హైటెన్షన్ వైర్లు తగిలి పార్కులో వాకర్ మృతి

హైటెన్షన్ వైర్లు తగిలి పార్కులో వాకర్ మృతి

హైదరాబాద్ : సికింద్రాబాద్ పద్మారావునగర్ లో ఉన్న పార్క్ లో విద్యుత్ షాక్ తో ఓ వాకర్ మృతిచెందాడు. కిందపడిన హైటెన్షన్ వైర్లు తగలడంతో ప్రదీప్ అనే వ్యక్తి స్పాట్ లోనే చనిపోయాడు. పార్శిగుట్ట బాపూజీనగర్ కు చెందిన ఏ. ప్రదీప్ కుమార్ (39) రోజులానే పద్మారావునగర్ లో ఉన్న పార్కులో వాకింగ్ కు వెళ్లాడు. రాత్రి కురిసిన వర్షానికి హై టెన్షన్ వైర్లు తెగి కిందపడ్డాయి. వాకింగ్ కు వెళ్లిన ప్రదీప్.. ఈ వైర్లను గమనించలేదు. హై టెన్షన్ వైర్లపై అతడి కాలుపడడంతో విద్యుత్ షాక్ తగిలి.. అక్కడికక్కడే మృతిచెందాడు.

ఈ విషయాన్ని పార్కులో వాకింగ్ కు వచ్చినవాళ్లు గమనించి.. వెంటనే చిలకలగూడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్పాట్ కు చేరుకున్న పోలీసులు.. డెడ్ బాడీని పరిశీలించారు. ప్రదీప్ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీ మార్చురీకి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న చిలకలగూడ పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. ప్రదీప్ మృతితో అతడి కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదించడం స్థానికులను కంటతడి పెట్టిస్తోంది.