పిల్లలు కాదు.. చిచ్చర పిడుగులు వీళ్లు

పిల్లలు కాదు.. చిచ్చర పిడుగులు వీళ్లు

పిల్లలు కాదు.. చిచ్చర పిడుగులు వీళ్లు. అందుకే వీళ్లను కొన్ని కోట్ల మంది ఇష్టపడుతున్నారు. ఈ పిల్లల్లోని టాలెంట్‌‌‌‌ గుర్తించిన తల్లిదండ్రులు ఒక యూట్యూబ్‌‌‌‌ ఛానెల్‌‌‌‌ పెట్టారు. అందులో పిల్లలు ఆయు, పీహూతోపాటు వాళ్లు కూడా వీడియోలు చేస్తున్నారు. ఇండియాలో కిడ్స్ కేటగిరీ ఛానెళ్లలో టాప్‌‌‌‌ టెన్​లో ఉంది ఈ పిల్లల ఛానెల్​. 

ఏ తల్లిదండ్రులైనా తమ పిల్లల్ని పెంచి, పెద్ద చేసి,  ప్రయోజకులుగా మార్చాలి అనుకుంటారు. కానీ.. వీళ్లు మాత్రం వాళ్ల పిల్లల్ని పెంచుతూనే ప్రయోజకుల్ని చేశారు. పిల్లల కోసం యూట్యూబ్‌‌‌‌‌‌‌‌ ఛానెల్‌‌‌‌‌‌‌‌ పెట్టి, వాళ్ల సక్సెస్‌‌‌‌‌‌‌‌కు దారులు వేశారు. ఇప్పుడు ఆయు, పీహులు ఇండియాలో ఫేమస్‌‌‌‌‌‌‌‌ కిడ్స్‌‌‌‌‌‌‌‌. కొన్ని కోట్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు వాళ్ల ఛానెల్​కు. ‘‘ఆయు అండ్‌‌‌‌‌‌‌‌ పీహు షో’’కి దాదాపు కోటీ 50 లక్షలమందికి పైగా సబ్‌‌‌‌‌‌‌‌స్క్రయిబర్స్ ఉన్నారు. 

ఈ ఛానెల్‌‌‌‌‌‌‌‌లో కనిపించే ఆయు అసలు పేరు ‘ఆయుష్’. పీహు పేరు ‘ప్రకృతి’. వీళ్ల అమ్మ రుచి, నాన్న పియూష్ కల్రా. వీళ్లంతా ఈ ఛానెల్‌‌‌‌‌‌‌‌లో కనిపిస్తుంటారు. ఇందులో షార్ట్ ఫిల్మ్‌‌‌‌‌‌‌‌లు, ఫన్నీ ఛాలెంజ్‌‌‌‌‌‌‌‌లు, గేమ్‌‌‌‌‌‌‌‌లు, ఫ్యామిలీ కామెడీ, యాక్టివిటీ, లెర్నింగ్‌‌‌‌‌‌‌‌కి సంబంధించిన కంటెంట్‌‌‌‌‌‌‌‌ పోస్ట్‌‌‌‌‌‌‌‌ చేస్తుంటారు. ఛానెల్‌‌‌‌‌‌‌‌ని మే 9, 2017లో మొదలుపెట్టారు. అదే నెల14న మొదటి వీడియో అప్‌‌‌‌‌‌‌‌లోడ్ చేశారు. ఒక సంవత్సరంలోనే ఈ ఛానెల్‌‌‌‌‌‌‌‌ని దాదాపు పది లక్షల మంది సబ్‌‌‌‌‌‌‌‌స్క్రయిబ్‌‌‌‌‌‌‌‌ చేసుకున్నారు. పోస్ట్‌‌‌‌‌‌‌‌ చేసే వీడియోలకు నెలకు దాదాపు ఇరవై కోట్ల  వ్యూస్‌‌‌‌‌‌‌‌ వస్తుంటాయి. 

