క్రికెట్‌‌ బెట్టింగ్‌‌ తో అప్పులు.. యువకుడు ఆత్మహత్య ..సంగారెడ్డి జిల్లా బీరంగూడ వద్ద ఘటన

క్రికెట్‌‌ బెట్టింగ్‌‌ తో అప్పులు.. యువకుడు ఆత్మహత్య ..సంగారెడ్డి జిల్లా బీరంగూడ వద్ద ఘటన

రామచంద్రాపురం, వెలుగు : క్రికెట్‌‌ బెట్టింగ్‌‌ కారణంగా అప్పుల పాలైన ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా బీరంగూడ సమీపంలో మంగళవారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే... రామచంద్రాపురం పట్టణంలోని సాయినగర్‌‌ కాలనీకి చెందిన సంగీత్‌‌రావు కుమారుడు అఖిల్‌‌ (31) సోమవారం బీరంగూడ కమాన్‌‌ వద్ద గల ఓ హోటల్‌‌లో రూమ్‌‌ను అద్దెకు తీసుకున్నాడు.

 అదే రోజు సాయంత్రం హోటల్‌‌ నుంచి తన తన తండ్రికి ఫోన్‌‌ చేసి క్రికెట్‌‌ బెట్టింగ్‌‌లో భారీ మొత్తంలో నష్టపోయానని చెప్పాడు. దీంతో వెంటనే ఇంటికి రావాలని, వచ్చాక మిగతా విషయాలు మాట్లాడుకుందామని సంగీత్‌‌రావు చెప్పాడు. కొద్దిసేపటి తర్వాత ఇంటికి వస్తున్నట్లు అఖిల్‌‌ తన తండ్రికి మెసేజ్‌‌ చేశాడు. కానీ ఎంతకూ రాకపోవడంతో అనుమానం వచ్చిన సంగీత్‌‌రావు కొడుకు కోసం వెతకడం ప్రారంభించారు. 

ఇదిలా ఉండగా.. హోటల్‌‌ గదిలో ఉన్న అఖిల్‌‌ ఎంతకూ డోర్‌‌ తీయకపోవడంతో నిర్వాహకులు మంగళవారం పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు హోటల్‌‌ వద్దకు వచ్చి వివరాలు సేకరించిన తర్వాత కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. అనంతరం అందరూ కలిసి డోర్‌‌ తెరిచి చూడగా.. అఖిల్‌‌ ఉరి వేసుకొని చనిపోయి కనిపించాడు. విషయం తెలుసుకున్న సీఐ జగన్నాథ్, ఎస్సై రామకృష్ణ ఘటనాస్థలాన్ని పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు రామచంద్రాపురం పోలీసులు తెలిపారు.