వెంకీ–త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘ఆదర్శ కుటుంబం’ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రేజీ కాంబోలో వస్తున్న ఈ చిత్రాన్ని ఎప్పుడెప్పుడు థియేటర్లలో చూస్తామా అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఇప్పటికే ‘ఆదర్శ కుటుంబం’ సినిమా పలుమార్లు రిలీజ్ డేట్ మారడంతో అభిమానుల్లో కాస్త నిరాశ నెలకొంది. మొదట ఈ సినిమాను అక్టోబర్ 2న విడుదల చేయాలని మేకర్స్ భావించారు. ఆ తర్వాత అక్టోబర్ 9కి వాయిదా వేశారు. కానీ అనుకున్న తేదీ కూడా మారిపోవడంతో కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడు ఉంటుందా? అంటూ ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.
తమన్ ట్వీట్‌తో రిలీజ్ డేట్ లీక్..
ఇలాంటి సమయంలో మ్యూజిక్ డైరెక్టర్ తమన్ చేసిన ఓ ట్వీట్ ఇప్పుడు సినిమాకు సంబంధించిన కీలక విషయాన్ని బయటపెట్టింది. సినిమా రీ-రికార్డింగ్ పనులపై అప్డేట్ ఇస్తూ.. పొరపాటున కొత్త రిలీజ్ డేట్‌ను కూడా ట్వీట్లో ప్రస్తావించారు. తమన్ ట్వీట్ ప్రకారం ‘ఆదర్శ కుటుంబం’ అక్టోబర్ 30, 2026న థియేటర్లలోకి రాబోతున్నట్లు రాసుకొచ్చాడు. అయితే తమన్‌కు విషయం అర్థమయ్యేలోపే నెటిజన్లు ఆ ట్వీట్‌ను స్క్రీన్షాట్లు తీసేశారు. వెంటనే అప్రమత్తమైన తమన్ ఆ రిలీజ్ డేట్‌ను తొలగించి ట్వీట్‌ను ఎడిట్ చేశారు. కానీ అప్పటికే జరగాల్సిన ప్రచారం జరిగిపోయింది!
Date post chesi delete chesadu😭😭 #AK47 https://t.co/SJHnhk6gSz
— Telugu Smash (@SmashTelugu29) October 6, 2026
డిలీట్ చేసినా.. డేట్ మాత్రం దాగలేదు!
ఎడిట్ హిస్టరీలో అసలు ట్వీట్‌ను నెటిజన్లు గుర్తించడంతో ‘ఆదర్శ కుటుంబం’ రిలీజ్ డేట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇప్పటివరకు కొత్త రిలీజ్ డేట్ కోసం ఎదురుచూస్తున్న ఫ్యాన్స్‌కు.. తమన్ ట్వీట్‌తో ఓ క్రేజీ క్లూ దొరికినట్టయింది. అయితే ఇది నిజంగా మేకర్స్ ఫిక్స్ చేసిన తేదీయేనా? లేక అనుకోకుండా బయటపడిన ఓ ప్రొడక్షన్ డేట్ మాత్రమేనా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అధికారిక ప్రకటన వచ్చే వరకు సస్పెన్స్ కొనసాగనుండగా.. అక్టోబర్ 30 డేట్ మాత్రం ఫ్యాన్స్‌లో కొత్త ఆశలు రేపుతోంది.
