మాజీ ముఖ్యమంత్రి ఫొటో పంపి..40లక్షలు కొట్టేశారు

మాజీ  ముఖ్యమంత్రి ఫొటో పంపి..40లక్షలు కొట్టేశారు
  • సిటీ మహిళను మోసగించిన సైబర్ చీటర్స్ 

బషీర్ బాగ్, వెలుగు : మాజీ  ముఖ్యమంత్రి ఫొటో పంపించి, డ్రగ్స్, హత్య కేసులో అరెస్ట్ చేస్తామని బెదిరించి ఓ మహిళను సైబర్ చీటర్స్ మోసగించారు. సిటీకి చెందిన 40 ఏళ్ల మహిళకు ఫెడెక్స్ కొరియర్ పేరిట ఫోన్ కాల్ వచ్చింది. ఆమె ఆధార్ నంబర్ తో ఎండీఎంఏ డ్రగ్స్ పర్సిల్ వచ్చిందని తెలిపారు. కాల్ ను ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులకు ఫార్వార్డ్ చేసినట్లు నమ్మించారు. అనంతరం మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఫొటో పంపించారు. అతనికి పెద్ద నేతలతో మంచి సంబంధాలు, తప్పించుకోలేరంటూ ఆమెను భయాందోళనకు గురిచేశారు.

ఆపై తమ అకౌంట్ కు డబ్బు పంపాలని, లేదంటే మహిళ ఫ్యామిలీ బ్యాంక్ అకౌంట్లను  ఫ్రీజ్ చేసి, అరెస్టు చేయిస్తామని బెదిరించారు. దీంతో భయాందోళనకు గురైన బాధితురాలు రూ . 40 లక్షలు సైబర్ నేరగాళ్లు చెప్పిన ఖాతాకు ట్రాన్స్ ఫర్ చేశారు. అనంతరం మోసపోయానని తెలుసుకుని రెండురోజుల కిందట సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు హైదరాబాద్ సైబర్ క్రైమ్ ఏసీపీ శివమారుతి తెలిపారు.