉమ్మడి జిల్లాలోని ఆయా అసెంబ్లీ నియోజకవర్గ స్థానాలకు మంగళవారం మొత్తం 29 నామినేషన్లు​ దాఖలయ్యాయి. గజ్వేల్, దుబ్బాక, మెదక్, పటాన్​చెరు, జహీరాబాద్​అసెంబ్లీ స్థానాల్లో ప్రధాన పార్టీ అభ్యర్థులు నామినేషన్లు వేశారు. మెదక్​ అసెంబ్లీ స్థానానికి బీఆర్​ఎస్​ అభ్యర్థి పద్మ స్వయంగా ఒక నామినేషన్​ వేయగా, ఆమె తరపున మున్సిపల్​ చైర్మన్​ చంద్రపాల్,  వైస్​ చైర్మన్ మల్లికార్జున్​ గౌడ్​, ఏఎంసీ చైర్మన్​ బట్టి జగపతి మరో సెట్ నామినేషన్​ దాఖలు చేశారు. పద్మ నామినేషన్​ సందర్భంగా ఎమ్మెల్సీ శేరి సుభాష్​ రెడ్డి ఉన్నారు. నర్సాపూర్​ అసెంబ్లీ స్థానానికి కాంగ్రెస్​ అభ్యర్థి ఆవుల రాజిరెడ్డి తరపున ఆయన తల్లి ప్రేమలత, ఇండిపెండెంట్​ అభ్యర్థిగా నవీన్​ కుమార్ నామినేషన్​ వేశారు.  

సిద్దిపేట జిల్లాలో..

జిల్లాలోని నాలుగు నియోజకవర్గాలకు సంబంధించి మొత్తం 15  నామినేషన్లు దాఖలయ్యాయి.  దుబ్బాక నియోజకవర్గానికి  నాలుగు నామినేషన్లు దాఖలు కాగా  సలకం మల్లయ్య(బహుజన సమాజ్ పార్టీ),  ఆది వేణుగోపాల్ (యుగ తులసి పార్టీ), మాధవనేని రఘునందన్ రావు (బీజేపీ), దుత్పల నరేశ్​(ప్రజా ఏక్తా ) పార్టీ తరపున నామినేషన్లు దాఖలు చేశారు.  బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు తో పాటు మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు.

సిద్దిపేట  నియోజకవర్గానికి సంబంధించి  మొత్తం  ఐదు  నామినేషన్లు దాఖలు కాగా  ధర్మాజీపేట ప్రతాప్ రెడ్డి, పిల్లా సాయికుమార్, పైసా రామకృష్ణ, జక్కుల సత్యనారాయణ ఇండిపెండెంట్లుగా  నామినేషన్లు వేశారు. కాంగ్రెస్  అభ్యర్థిగా పూజల హరికృష్ణ  నామినేషన్ దాఖలు చేశారు. గజ్వేల్ లో  మొత్తం ఆరు  నామినేషన్లు దాఖలు కాగా  బీజేపీ అభ్యర్థులుగా ఈటల రాజేందర్ రెండు సెట్లు,  ఈటల జమున,  వి. సదానంద రెడ్డి ( పీపుల్ ప్రొటెక్షన్ పార్టీ), బి.రాజు, ఎ.కరుణాకర్ రెడ్డి, మద్దెల నర్సింలు ఇండిపెండెంట్లుగా  నామినేషన్లు దాఖలు చేశారు.  ఈటల రాజేందర్ నామినేషన్ కార్యక్రమంలో కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు  కిషన్​రెడ్డి పాల్గొన్నారు.  హుస్నాబాద్ లో మంగళవారం ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు.  

సంగారెడ్డి జిల్లాలో..

జహీరాబాద్ లో 4 నామినేషన్లు దాఖలయ్యాయి. బీజేపీ అభ్యర్థి రామ్ చందర్ రాజనర్సింహా, ధర్మ సమాజ్ పార్టీ నుంచి మ్యాతరి మహేందర్, బహుజన్ ముక్తి పార్టీ నుంచి బి.చంద్రకాంత్, ఇండిపెండెంట్లుగా బి. రాములు నామినేషన్లు వేశారు. ఆందోల్ అసెంబ్లీ స్థానంలో ఎర్రం దేవదాస్, గుమ్మడి లక్ష్మణ్ ఇండిపెండెంట్లుగా​నామినేషన్ వేశారు. పటాన్ చెరు అసెంబ్లీ స్థానంలో ఐదు నామినేషన్లు దాఖలయ్యాయి.

అందులో బీజేపీ అభ్యర్థి నందీశ్వర్ గౌడ్ తరఫున ఒకటి, కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధు తరఫున ఆయన సతీమణి కవిత నామినేషన్ వేశారు. అలాగే ధర్మసమాజ్ పార్టీ నుంచి ఒకరు, ఇండిపెండెంట్లుగా ఇద్దరు నామినేషన్లు వేశారు. సంగారెడ్డి అసెంబ్లీ స్థానంలో  ఆల్ ఇండియా మహిళ ఏంపవర్మెంట్ పార్టీ తరఫున పోలీసు రామచందర్ నామినేషన్ వేశారు.