హైదరాబాద్, వెలుగు: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు రాజకీయ ఉనికి కోసం ప్రభుత్వంపై ఆధారంలేని విమర్శలు చేస్తున్నారని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మండిపడ్డారు. శుక్రవారం సీఎల్పీ మీడియా సెంటర్‌లో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని విషయాలపై మాట్లాడే రామచంద్రరావు.. ఉత్తర తెలంగాణకు వరప్రదాయిని అయిన తుమ్మిడిహెట్టి ప్రాజెక్టుపై మాత్రం ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. ప్రాణహిత నదిపై తుమ్మిడిహెట్టి వద్ద 150 మీటర్ల ఎత్తుతో బ్యారేజీ నిర్మిస్తే ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, మెదక్, రంగారెడ్డి జిల్లాల్లోని 16 లక్షల ఎకరాలకు గ్రావిటీ ద్వారా సాగునీరు అందించవచ్చని పేర్కొన్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టు కోసం రూ. 11 వేల కోట్లు ఖర్చు చేసి, 71 కిలోమీటర్ల కెనాల్ పనులు కూడా పూర్తి చేసిందని గుర్తుచేశారు.
150 మీటర్ల ఎత్తులో బ్యారేజీ కడితే కేవలం వెయ్యి ఎకరాల లోపే ముంపు ఉంటుందని, వారికి పరిహారం ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. తుమ్మిడిహెట్టి నిర్మాణంపై చర్చించేందుకు సీఎం రేవంత్ రెడ్డి, ఇరిగేషన్ మంత్రి మహారాష్ట్ర సీఎంకు లేఖలు రాసినా స్పందన లేదన్నారు. మహారాష్ట్ర సీఎం అపాయింట్‌మెంట్ ఇప్పిస్తానని బండి సంజయ్ గతంలో బడా బడాయి కబుర్లు చెప్పారని, ఇప్పుడు ఇద్దరు కేంద్ర మంత్రులు, ఆరుగురు ఎంపీలు, ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఉన్నా.. మహారాష్ట్రతో మాట్లాడటానికి ఎందుకు చొరవ చూపడం లేదని నిలదీశారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలది ఫెవికాల్ బంధమని, అందుకే రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారని ఆరోపించారు. ధాన్యం సేకరణలో కేంద్ర ప్రభుత్వం సహకరించడం లేదని, కేవలం 52 లక్షల మెట్రిక్ టన్నులకే పరిమితం కావడం దారుణమన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడా రుణమాఫీ చేయలేదని, కానీ తమ ప్రభుత్వం రూ.20 వేల కోట్ల రుణమాఫీ చేసి రైతులను ఆదుకుందని చెప్పారు.
