
ఢిల్లీ : మద్యం కుంభకోణం కేసులో అరెస్టయిన మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాతో పోలీసులు దురుసుగా ప్రవర్తిస్తున్నారని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌తో పాటు ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) నేతలు ఆరోపించారు. ఢిల్లీ కోర్టులో సిసోడియాను పోలీసులు లాక్కెళ్తున్నట్లుగా ఉన్న ఒక వీడియోను పోస్ట్ చేసిన ఆప్.. కేంద్ర ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడింది.
అసలేం జరిగింది..?
మద్యం కుంభకోణానికి సంబంధించి మనీలాండరింగ్ కేసులో సిసోడియా కస్టడీ మంగళవారం (మే 23న) తో ముగియడంతో ఢిల్లీ పోలీసులు ఆయన్ను మంగళవారం కోర్టులో హాజరుపర్చారు. కోర్టు గది నుంచి సిసోడియాను బయటకు తీసుకువస్తున్న సమయంలో మీడియా ప్రతినిదులు ఆయన్ను ఒక్కసారిగా చుట్టుముట్టారు.
మోడీపై ఆరోపణలు
ఢిల్లీలో ప్రభుత్వ ఉద్యోగుల నియామకాలు, బదిలీలపై నియంత్రణాధికారం ఆ రాష్ట్ర ప్రభుత్వానిదేనని ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అడ్డుకునేందుకు కేంద్రం ఆర్డినెన్స్ తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ ఆర్డినెన్స్ గురించి మీడియా ప్రతినిధులు సిసోడియాను ప్రశ్నించగా.. ‘‘మోడీజీ చాలా అహంకారిగా మారారు. ఆయనకు ప్రజాస్వామ్యంపై విశ్వాసం లేదు’’ అని సిసోడియా సమాధానమిచ్చారు.
వీడియో వైరల్
అప్పడే సిసోడియాను ప్రశ్నిస్తుండగా... ఆయనే వెంటే ఉన్న పోలీసులు.. మీడియా ప్రతినిధులను పక్కకు తోసేశారు. ఆ తర్వాత సిసోడియా మెడ చుట్టూ చేయి వేసి... బలవంతంగా అక్కడి నుంచి ఆయన్ను లాక్కెళ్లారు. ఇదే వీడియోను ఆప్ నేతలు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారింది.
కేజ్రీవాల్ ప్రశ్నల వర్షం
‘‘రౌస్ అవెన్యూ కోర్టులో సిసోడియాతో ఓ పోలీసు అధికారి దురుసుగా ప్రవర్తించారు. ఆయనను వెంటనే సస్పెండ్ చేయాలి’’ అని ఢిల్లీ మంత్రి అతిషి డిమాండ్ చేశారు. ఈ వీడియోపై కేజ్రీవాల్ స్పందించారు. ‘‘మనీశ్‌జీతో ఇలా దురుసుగా ప్రవర్తించే అధికారం పోలీసులకు ఉందా..? లేదంటే ఇలా చేయమని పోలీసులను ఎవరైనా ఆదేశిస్తున్నారా..?’’ అంటూ కేంద్రంపై కేజ్రీవాల్ పరోక్షంగా మండిపడ్డారు.
ఖండించిన పోలీసులు
ఆప్ నేతల ఆరోపణలను ఢిల్లీ పోలీసులు ఖండించారు. ‘‘సిసోడియాకు భద్రత కల్పించడంలో భాగంగానే పోలీసులు అలా ప్రవర్తించారు. నిందితులు మీడియాకు స్టేట్‌మెంట్లు ఇవ్వడం చట్టపరంగా వ్యతిరేకం’’ అని ఢిల్లీ పోలీస్ విభాగం ట్వీట్ చేసింది.
కస్టడీ పొడిగింపు
మద్యం కుంభకోణం కేసులో సిసోడియా కస్టడీని కోర్టు మరోసారి పొడిగించింది. జూన్ 1వ తేదీ వరకు ఆయన జ్యుడీషియల్ కస్టడీలోనే ఉండాలని స్పష్టం చేసింది. అయితే.. జైల్లో ఆయనకు కుర్చీ, టేబుల్, పుస్తకాలు అందించాలని జైలు అధికారులను న్యాయస్థానం ఆదేశించింది.
https://twitter.com/AtishiAAP/status/1660887595415470080