సోషల్ వార్: మరో యూట్యూబర్‎కు వార్నింగ్ ఇచ్చిన.. యూట్యూబర్ అరెస్ట్

  సోషల్ వార్: మరో యూట్యూబర్‎కు వార్నింగ్ ఇచ్చిన.. యూట్యూబర్ అరెస్ట్

 బెంగళూరు సిటీలోని యూట్యూబర్ల మధ్య వార్ నడుస్తుంది. ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకుంటున్నారు. నువ్వు పెద్ద రౌడీ అంటే.. కాదు కాదు నువ్వే పెద్ద లఫూట్ అంటూ తిట్టిపోసుకుంటున్నారు. యూట్యూబర్ల మధ్య నడుస్తున్న సోషల్ వార్.. ఇప్పుడు అరెస్టుల వరకు వెళ్లింది. ఈ క్రమంలోనే ఓ యూట్యూబర్ ను అరెస్ట్ చేసి బెంగుళూరు పోలీసులు కటకటాల్లోకి నెట్టారు. వివరాల ప్రకారం.. బెంగుళూరుకు చెందిన మోటో వ్లాగ్ యూట్యూబర్ దీపక్ గధిగప్ప సోషల్ మీడియా వేదికగా మరో యూట్యూబర్‎కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు. బెంగళూరులో తాను పెద్ద రౌడీనని.. తన జోలికి రావొద్దని బహిరంగంగా హెచ్చరించాడు. 

దీపక్ గధిగప్ప బహిరంగంగా బెదిరింపులకు దిగిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‎గా మారింది. ఈ వీడియోను ఎక్స్ (ట్విట్టర్) వేదికగా బెంగుళూరు సిటీ పోలీసులకు ట్యాగ్ చేసిన ఓ నెటిజన్.. ‘‘డియర్ బెంగుళూరు సిటీ పోలీస్.. ఈ వ్యక్తి సోషల్ మీడియాలో కొంతమందిని బహిరంగంగా బెదిరిస్తున్నాడు. ఇలాంటి సోషియోపాత్‌లు సమాజంలో భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. ఇలాంటి వారిని తక్షణమే అతడిని అరెస్ట్ చేసి విచారించండి’’ అంటూ ట్యాగ్ చేశాడు. స్పందించిన సిటీ పోలీసులు ఈ ఘటనపై విచారణ చేపట్టి.. బహిరంగ బెదిరింపులకు పాల్పడ్డ దీపక్ గధిగప్పపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. 

Also Read:-వెంటాడి పట్టుకున్న పోలీసులు

సోషల్ మీడియాలో విద్వేషాన్ని వ్యాప్తి చేస్తూ.. నగర ప్రశాంతతను దెబ్బతీయవద్దని ఈ సందర్భంగా పోలీసులు సూచించారు. బహిరంగంగా విద్వేషాన్ని వ్యాప్తి చేసే వారిపై కఠిన చర్యలు తీసుకొంటామని హెచ్చరించారు. సోషల్ మీడియాలో బెదిరింపులకు పాల్పడుతోన్న యూట్యూబర్ ను పోలీసులు అరెస్ట్ చేయడంతో మరో నెటిజన్ హర్షం వ్యక్తం చేశాడు. ‘‘గుడ్ జాబ్ బెంగళూరు పోలీసులు. అమాయక ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్న పోకిరీలు, ఉగ్రవాదుల నుండి నగరాన్ని రక్షించడంలో మీ చర్యకు ధన్యవాదాలు’’ అని ట్వీట్ చేశారు.