బెట్టింగ్‌‌లో నష్టపోయి యువకుడు ఆత్మహత్య..హనుమకొండ జిల్లా వేలేరు మండలంలో ఘటన

బెట్టింగ్‌‌లో నష్టపోయి యువకుడు ఆత్మహత్య..హనుమకొండ జిల్లా వేలేరు మండలంలో ఘటన

భీమదేవరపల్లి/ధర్మసాగర్, వెలుగు : ఆన్‌‌లైన్‌‌ బెట్టింగ్‌‌లో నష్టపోవడంతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన హనుమకొండ జిల్లా వేలేరు మండలంలో  జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. భీమదేవరపల్లి మండలంలోని ములుకనూరు గ్రామానికి చెందిన సుంచు రాంచరణ్​(23) తల్లిదండ్రులు చిన్నతనంలోనే చనిపోవడంతో నానమ్మ మధురమ్మ వద్ద పెరిగాడు.

 గతంలో మంచిర్యాలలో ఉన్న రాంచరణ్‌‌.. కొంతకాలంగా తన అక్క ఊరైన వేలేరులో ఉంటూ కొత్తకొండలోని ఓ పెట్రోల్‌‌ బంక్‌‌లో పనిచేస్తున్నాడు. యువకుడి నానమ్మ మధురమ్మ ఇల్లు రిపేర్‌‌ చేయించేందుకు మహిళా సంఘంలో రూ. 90 వేలు అప్పు తీసుకొని.. ఆ డబ్బులను రాంచరణ్‌‌ అకౌంట్‌‌లో డిపాజిట్‌‌ చేసింది. 

తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలన్న ఆలోచనతో ఆన్‌‌లైన్‌‌ బెట్టింగ్‌‌లకు అలవాటు పడిన రాంచరణ్‌‌ తన నానమ్మ డబ్బులతో పాటు మరికొందరి వద్ద రూ. 60 వేల వరకు అప్పులు తీసుకొని బెట్టింగ్‌‌లో పెట్టి నష్టపోయాడు. 

దీంతో మనస్తాపానికి గురైన రాంచరణ్‌‌ సోమవారం వేలేరు గ్రామ శివారులో పురుగుల మందు తాగాడు. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు వరంగల్‌‌లోని ఎంజీఎంకు తరలించారు. అక్కడ ట్రీట్‌‌మెంట్‌‌ తీసుకుంటూ బుధవారం రాత్రి చనిపోయాడు. మృతుడి బావ విష్ణు ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.