ఘజియాబాద్‌లో కూలిన ఇల్లు.. ముగ్గురు చిన్నారులు మృతి, నలుగురికి తీవ్ర గాయాలు

ఘజియాబాద్‌లో కూలిన ఇల్లు.. ముగ్గురు చిన్నారులు మృతి, నలుగురికి తీవ్ర గాయాలు

ఉత్తరప్రదేశ్ ఘజియాబాద్‌లో రెండు అంతస్తుల భవనం కూలిపోయి చిన్నారులు మృతి చెందారు. పేలుడు కారణంగా రెండంతస్తుల ఇల్లు కూలిపోవడంతో ముగ్గురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. నలుగురు వ్యక్తులు గాయపడ్డారు. రూప్‌నగర్ కాలనీ సమీపంలో ఉదయం 11.30 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. 

అక్రమంగా పటాకుల యూనిట్‌ను నడుపుతున్న షరీక్‌ అనే వ్యక్తికి ఇంటి యజమాని షకీల్ రూమ్ అద్దెకు ఇచ్చాడు. అయితే.. ఉన్నట్టుండి పేలుడు సంభవించండంతో అందరూ భయపడ్డారు. పెద్ద శబ్దం విని, ఇరుగుపొరుగు వారు ఇంటికి చేరుకున్నారు. ఇంటి కింద చిక్కుకున్న వారిని రక్షించారు.

ఇటు విషయం తెలియగానే నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్‌డిఆర్‌ఎఫ్) బృందం ఘటనాస్థలానికి చేరుకుంది. దాదాపు నాలుగు గంటల తర్వాత శిథిలాల కింద చిక్కుకున్న వారిని బయటకు తీసింది. అప్పటికే కొందరు ప్రాణాలు విడిచారు. తీవ్ర గాయాలతో బయటపడ్డ వారిని దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు.

వంట చేస్తుండగా.. గ్యాస్ సిలిండర్ పేలిపోయిందని బాధితురాలి కుటుంబ సభ్యులు తెలిపారు. మరోవైపు ఇంట్లో అక్రమంగా పటాకుల యూనిట్ నడుస్తోందని స్థానికులు పోలీసులకు తెలిపారు.. ఫోరెన్సిక్ నిపుణులు శిథిలాల మట్టి నమూనాలను సేకరించి, బాణాసంచా తయారు చేస్తున్నప్పుడు పేలుడు సంభవించిందా లేదా వంట గ్యాస్ సిలిండర్‌లో పేలుడు సంభవించిందా అనే విషయాన్ని నిర్ధారించడానికి వాటిని పరీక్షలకు పంపినట్లు డీసీపీ తెలిపారు.