వద్దన్నా, ఆధార్​ వాడేస్తున్నరు

వద్దన్నా, ఆధార్​ వాడేస్తున్నరు

సుప్రీం తీర్పు తర్వాతా ప్రైవేట్​ కంపెనీలకు ఈకేవైసీ అధికారాలు

ప్రతి దానికి  దానికీ గుర్తింపుగా ఆధార్​ అడుగుతున్నారు. బ్యాంకు అకౌంట్​ తెరవాలన్నా, పాన్​ కార్డు రావాలన్నా, ఉపాధి కూలీ పైసలు ఖాతాల పడాలన్నా, ఫోన్​లో సిమ్​ కావాలన్నా.. అది లేనిదే పని జరగట్లేదు. బయోమెట్రిక్​లో వేలి ముద్రలు ఇవ్వాల్సిందే. అది కూడా కస్టమర్​ ఇష్టపూర్వకంగానే తీసుకోవాల్సి ఉంటుంది. దాన్నే ఈకేవైసీ (ఎలక్ట్రానిక్​ నో యువర్​ కస్టమర్​) అని అంటారు. అయితే, ప్రైవేట్​ కంపెనీలు ఈకేవైసీ తీసుకోవద్దంటూ గత ఏడాది సెప్టెంబర్​లో సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది. ఆ తీర్పుతో టెలికాం కంపెనీలు, ప్రైవేట్​ బ్యాంకులకు పెద్ద దెబ్బే పడింది. కానీ, ఈ తొమ్మిది నెలల్లో మాత్రం ఆ పరిస్థితిలో మార్పు వచ్చింది. చిన్నచిన్నగా ఆధార్​ను ప్రైవేట్​ కంపెనీలూ వాడుకునేలా కేంద్ర ప్రభుత్వం, ఆధార్​ అధీకృత సంస్థ యూనిక్​ ఐడెంటిఫికేషన్​ అథారిటీ ఆఫ్​ ఇండియా (యూఐడీఏఐ)లు పావులు కదిపాయి. ఆధార్​ చట్టంలోని చిన్న చిన్న లొసుగులను అడ్డం పెట్టుకుని కంపెనీలు ఆధార్​ వాడుకునేలా చేశాయి. తద్వారా ‘కోర్టు ధిక్కారం’ కిందకు రాకుండా జాగ్రత్తపడ్డాయి. అయితే, కొందరు న్యాయ నిపుణులు మాత్రం స్వచ్ఛందంగాగానీ, బలవంతంగాగానీ కంపెనీలు ఆధార్​ వివరాలు తీసుకోకుండా సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిన విషయాన్ని గుర్తు  చేస్తున్నారు.

ఇదీ అటార్నీ జనరల్​ అభిప్రాయం

సుప్రీం కోర్టు తీర్పు తర్వాత ఖాతాల్లోకే నగదు బదిలీ (డైరెక్ట్​ బెనిఫిట్​ ట్రాన్స్​ఫర్​/డీబీటీ), ఆధార్​ ఆధారిత చెల్లింపుల వ్యవస్థను ప్రైవేట్​ కంపెనీలు ఎలా వాడుకోవచ్చో అటార్నీ జనరల్​ చెప్పారు. ఈ విషయంపైనే అటార్నీ జనరల్​(ఏజీ) అభిప్రాయాన్ని యూఐడీఏఐ సీఈవో అజయ్​ భూషణ్​ పాండే తీసుకున్నారు. నాలుగు అంశాలపై ఆయన సలహాలు తీసుకున్నారు. సమాచార హక్కు చట్టం ద్వారా ఏజీ చెప్పిన అభిప్రాయాలు వెలుగులోకి వచ్చాయి. అందులో మొదటి ప్రశ్న, బ్యాంకులు, టెలికాం కంపెనీలకు యూఐడీఏఐ ద్వారా అథెంటికేషన్​ సేవలు అందించవచ్చా అని అజయ్​ భూషణ్​ అడిగారు. ‘‘పార్లమెంట్​లో చట్టం చేసేంత వరకు ఆధార్​ యూజర్లు స్వచ్ఛందంగా నంబర్​ ఇవ్వడానికి ఒప్పుకున్నా టెలికాం కంపెనీలకు గానీ, బ్యాంకులకు గానీ యూఐడీఏఐ వివరాలు ఇవ్వకూడదు” అని సమాధానం చెప్పారు.

మరి, ఆధార్​ చట్టంలోని సెక్షన్​ 7 కింద డీబీటీ కోసం బ్యాంకులు వాడుకోవచ్చా అన్న దానికి తప్పులేదని పేర్కొన్నారు. ‘‘సబ్సిడీలు, సేవలు, ఇతర అవసరాల కోసం సెక్షన్​ 7 కింద ఆధార్​ వివరాలు చట్టం ప్రకారం తప్పనిసరి. కాబట్టి సబ్సిడీలు ఇవ్వడానికి, నగదు బదిలీ, ఆధార్​ ఆధారిత మైక్రో ఏటీఎంల నుంచి డబ్బులు డ్రా చేసేందుకు  సెక్షన్​ 7 కింద బ్యాంకులు లబ్ధిదారుల ఆధార్​ వివరాలను తీసుకోవచ్చు” అని ఏజీ వివరించారు. ఏజీ వివరణలతో 2018 అక్టోబర్​ నుంచే బ్యాంకులు ఈకేవైసీ వివరాలు తీసుకునేందుకు యూఐడీఏఐ అనుమతిచ్చింది. ప్రైవేట్​ కంపెనీలకూ అదే ఏడాది నవంబర్​లో ఈకేవైసీపై లేఖలు పంపింది. ఈకేవైసీని సెక్షన్​ 7 వరకు మాత్రమే పరిమితం చేయాలని, లేకపోతే కోర్టు ధిక్కరణ కిందకు వస్తుందని ఆ లేఖల్లో ప్రైవేట్​ కంపెనీలకు సూచించింది. సుప్రీంకోర్టు తీర్పును పూర్తిగా అవగాహన చేసుకోవాలని సూచించింది. దాని ప్రకారమే నడుచుకోవాలని ఆదేశించింది. ఒకవేళ ఆ తీర్పును పట్టించుకోకపోతే కంపెనీలదే పూర్తి బాధ్యత అని కూడా చెప్పింది.