ఎవుసం నీకెందుకన్నరు

V6 Velugu Posted on Oct 28, 2021

సంగీతకు రెండో కాన్పులో బిడ్డ పురిట్లోనే చనిపోయింది. అత్తింటి బంధువులు ఆ తప్పంతా ఆమెదే అన్నారు. ‘ఏ పాపం చేశావో’ అని తిట్టిపోశారు. అండగా ఉండాల్సిన వాళ్లే అవమానించారు. బాధనంతా దిగమింగింది. కుటుంబ గొడవలు వేరు కాపురానికి దారి తీశాయి. మూడోసారి ఆమె ప్రెగ్నెంట్​ అయింది. విధి మళ్లీ వెక్కిరించింది. ఎనిమిది నెలల నిండు గర్భిణిగా ఉన్నప్పుడు ఆమె భర్త రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. ఆమె జీవితంలో మరో విషాదం ఇది. ఆమె నరకం చూసింది. అందరూ ఉన్నా అనాథ అయింది. దాదాపు పదేండ్ల తర్వాత తనకంటూ ఓ తొవ్వను వెతుక్కుంది. భర్త పేరు మీద ఉన్న భూమిలో ఎవుసం చేస్తూ... తన ఇంటికి తానే లక్ష్మి అయింది. 

సంగీతది నాసిక్​లో మాటోరి. సైన్స్​ బ్యాక్​గ్రౌండ్​లో  డిగ్రీ చదివింది. చదువయ్యాక పెళ్లి చేశారు.  పెళ్లైన కొద్ది రోజులకే ఆమె జీవితం ఇలా విషాదంగా మారింది. 2007లో ఆమె భర్త చనిపోయాడు. ఇద్దరు పిల్లలతో ఆమె అత్తింట్లోనే ఒంటరిగా జీవితం గడిపింది. అత్తా మామలు ఆమెను బాగానే చూసుకున్నారు. అలా కొన్ని రోజుల తర్వాత తనకంటూ ఓ పని కావాలని అనుకుంది. ‘భర్త పేరు మీద ఉన్న పొలంలో వ్యవసాయం చేస్తా’ అని అత్తామామలను అడిగింది.  వాళ్లు ‘సరే’ అన్నారు. మామ సపోర్ట్​ చేశాడు. కానీ తెలిసిన వాళ్లు నవ్వారు. బంధువులు వద్దన్నారు. ‘ఆడదానివి, అందులో ఒంటరిదానివి నువ్వేం వ్యవసాయం చేస్తావ్​’ అని అవమానించారు. అయినా ఆమె కుంగిపోలేదు. తనలోని శక్తిని కూడగట్టుకుంది. 2017లో  మామ సాయంతో13 ఎకరాల భూమిలో వ్యవసాయం మొదలుపెట్టింది. కొద్ది రోజుల తర్వాత మామ చనిపోవడంతో ఆ భూమిని కాపాడాల్సిన అవసరం వచ్చింది. ‘ పొలమే మాకు దిక్కు. మొదట్నించీ ఆదుకున్న మామ చని పోయారు. అది నన్నెంతో బాధించింది. అయినా వ్యవసాయం చేయాలనుకున్నా. కొందరు ఈ పని చేయొద్దన్నారు’ అని  చెప్పింది సంగీత. కానీ, ఆమె ఇప్పుడు 13 ఎకరాల భూమిలో ద్రాక్ష,  టొమాటో లను పండిస్తూ ఆడవాళ్లు కూడా వ్యవసాయం బాగా చేయొచ్చని నిరూపించింది. టన్నుల కొద్దీ పంట, లక్షల ఆదాయంతో అందరి నోళ్లు మూయించింది. ఇదంతా అంత ఈజీగా రాలేదు. సొంతంగా వ్యవసాయం మొదలుపెట్టడానికి పెట్టుబడి కోసం సంగీత నగల్ని కుదువ పెట్టింది. కొన్నింటిని అమ్మేసి డబ్బులు తెచ్చింది. మరి కొంత డబ్బు అప్పు చేసి వ్యవసాయంపై ఇన్వెస్ట్​ చేసింది. 
అన్నీతానై...
పంట పండించడం అంటే కేవలం సూపర్​వైజ్ ​చేయడం కాదు. పలుగు, పార పట్టాలి. కూలీగా మారి పని చేయాలి.  అలా అన్ని పనులు చేసింది. టూవీలర్​, ట్రాక్టర్ నడపడం, మోటర్లను రిపేర్ చేయడం, మార్కెట్​కు వెళ్లి సామాన్లు కొనడం అన్నీ తనే చేస్తుంది. ట్రాక్టర్​ పాడయిపోతే తనే రిపేర్​ చేసుకుంటుంది. సంవత్సరానికి 800 నుంచి వెయ్యి టన్నుల ద్రాక్షను పండిస్తోంది. ఏడాదికి 25–-30 లక్షలు సంపాదిస్తోంది.  తనను అవమానించిన వారికి తనంటే ఏంటో చూపించింది. ‘ఈ ఎవుసం చేయడం నాకెంతో గర్వంగా ఉంది. మరిన్ని పంటలు తీయగలననే నమ్మకం ఉంది’ అంటోంది సంగీత.

Tagged woman, success, farming,

Latest Videos

Subscribe Now

More News