3 లోక్ సభ, 7 అసెంబ్లీ బైపోల్స్ ఫలితాలివే

3 లోక్ సభ, 7 అసెంబ్లీ బైపోల్స్ ఫలితాలివే

3 లోక్ సభ, 7 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు వచ్చాయి. ఆంధ్రప్రదేశ్ లోని ఆత్మకూరు అసెంబ్లీ స్థానానికి జరిగిన  ఉప ఎన్నికలో మళ్లీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది.  త్రిపురలోని 4 అసెంబ్లీ స్థానాలకుగానూ 3 చోట్ల బీజేపీ విజయ దుందుభి మోగించింది. ఉత్తరప్రదేశ్ లోని  రెండు లోక్ సభ స్థానాల్లోనూ కమలదళం విజయపతాక ఎగురవేసింది.  పంజాబ్ సీఎం  భగ్వంత్ మాన్ గతంలో ప్రాతినిధ్యం వహించిన సంగ్రూర్  లోక్ సభ స్థానం లో శిరోమణి అకాలీదళ్ (అమృత్ సర్) అభ్యర్థి, 77 ఏళ్ల సిమ్రన్ జిత్ సింగ్ మాన్  గెలుపొందారు.  ఢిల్లీలోని రాజిందర్ నగర్ అసెంబ్లీ స్థానంలో ఆప్ ఘన విజయం సాధించింది. జార్ఖండ్, త్రిపురలోని చెరో అసెంబ్లీ స్థానంలో కాంగ్రెస్ గెలుపొందింది. 

ఆంధ్రప్రదేశ్ లోని ఆత్మకూరు అసెంబ్లీ స్థానంలో..

ఆంధ్రప్రదేశ్ లోని ఆత్మకూరు అసెంబ్లీ స్థానానికి జరిగిన  ఉప ఎన్నికలో మళ్లీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఆ పార్టీ అభ్యర్థి మేకపాటి  విక్రమ్ రెడ్డి,  తన సమీప ప్రత్యర్ధి జి.భరత్ కుమార్ (బీజేపీ) పై 82,742 ఓట్ల భారీ మెజారిటీతో విజయ దుందుభి మోగించారు. అభ్యర్థులంతా డిపాజిట్లు కోల్పోయారు.  మేకపాటి విక్రమ్ రెడ్డికి 1,02,074 , బీజేపీ అభ్యర్థి భరత్ కు 19,332, బీఎస్పీకి 4,897 ఓట్లు పోలయ్యాయి. 65 శాతం పోలింగ్ నమోదైంది. రాష్ట్ర మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ఫిబ్రవరిలో హఠాన్మరణం చెందడంతో ఈ ఉప ఎన్నిక జరిగింది.  ఇందులో టీడీపీ, జనసే పార్టీలు అభ్యర్థిని నిలబెట్టలేదు. 

ఢిల్లీ రాజిందర్ నగర్ అసెంబ్లీ స్థానంలో..

ఢిల్లీ రాజిందర్ నగర్ అసెంబ్లీ స్థానానికి  జరిగిన ఉప ఎన్నికల్లో ఆప్ ఘన విజయం సాధించింది. ఆప్ అభ్యర్థి దుర్గేశ్ పాఠక్ సమీప బీజేపీ అభ్యర్థి రాజేష్ భాటియాపై 11 వేల ఓట్లకు పైగా ఆధిక్యంతో విజయం సాధించారు. ఢిల్లీ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ రణబీర్ సింగ్ ఈవిషయాన్ని వెల్లడించారు. ఆదివారం ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభించారు. మొత్తం 16 రౌండ్ల పాటు కౌంటింగ్ కొనసాగింది. ఆప్ అభ్యర్థి 40,319 ఓట్లను సాధించగా.. బీజేపీ అభ్యర్థి 28,851 ఓట్లను పొందారు.  ఉప ఎన్నికలో పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థి ప్రేమ్ లతకు రెండు వేల 14 ఓట్లు మాత్రమే వచ్చాయి. రాజిందర్ నగర్ నియోజకవర్గంలో ఆప్ నేత రాజీవ్ చద్దా ఎమ్మెల్యేగా ఉండేవారు. ఆప్ ఆయనను రాజ్యసభకు ఆప్ నామినేట్ చేయడంతో .. రాజిందర్ నగర్ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. జూన్ 23న ఉప ఎన్నికలో 43.75 శాతమే పోలింగ్ నమోదైంది. 14 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఆప్, బీజేపీ మధ్య హోరాహోరీ పోటీ కొనసాగింది. 

