ఆటోడ్రైవర్ కు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఢిల్లీ సీఎం

ఆటోడ్రైవర్ కు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఢిల్లీ సీఎం

అహ్మదాబాద్‌ : ఆమ్‌ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్‌, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ఓ ఆటో డ్రైవర్‌కు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు. స్వయంగా ఆ డ్రైవర్‌ ఆటోలోనే అతడి ఇంటికి వెళ్లి.. భోజనం కూడా చేశారు. అహ్మదాబాద్‌ పర్యటనలో ఉన్న కేజ్రీవాల్‌.. అక్కడి ఆటోరిక్షా డ్రైవర్లతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా విక్రమ్‌ దంతానీ అనే ఆటోడ్రైవర్.. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ను తన ఇంటికి భోజనానికి ఆహ్వనించాడు.

‘మీకు నేను పెద్ద అభిమానిని. పంజాబ్‌లో మీరు ఓ ఆటోడ్రైవర్‌ ఇంటికి వెళ్లి భోజనం చేసిన వీడియోను సోషల్‌ మీడియాలో చూశాను. గుజరాత్‌లోనూ అలాగే చేస్తారా..? మా ఇంటికి వస్తారా..?’ అని కేజ్రీవాల్ ను ఆటోడ్రైవర్ విక్రమ్‌ దంతానీ అడిగారు. దీంతో విక్రమ్ ఆహ్వానాన్ని అంగీకరిస్తూ.. స్వయంగా వచ్చి ఆటోలో తీసుకెళ్లాలని కేజ్రీవాల్‌ కోరారు.

అడ్డుకున్న పోలీసులు
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కోరిక మేరకు ఆయన ఉంటున్న హోటల్‌కు విక్రమ్‌ దంతానీ వెళ్లగా.. కేజ్రీవాల్‌ అక్కడ రాత్రి 7.30గంటలకు బయల్దేరారు. అయితే, విక్రమ్‌ దంతానీ ఇంటికి ఆటోలో బయల్దేరిన సీఎం కేజ్రీవాల్ ను భద్రతా కారణాలను పేర్కొంటూ అహ్మదాబాద్‌ పోలీసులు వెళ్లకుండా అడ్డుకున్నారు. దీంతో కేజ్రీవాల్‌ కలగజేసుకొని వారించడంతో చివరకు అనుమతించారు. ఆటోడ్రైవర్‌ ఇంటికి వెళ్లిన కేజ్రీవాల్‌.. అతడితో కలిసి వారింట్లో భోజనం చేశారు. కేజ్రీవాల్ వెంట గుజరాత్ రాష్ట్రానికి చెందిన ఆప్ నేతలు కూడా ఉన్నారు. కేజ్రీవాల్ ఆటోలో విక్రమ్‌ దంతానీ ఇంటికి వెళ్తున్న వీడియోలు, డ్రైవర్‌ ఇంట్లో భోజనం చేస్తున్న ఫొటోలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ ఏడాది గుజరాత్‌ లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. ఈ ఎన్నికలపై దృష్టిపెట్టిన ఆమ్‌ ఆద్మీ పార్టీ నేతలు అక్కడ పర్యటిస్తూ ముమ్మర ప్రచారం చేస్తున్నారు.