SRH Struggle: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)2026 ప్రారంభానికి రంగం సిద్ధమైంది. మార్చి 28వ తేదీన ఈ క్యాష్ రిచ్ లీగ్ 19వ ఎడిషన్ స్టార్ట్ కానుంది. దీంతో భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఇందుకు సంబంధించిన తొలి విడత షెడ్యూల్‌ను బుధవారం ( మార్చి 11న) విడుదల చేసింది. ఒకవైపు ఇరాన్ తో ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం చేస్తుండటంతో పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతుండగా.. మరోవైపు తమిళనాడు, అసోం, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల ఉండటంతో.. కేవలం 20 మ్యాచ్‌లకు సంబంధించిన షెడ్యూల్‌ను మాత్రమే బీసీసీఐ రిలీజ్ చేసింది.
ఈ షెడ్యూల్ ప్రకారం సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్టు తొలి మ్యాచ్‌ని మార్చి 28వ తేదీన డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB)తో పోటీ పడనుంది. ఈ మ్యాచ్ బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరగనుంది. ఇక రెండో మ్యాచ్ ఏప్రిల్ 2న కోల్‌కతా నైట్ రైడర్స్ తో ఈడెన్ గార్డెన్స్ లో జరగనుంది. ఆ తర్వాత మ్యాచ్ ఏప్రిల్ 5న హైదరాబాద్‌లో లక్నో సూపర్ జెయింట్స్ తో ఉప్పల్ స్టేడియంలో ఆడనుంది. అనంతరం ఏప్రిల్ 11వ తేదీన న్యూ చండీగఢ్‌లో పంజాబ్ కింగ్స్ తో ఆడనుంది.
భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా మాట్లాడుతూ.. సన్‌రైజర్స్ హైదరాబాద్ గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు. తొలి విడత షెడ్యూల్లో భాగంగా 3 మ్యాచ్‌లు సొంత మైదానం వెలుపల ఆడాల్సి రావడం ఎస్ఆర్ హెచ్ కు ఇబ్బందిగా మారుతుందన్నారు. గుజరాత్ టైటాన్స్ తో పాటు సన్‌రైజర్స్ హైదరాబాద్ తమ తొలి నాలుగు మ్యాచ్‌లలో మూడు ఇతర వేదికలపై ఆడాల్సిన పరిస్థితి నెలకొంది. నాకైతే సన్‌రైజర్స్ గురించే ఎక్కువగా భయం వేస్తుంది.. ఎందుకంటే, వాళ్ల(హైదరాబాద్ ప్లేయర్స్) కు ఫ్లాట్ పిచ్‌లు అవసరం.. కానీ ఇతర వేదికల్లో వీరి కోసం అలాంటి పిచ్‌లను రెడీ చేయడం కష్టమే అన్నారు. సొంత గ్రౌండ్ లో ఒక్క మ్యాచ్ మాత్రమే ఉండటం.. అది కూడా మధ్యాహ్నం మ్యాచ్‌గా ఫిక్స్ చేశారని ఆకాష్ చోప్రా వెల్లడించారు.
వాస్తవానికి సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు సీజన్‌ను హోం గ్రౌండ్లో ప్రారంభిస్తే బాగుండేది అని మాజీ క్రికెటర్ చోప్రా తెలిపారు. అక్కడైతే వారు అద్భుతమైన ఆరంభం చేయగలరని పేర్కొన్నారు. ఇది వారి విజయాలపై, ఆత్మవిశ్వాసంపై కూడా తీవ్ర ప్రభావం చూపే ఛాన్స్ ఉందని చెప్పుకొచ్చారు. ఇక సన్‌రైజర్స్ జట్టులో అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్, హెన్రిచ్ క్లాసెన్ లాంటి విధ్వంసకర ప్లేయర్స్ ఉన్నారని ఆకాశ్ చోప్రా గుర్తు చేశారు.