ఎలా వచ్చారు?
ఆయు, పీహులది రాజస్తాన్‌‌‌‌‌‌‌‌లోని కోటా అనే సిటీ. పియూష్, రుచి కల్రాలకు 2007లో పీహు, 2013లో ఆయు పుట్టారు. కొత్త విషయాలు తెలుసుకోవాలనే ఆసక్తితో పియూష్‌‌‌‌‌‌‌‌ ఎక్కువగా ఆన్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌లో గాడ్జెట్స్ అన్‌‌‌‌‌‌‌‌ బాక్సింగ్, రివ్యూ వీడియోలు చూసేవాడు. తనతోపాటు ఆయు కూడా వీడియోలు చూసేవాడు. అప్పుడు ఆయుకి కిడ్స్‌‌‌‌‌‌‌‌కి సంబంధించిన వీడియోలు చూపించాలి అనుకున్నాడు పియూష్‌‌‌‌‌‌‌‌. కానీ.. యూట్యూబ్‌‌‌‌‌‌‌‌లో వెతికితే.. పిల్లల వీడియోలన్నీ ఇంగ్లీష్‌‌‌‌‌‌‌‌లో ఉన్నాయి. పైగా అన్నీ యానిమేటెడ్‌‌‌‌‌‌‌‌ వీడియోలే. హిందీలో చాలా తక్కువ వీడియోలు కనిపించాయి. వెంటనే పియూష్‌‌‌‌‌‌‌‌కి ఒక యూట్యూబ్‌‌‌‌‌‌‌‌ ఛానెల్‌‌‌‌‌‌‌‌ పెట్టి అందులో పిల్లలకి సంబంధించిన కంటెంట్‌‌‌‌‌‌‌‌ పోస్ట్ చేయాలనే ఐడియా వచ్చింది.  దాంతో ‘‘ఆయు అండ్‌‌‌‌‌‌‌‌ పీహు షో” పేరుతో యూట్యూబ్‌‌‌‌‌‌‌‌ ఛానెల్‌‌‌‌‌‌‌‌ పెట్టాడు. మొదట్లో పిల్లలకు నచ్చే నీతి కథలు, మంచి అలవాట్లలాంటి సబ్జెక్ట్‌‌‌‌‌‌‌‌ మీద వీడియోలు తీసి అప్‌‌‌‌‌‌‌‌లోడ్ చేసేవాడు. ఈ వీడియోల్లో ఆయు, పీహు కనిపించేవాళ్లు. పియూష్, రుచి షూటింగ్​, ఎడిటింగ్​ చేసి ఛానెల్‌‌‌‌‌‌‌‌లో అప్‌‌‌‌‌‌‌‌లోడ్‌‌‌‌‌‌‌‌ చేసేవాళ్లు. వాళ్లే స్క్రిప్ట్‌‌‌‌‌‌‌‌ కూడా రాసేవాళ్లు. వ్యూస్‌‌‌‌‌‌‌‌ పెరిగాక మంచి లైటింగ్, కెమెరా, హై ఎండ్‌‌‌‌‌‌‌‌ గేమింగ్‌‌‌‌‌‌‌‌ ల్యాప్‌‌‌‌‌‌‌‌ టాప్‌‌‌‌‌‌‌‌ కొని, క్వాలిటీ కంటెంట్ ఇవ్వడం మొదలుపెట్టారు. 

వరుసగా.. 
ఏడాదిలోనే అంటే 2018లో ఛానెల్‌‌‌‌‌‌‌‌కు సిల్వర్ ప్లే బటన్ వచ్చింది. అదే  ఏడాది చివర్లో గోల్డ్ ప్లే బటన్‌‌‌‌‌‌‌‌, ఆ తర్వాత ఏడాదికే డైమండ్ ప్లే బటన్ అందుకున్నారు. ఈ ఛానెల్‌‌‌‌‌‌‌‌ వల్ల ఆయు, పీహు ఫేమస్‌‌‌‌‌‌‌‌ అయ్యారు. ఎన్నో అవకాశాలు దక్కించుకున్నారు. క్యాడ్‌‌‌‌‌‌‌‌బరీ జెమ్స్‌‌‌‌‌‌‌‌ వాళ్లు నిర్వహించే వర్చువల్ జెమ్స్ బర్త్‌‌‌‌‌‌‌‌డే పార్టీలో పార్టిసిపేట్‌‌‌‌‌‌‌‌ చేసే ఛాన్స్​ వచ్చింది. అంతేకాదు.. దబాంగ్ యానిమేటెడ్ సిరీస్‌‌‌‌‌‌‌‌ల కోసం కార్టూన్ నెట్‌‌‌‌‌‌‌‌వర్క్‌‌‌‌‌‌‌‌తో కలిసి పనిచేశారు. 

నీతి కథలు
ఛానెల్‌‌‌‌‌‌‌‌కి ఎక్కువ పాపులారిటీ రావడానికి కారణం.. నీతి కథలే. వీళ్లు చేసే నీతి కథల వీడియోలకు చాలా వ్యూస్ వస్తుంటాయి. కొన్ని రియల్‌‌‌‌‌‌‌‌ ఇన్సిడెంట్స్‌‌‌‌‌‌‌‌ని కూడా కథల్లా చెప్పడం వల్ల పిల్లలతోపాటు పెద్దవాళ్లు కూడా ఛానెల్‌‌‌‌‌‌‌‌కు బాగా కనెక్ట్ అయ్యారు. అంతేకాదు.. అక్కా తమ్ముళ్లు ఇద్దరూ ఛానెల్‌‌‌‌‌‌‌‌ కోసం బాగా కష్టపడ్డారు. ఒక పక్క చదువుకుంటూనే యూట్యూబ్‌‌‌‌‌‌‌‌లో వీడియోలు చేస్తున్నారు. 

నెట్‌‌‌‌‌‌‌‌వర్త్‌‌‌‌‌‌‌‌
యూట్యూబ్‌‌‌‌‌‌‌‌ ఛానెల్ ద్వారా ఇప్పటివరకు 37.2 కోట్ల రూపాయల వరకు సంపాదించారు. యూట్యూబ్‌‌‌‌‌‌‌‌లో ప్రమోషన్స్‌‌‌‌‌‌‌‌, వేరే బ్రాండ్స్‌‌‌‌‌‌‌‌తో పార్ట్‌‌‌‌‌‌‌‌నర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌లు చేసి డబ్బు సంపాదిస్తున్నారు. ఈ ఫ్యామిలీకి రుచి అండ్‌‌‌‌‌‌‌‌ పియూష్‌‌‌‌‌‌‌‌ అనే మరో ఛానెల్‌‌‌‌‌‌‌‌ కూడా ఉంది. దానికి కూడా 31 లక్షల రెండువేల మంది సబ్‌‌‌‌‌‌‌‌స్క్రయిబర్స్ ఉన్నారు. ఈ ఛానెల్‌‌‌‌‌‌‌‌ నుంచి కూడా ఆదాయం వస్తోంది వీళ్లకు.