
- రౌడీ షీటరే ఉరేసి చంపేశాడు ...
- రౌడీషీటరే కారకుడని ఆరోపిస్తూ మృతురాలి బంధువుల ధర్నా
ఖమ్మం టౌన్, వెలుగు: అనుమానాస్పదంగా మహిళ మృతి చెందిన ఘటన ఖమ్మం జిల్లాలో జరిగింది. రౌడీషీటరే ఉరిపెట్టి చంపేశాడని మృతురాలి బంధువులు ఆరోపిస్తూ ధర్నాకు దిగారు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
కొణిజర్ల మండలం జగ్య తండాకు చెందిన సుశీల (28), రఘునాథ పాలెం మండలం ఎం. వెంకటాయపాలెంకు చెందిన కారు డ్రైవర్ బోడ శివ తొమ్మిదేండ్ల కింద ప్రేమ పెండ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. కాగా ఒకరు ఏడాదికింద చనిపోయారు.
ఎం. వెంకటాయపాలెంలో రౌడీషీటర్ ధరావత్ వినయ్, శివ ఇండ్లు ఎదురెదురుగా ఉన్నాయి. కొన్నాళ్ల కింద వినయ్ వేధింపులు తాళలేక భార్య ఇద్దరు పిల్లలతో వెళ్లిపోయింది. కాగా.. వినయ్, సుశీల మధ్య కొన్నాళ్ల కింద సన్నిహిత సంబంధం ఏర్పడింది.
గంజాయికి బానిసైన వినయ్ సోమవారం మధ్యాహ్నం మత్తులో సుశీల కూలి పనికెళ్లిన పత్తిచేను వద్దకు వెళ్లి డబ్బులు అడిగాడు. ఆమె లేవని చెప్పడంతో కొట్టి కారులో ఎక్కించుకుని వైరా వైపు తీసుకెళ్లాడు. కొద్దిసేపటికి తిరిగొచ్చి చేను వద్ద వదిలిపెట్టిపోయాడు. సాయంత్రం సుశీల ఇంటికి వెళ్లిన అనంతరం కూడా వినయ్ మరోసారి ఆమె వద్దకు వెళ్లాడు.
ఆ తర్వాత కొద్దిసేపటికి కిటిక్కి ఉరేసుకుని సుశీల అనుమానాస్పదంగా చనిపోయి కనిపించింది. రఘునాథపాలెం పోలీసులకు కుటుంబసభ్యులు సమాచారం అందించారు. వెంటనే రౌడీషీటర్ వినయ్ ను అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది.
సుశీల మృతికి కారణమైన బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మంగళవారం ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీ వద్ద రోడ్డుపై మృతురాలి బంధువులు ధర్నాకు దిగారు. పోలీసులు వెళ్లి సర్ది చెప్పడంతో విరమించారు. మృతురాలి భర్త ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు రఘునాథపాలెం సీఐ ఉస్మాన్ షరీఫ్ తెలిపారు.