మీ ఆస్తులకు ఆధార్ లింక్.. ఇక మిగిలింది ఇదేనా..

మీ ఆస్తులకు ఆధార్ లింక్.. ఇక మిగిలింది ఇదేనా..

పౌరుల స్థిర, చరాస్తులకు సంబంధించిన దస్త్రాలను ఆధార్‌తో అనుసంధానం చేయాలనుకోవడం మంచి అంశమని ఢిల్లీ హైకోర్టు అభిప్రాయపడింది. ఇందుకు సంబంధించి దాఖలైన పిటిషన్‌ను విచారించిన చీఫ్‌ జస్టిస్‌ సతీష్‌చంద్ర శర్మ, జస్టిస్‌ యశ్వంత్‌ వర్మలతో కూడిన ధర్మాసనం.. ఈ విషయంలో నాలుగు వారాల్లో ప్రతిస్పందన తెలియజేయాలని కేంద్ర ఆర్థిక, న్యాయ, గృహ-పట్టణ వ్యవహారాలు, గ్రామీణాభివృద్ధి శాఖలకు సూచించింది. అవినీతి, నల్లధనం, బినామీ చెల్లింపులను అరికట్టేందుకు ఆధార్‌తో అనుసంధానం చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ తదుపరి విచారణను జులై 18కి వాయిదా వేసింది.

అవినీతిని కట్టడి చేయడంతోపాటు బినామీ ఆస్తులను జప్తు చేయడం ప్రభుత్వం బాధ్యత అంటూ న్యాయవాది అశ్వినీ ఉపాధ్యాయ్‌ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను విచారించిన ఢిల్లీ హైకోర్టు చీఫ్‌ జస్టిస్ ఆధ్వర్యంలోని ధర్మాసనం.. ఇది మంచి అంశమని, వీటిపై స్పందనలు రానివ్వండి అని అభిప్రాయపడ్డారు. కేంద్రం తరఫున వాదనలు వినిపించిన అడిషనల్‌ సొలిసిటర్‌ జనరల్‌ చేతన్‌ శర్మతోపాటు కేంద్ర ప్రభుత్వ స్టాండింగ్‌ కౌన్సిల్‌ మనీశ్‌ మోహన్‌లు కూడా ఇది ముఖ్యమైన అంశమని పేర్కొన్నారు. 

ఈ అంశానికి సంబంధించి ఢిల్లీ ప్రభుత్వం 2019లోనే తన అభిప్రాయాన్ని తెలిపింది. ఆధార్‌ అనేది ప్రాపర్టీ రిజిస్ట్రేషన్‌, ల్యాండ్‌ మ్యుటేషన్‌లకు గుర్తింపు పత్రంగా మాత్రమే అనుమతిస్తామని తెలిపింది. కేవలం ఐచ్ఛికం మాత్రమేనని.. ఇది తప్పనిసరి అని చెప్పడానికి చట్టంలో ఎటువంటి నిబంధన లేదని పేర్కొంది.