ఆప్ దేశంలో కాంగ్రెస్ స్థానాన్ని భర్తీ చేయబోతోంది

 ఆప్ దేశంలో కాంగ్రెస్ స్థానాన్ని భర్తీ చేయబోతోంది

న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ చరిత్ర సృష్టించబోతోంది. ఢిల్లీ వెలుపల పంజాబ్ రాష్ట్రంలో క్లీన్ స్వీమ్ మెజారిటీతో  అధికారం చేజిక్కించుకోవడంతోపాటు టూరిస్టు స్టేట్ గోవా రాష్ట్రంలోనూ రెండు స్థానాల్లో గెలిచి బోణీ కొట్టింది. ఈ వార్త రాసే సమయానికి అందిన సమాచారం మేరకు 117 స్థానాలున్న పంజాబ్ లో ఆప్ సగానికిపైగా స్థానాలను కైవసం చేసుకుని ఘన విజయం సాధించి జాతీయ స్థాయిలో తృతీయ  శక్తిగా అవతరించింది. పంజాబ్ రాష్ట్రంలో ఘన విజయం సాధించి ఇతర రాష్ట్రాల్లోనూ సత్తా చాటుకుంటుడడాన్ని
స్వాగతిస్తూ పార్టీ నేతలు, కార్యకర్తలు సంబరాలు జరుపుకున్న సందర్భంగా ఆప్ పార్టీ కీలక నేత రాఘవ్ చద్దా మీడియాతో మాట్లాడుతూ ఆప్ ఇప్పుడు జాతీయ శక్తిగా అవతరించిందన్నారు. 
ఆప్ ఇక ప్రాంతీయ పార్టీ కాదని.. దేశంలో బీజేపీకి ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ స్థానాన్ని ఆప్ భర్తీ చేయబోతోందని పేర్కొన్నారు. రాజకీయ పార్టీగా ఆప్ కు ఇవాళ అద్భుతమైన సుదినం అని అభివర్ణించారు. దేవుడి ఆశీస్సులతో తమ నేత అరవింద్ కేజ్రీవాల్ దేశాన్ని ముందుకు నడిపించాలని కోరుకుంటున్నామని అన్నారు. ప్రస్తుతం దేశంలో అధికారంలో ఉన్న బీజేపీ రెండు సీట్లు గెలుచుకోవడానికి చాలా కాలం ఎదురు చూసిందని.. అయితే తమ పార్టీ 2012లోనే ఏర్పాటై ఢిల్లీలో సుస్థిర ప్రభుత్వాన్ని నడుపుతూ అందరికీ ఆదర్శంగా నిలుస్తోందన్నారు.