వాకింగ్​ చేస్తున్న మహిళపై వీధి కుక్కల గుంపు దాడి

వాకింగ్​ చేస్తున్న మహిళపై వీధి కుక్కల గుంపు దాడి
  • తరిమేందుకు తీవ్రంగా ప్రయత్నించినా వదలని కుక్కలు
  • మణికొండలోని చిత్రపురి కాలనీలో ఘటన 

గచ్చిబౌలి, వెలుగు: మణికొండలో వీధి కుక్కలు రెచ్చిపోయాయి. స్థానిక చిత్రపురికాలనీలోని అపార్ట్​మెంట్ ఆవరణలో శనివారం ఉదయం 6 గంటలకు వాకింగ్​చేస్తున్న ఓ మహిళను వెనుకగా వెళ్లి చుట్టుముట్టాయి. దాదాపు 15 కుక్కలు ఆమెపై దాడిచేశాయి. వాటిని తరిమేందుకు సదరు మహిళ తీవ్రంగా ప్రయత్నించినా వదల్లేదు. గట్టిగా కేకలు వేస్తూ, కుక్కల నుంచి తప్పించుకునే ప్రయత్నంలో మహిళ ఒక్కసారిగా కిందపడిపోయింది. అయినప్పటికీ కుక్కలు వదల్లేదు. అంతలో అటుగా ఓ బైక్, కారు రావడం గమనించిన కుక్కలు అక్కడి నుంచి వెళ్లిపోయాయి.

మహిళకు స్వల్ప గాయాలయ్యాయి. ఇదంతా అపార్ట్​మెంట్​ కార్​ పార్కింగ్, కారిడార్​లోని సీసీ కెమెరాల్లో రికార్డ్​అయింది. బాధిత మహిళ భర్త ఆ వీడియోలను సోషల్​ మీడియాలో పోస్ట్​ చేశాడు. అదృష్టవశాత్తు తన భార్య ప్రాణాలతో బయటపడిందని, దయచేసి ఎవరూ ఇండ్ల ముందు వీధి కుక్కలకు ఫుడ్​పెట్టొద్దని కోరాడు. తన భార్యకు ఎదురైన పరిస్థితి మరొకరికి జరగొచ్చని, ఆమె స్థానంలో చిన్నారులు ఉండి ఉంటే పరిస్థితి ఇంకోలా ఉండేదని ఆందోళన వ్యక్తం చేశాడు. వీధికుక్కల సంచారం లేకుండా చూడాలని సీఎం రేవంత్​రెడ్డిని, జీహెచ్ఎంసీ అధికారులను కోరాడు.