సీఐతో మున్నూరు రవి సెల్ఫీ పై సర్వత్రా చర్చ

సీఐతో మున్నూరు రవి సెల్ఫీ పై సర్వత్రా చర్చ
  • మంత్రి శ్రీనివాస్​గౌడ్​ హత్యకు కుట్ర కేసులో ఏ4 గా రవి
  • అప్పట్లో పార్టీ నుంచి సస్పెండ్​ చేస్తున్నట్లు టీఆర్​ఎస్​ ప్రకటన
  • ఇప్పుడు ప్లీనరీలో లీడర్లు, పోలీసులతో కలిసి హడావుడి

హైదరాబాద్​, వెలుగు:  మంత్రి శ్రీనివాస్​గౌడ్​హత్యకు కుట్ర కేసులో కీలక నిందితుడు, ఏ4గా ఉన్న మున్నూరు రవి బుధవారం హైదరాబాద్​లో జరిగిన టీఆర్​ఎస్​ ప్లీనరీకి హాజరుకావడం చర్చనీయాంశంగా మారింది. ఇదే కేసులో ఇన్వెస్టిగేషన్​ ఆఫీసర్​గా ఉన్న పేట్​బషీరాబాద్​సీఐ రమేశ్​తో మున్నూరు​ రవి సెల్ఫీ దిగడంతో అది కాస్తా సోషల్​ మీడియాలో వైరల్ అవుతున్నది. టీఆర్​ఎస్​ పార్టీకి చెందిన మంత్రిని చంపాలనుకున్న వ్యక్తిని ఆ పార్టీ ప్లీనరీకి ఆహ్వానించడం ఆశ్చర్యపరుస్తున్నది. మంత్రి హత్యకు కుట్ర కేసులో మార్చి 2న  ప్రధాన నిందితుడు చలువగాలి రాఘవేందర్‌‌‌‌ రాజు సహా మొత్తం8 మందిని పేట్‌‌ బషీర్‌‌‌‌బాద్‌‌ పోలీసులు అరెస్ట్ చేయగా.. వారిలో మున్నూరు​ రవి ఒకరు. గతంలో శ్రీనివాస్​గౌడ్​ అనుచరుడైన రవిని.. హత్య కుట్ర కేసు బయటకు రాగానే  పార్టీ నుంచి  సస్పెండ్​ చేస్తున్నట్లు టీఆర్​ఎస్​ మహబూబ్​నగర్​ పట్టణ అధ్యక్షుడు శివరాజ్​ ప్రకటించారు.  అలాంటి వ్యక్తి టీఆర్ఎస్​ ప్లీనరీకి రావడం, ఇన్వెస్టిగేషన్​ ఆఫీసర్​గా ఉన్న సీఐతో సెల్ఫీలు తీసుకుంటూ హల్​చల్​చేయడం హాట్​టాపిక్​గా మారింది. 

ఇప్పటికీ టీఆర్​ఎస్​తో సంబంధాలున్నాయా?

మంత్రి హత్యకు కుట్ర కేసులో మహబూబ్​నగర్​కు చెందిన మున్నూరు రవిని మార్చి 2న ఢిల్లీలో తెలంగాణ పోలీసులు అరెస్టు చేశారు. మరుసటి రోజే ఆయనతో పాటు మరో ఏడుగురు మంత్రి శ్రీనివాస్​గౌడ్ హత్యకు కుట్ర చేశారని సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర మీడియా సమావేశంలో చెప్పారు. అనంతరం విచారణ చేసి, వారిని చర్లపల్లి జైలుకు తరలించారు. 31 రోజుల తర్వాత నిందితులంతా ఇటీవల బెయిల్​పై విడుదలై వచ్చారు. కాగా, ‘మంత్రి హత్యకు కుట్ర’ చేశారనే వార్తలు రావడంతో  మార్చి 4న మున్నూరు రవితో పాటు మరో ముగ్గురి సభ్యత్వాలను రద్దు చేసి, టీఆర్​ఎస్​ నుంచి సస్పెండ్ చేశారు. నాడు సస్పెండ్​అయిన మున్నూరు రవి బుధవారం జరిగిన ప్లీనరీకి రావడానికి ఐడెంటిటీ కార్డు ఎలా వచ్చిందనే విషయం ప్రశ్నార్థకంగా మారింది. ఆనాటి సస్పెన్షన్​ అంతా ఉత్తిదేనా? గతంలో ఉమ్మడి మహబూబ్​నగర్​ టీఆర్ఎస్​వీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న రవి ఇప్పటికీ టీఆర్​ఎస్​ నేతలతో సంబంధాలు మెయింటెన్​ చేస్తున్నాడా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

ఢిల్లీలో పట్టుకున్నామంటూ.. 

మార్చి 2న నిందితుల అరెస్ట్​ అనంతరం సీపీ స్టీఫెన్​ రవీంద్ర మాట్లాడుతూ.. ‘‘తన బార్​, రియల్​ఎస్టేట్​వ్యాపారానికి  మంత్రి శ్రీనివాస్​గౌడ్​, గులాంహైదర్​ అడ్డుగా ఉన్నారని చలువగాలి రాఘవేందర్‌‌‌‌ రాజు భావించాడు. వీరిద్దరిని చంపేందుకు రూ.15 కోట్ల సుపారీ ఆఫర్​ ఇచ్చి నాగరాజు, మధుసూదన్ రాజు,అమరేందర్ రాజు, మున్నూరు రవి, దండేకర్ విశ్వనాథరావు, వరద యాదయ్యలతో కలిసి కుట్ర చేశాడు. ఈ క్రమంలోనే సుచిత్ర దగ్గర హైదర్​ను చంపే ప్రయత్నం​విఫలం కావడంతో గన్స్ ను బౌరంపేట్ ఫారెస్ట్ లోని చెట్ల పొదల్లో దాచిపెట్టి ఢిల్లీకి వెళ్లారు.  అక్కడి సౌత్ అవెన్యూ  సర్వెంట్‌‌ క్వార్టర్స్‌‌లోని మాజీ ఎంపీ జితేందర్​రెడ్డి కారు డ్రైవర్ తిలక్ థాప రూమ్‌‌లో షెల్టర్ తీసుకున్నారు” అని పేర్కొన్నారు. జితేందర్​రెడ్డి క్వార్టర్​లో నిందితులు షెల్టర్​ తీసుకున్నారని సీపీ చెప్పడం ద్వారా బీజేపీ నేతలకు మంత్రి హత్యకు కుట్ర కేసుతో సంబంధం ఉందన్నట్లుగా అప్పట్లో ప్రచారం జరిగింది. తీరా నిందితుడే ఇప్పుడు టీఆర్​ఎస్​ ప్లీనరీలో ప్రత్యక్షం కావడం అనేక అనుమానాలకు తావిస్తున్నది.