
బాలీవుడ్ స్టార్ ఆమీర్ ఖాన్ నుంచి సినిమా వచ్చి ఏడాది దాటింది. గతేడాది ఆగస్టులో ఆయన నటించిన ‘లాల్ సింగ్ చద్దా’ విడుదలై నిరాశ పరిచింది. ఆ రిజల్ట్‌తో కెరీర్‌లో బ్రేక్ తీసుకున్న ఆయన.. ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేస్తున్నానని, ఇప్పట్లో నటించే ఆలోచనే లేదని చెప్పారు. అయితే ఆయన కొత్త సినిమాకు సంబంధించి మంగళవారం ఓ అప్‌డేట్ తెరపైకొచ్చింది. రాజ్ కుమార్ సంతోషి ఈ కొత్త చిత్రాన్ని డైరెక్ట్ చేయబోతున్నాడట. 30 ఏళ్ల క్రితం ఆయన డైరెక్షన్‌లో ఆమీర్, సల్మాన్ హీరోలుగా ‘అందాజ్ అప్నా అప్నా’ చిత్రం వచ్చింది.
మళ్లీ ఇన్నేళ్ల తర్వాత సంతోషి డైరెక్షన్‌లో సినిమా చేయబోతున్నాడు ఆమీర్ ఖాన్. జియో స్టూడియోస్‌తో కలిసి తన సొంత బ్యానర్‌లో ఈ సినిమాని ఆమీర్ నిర్మించబోతున్నాడట. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా మొదలైందని, జనవరి 20 నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుందని సమాచారం. ఆమీర్ ఖాన్ ప్రొడక్షన్స్‌లో ఇది 16వ చిత్రం. వచ్చే ఏడాది క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 20న సినిమాని విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. మరోవైపు చాంపియన్స్, జయ జయ జయహే రీమేక్స్‌తో సహా పలు చిత్రాలతో నిర్మాతగానూ ఆమీర్ ఖాన్ బిజీగా ఉన్నారు.