న్యూఢిల్లీ: పంజాబ్, హర్యానా జాయింట్ క్యాపిటల్ అయిన చండీగఢ్‌ను నేరుగా రాష్ట్రపతి పరిధిలోకి తీసుకురావాలని కేంద్రం యోచిస్తోంది. ఇందుకోసం రాజ్యాంగంలోని ఆర్టికల్ 131 సవరణ బిల్లును ఈ శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతున్నది. ప్రభుత్వ నిర్ణయాన్ని ఆప్, కాంగ్రెస్, శిరోమణి అకాలీదళ్ నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఉభయ సభల్లో బిల్లును అడ్డుకుంటామని హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం చండీగఢ్పాలన పార్లమెంట్ చట్టాల ద్వారా జరుగుతోంది.
ఏ చిన్న చట్టాన్ని మార్చాలన్నా, సవరణ చేయాలన్నా పార్లమెంట్ ఆమోదం తప్పనిసరి అవుతోంది. దీంతో పాలనాపరమైన నిర్ణయాల్లో జాప్యం చోటుచేసుకుంటోంది. ఈ పరిస్థితిని తప్పించాలంటే మిగతా చట్టసభల్లేని కేంద్ర పాలిత ప్రాంతాలు (అండమాన్ - నికోబార్ దీవులు, దాద్రా-నగర్ హవేలీ, డామన్ డయ్యూ) మాదిరిగా చండీగఢ్‌ను కూడా ఆర్టికల్ 240 పరిధిలోకి తీసుకురావాలి.
దీనివల్ల పార్లమెంటుతో సంబంధం లేకుండా, కేంద్ర ప్రభుత్వం (రాష్ట్రపతి ద్వారా) చండీగఢ్ చట్టాలను వేగంగా మార్చవచ్చు లేదా కొత్తవాటిని తేవచ్చు. ఇందుకోసం కేంద్రం రాజ్యాంగ సవరణ బిల్లును సిద్ధం చేసింది. అయితే, ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్, అకాలీదళ్ ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా కేంద్ర ప్రభుత్వం స్పందిస్తూ ఆర్టికల్ 131 సవరణ బిల్లుపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని వెల్లడించింది. ఈ ప్రతిపాదన ప్రస్తుతం పరిశీలనలో ఉందని, అందరితో చర్చించాకే బిల్లుపై నిర్ణయం తీసుకుంటామని తెలిపింది.
పంజాబ్‌లో విడదీయరాని భాగం..
పంజాబ్‌ను లాక్కునేందుకు బీజేపీ కుట్ర చేస్తోందని ఆ రాష్ట్ర సీఎం భగవంత్ మాన్ ఆరోపించారు. చండీగఢ్ గతంలో, ప్రస్తుతం, భవిష్యత్తులో కూడా పంజాబ్‌లోని విడదీయరాని భాగమని పేర్కొన్నారు. పంజాబ్ గుర్తింపుపై కేంద్రం దాడి చేస్తున్నదని ఆప్ అగ్రనేత అర్వింద్ కేజ్రీవాల్ మండిపడ్డారు. 131 బిల్లు సవరణ ఆందోళనకరమని కాంగ్రెస్, అకాలీదళ్ నేతలు విమర్శించారు.
