- పాకిస్తాన్లో డెడ్‌బాడీ లభ్యం
- భారత్‌కు తీసుకురావాలని మోదీకి మృతుడి కుటుంబీకుల విజ్ఞప్తి
జమ్మూ: గత నెలలో జమ్మూకాశ్మీర్‌లోని చీనాబ్నదిలో దూకి ఓ యువకుడు సూసైడ్ చేసుకున్నాడు. అతని డెడ్‌బాడీ పాకిస్తాన్లో లభ్యమైంది. దీంతో అతని మృతదేహాన్ని భారత్‌కు తీసుకురావాలని మృతుడి కుటుంబ సభ్యులు ప్రధాని నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు. అఖ్నూర్ సెక్టార్‌లోని సరిహద్దు గ్రామానికి చెందిన హరాష్ నగోత్రా జూన్ 11న అదృశ్యమయ్యాడు. కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అయితే, నగోత్రా ఆన్‌లైన్ గేమ్స్ లో రూ.80 వేల వరకు పోగొట్టుకున్నాడని పోలీసులు గుర్తించారు. అతడి మోటార్ సైకిల్ చీనాబ్ నది ఒడ్డున దొరికింది. దీంతో అతడు నదిలో దూకి సూసైడ్ చేసుకొని ఉంటాడని నిర్ధారించారు. ఇదిలా ఉండగా.. నగోత్రా సిమ్ కార్డ్‌ను అతని తల్లిదండ్రులు తిరిగి యాక్టివేట్ చేశారు. ఆ నంబర్‌కు పాక్ అధికారి నుంచి వాట్సాప్ సందేశం వచ్చింది. నగోత్రా చనిపోయాడని, సియాల్‌కోట్‌లోని కాలువ నుంచి డెడ్‌బాడీని స్వాధీనం చేసుకున్నట్టు తెలిపాడు.