త్రిపురలో.. 

త్రిపురలో నాలుగు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నిక జరగగా.. మూడుచోట్ల బీజేపీ విజయఢంకా మోగించింది. కాంగ్రెస్ ఒక చోట నెగ్గింది. త్రిపుర ముఖ్యమంత్రి, బీజేపీ నేత మాణిక్ సాహా బార్డోవాలీ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. రాజధాని అగర్తలా అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి సుదీప్ రాయ్ బర్మన్ గెలిచారు.  జుబారాజ్ నగర్ నుంచి మాలినా దేవ్ నాథ్( బీజేపీ), సుర్మా స్థానం నుంచి స్వప్నాదాస్ (బీజేపీ) విజయం సాధించారు. 

యూపీలోని ఆజంఘర్ లో.. 

ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం,  సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్, ఆ పార్టీ సీనియర్ నేత ఆజంఖాన్ లు అసెంబ్లీకి ఎన్నికవడంతో ఆజంఘర్, రాంపూర్ లోక్ సభ స్థానాలు ఖాళీ అయ్యాయి. ఇప్పుడు ఆ రెండు స్థానాలకు జరిగిన ఉప ఎన్నికలో ఎస్పీకి షాక్ తగిలింది. రాంపూర్  స్థానం నుంచి బరిలోకి దిగిన ఎస్పీ అభ్యర్థి ఆసిం రాజాను బీజేపీ అభ్యర్థి ఘన్ శ్యాంసింగ్ లోధి 42వేల ఓట్ల తేడాతో ఓడించారు. ఆజంఘర్ స్థానంలో బీజేపీ అభ్యర్థి దినేశ్ లాల్ యాదవ్ నిరాహువా 8వేల ఓట్ల తేడాతో సమీప ప్రత్యర్ధి ధర్మేంద్ర యాదవ్ (ఎస్పీ) పై గెలుపొందారు. దినేశ్ లాల్ యాదవ్ నిరాహువాకు 3.13 లక్షల ఓట్లు, ధర్మేంద్ర యాదవ్ కు 3.04 లక్షల ఓట్లు, బీఎస్పీ అభ్యర్థి ఆలం గుడ్డు జమాలీకి 2.66 లక్షలు ఓట్లు పోల్అయ్యాయి. 

పంజాబ్ లోని సంగ్రూర్ స్థానంలో.. 

గతంలో పంజాబ్ సీఎం, ఆప్ ముఖ్య నేత భగ్వంత్ మాన్ ప్రాతినిధ్యం వహించిన సంగ్రూర్ లోక్ సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో శిరోమణి అకాలీదళ్ (అమృత్ సర్) విజయం సాధించింది. ఆప్ అభ్యర్థి గుర్మైల్ సింగ్ పై శిరోమణి అకాలీదళ్ (అమృత్ సర్) పార్టీ అభ్యర్థి, 77 ఏళ్ల సిమ్రన్ జిత్ సింగ్ మాన్  5,800కుపైగా ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఈ స్థానం నుంచి మొత్తం 16 మంది అభ్యర్థులు పోటీ చేశారు. 

జార్ఖండ్ లో కాంగ్రెస్.. 

జార్ఖండ్  లోని మాండర్ అసెంబ్లీ స్థానంలో కాంగ్రెస్ గెలిచింది. ఆ పార్టీ అభ్యర్థి శిల్పి నేహా తిర్కి దాదాపు 23వేల  ఓట్ల తేడాతో తన సమీప ప్రత్యర్ధి గంగోత్రి కుజూర్ (బీజేపీ)పై గెలుపొందారు. దీంతో జార్ఖండ్ లో కాంగ్రెస్ తరఫున ఎన్నికైన మహిళా ఎమ్మెల్యేల సంఖ్య 5కు పెరిగింది.