అదేమన్నా గ్రామ పంచాయతీ సమావేశమా..? ప్రభుత్వ మీటింగ్‎లో CM రేఖా గుప్తా భర్త పాల్గొనడంపై ఆప్ ఫైర్

అదేమన్నా గ్రామ పంచాయతీ సమావేశమా..? ప్రభుత్వ మీటింగ్‎లో CM రేఖా గుప్తా భర్త పాల్గొనడంపై ఆప్ ఫైర్

న్యూఢిల్లీ: ఢిల్లీ సీఎం రేఖా గుప్తా భర్త మనీశ్ గుప్తా ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనడంపై ప్రతిపక్ష ఆమ్‌‌ ఆద్మీ పార్టీ మండిపడింది. ఇదేమన్నా గ్రామ పంచాయతీ సమావేశం అనుకున్నారా అని ప్రశ్నించింది. ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లో మనీశ్‌‌ గుప్తా పాల్గొనడం ఇదేమీ మొదటిసారి కాదని, గత ఏప్రిల్‌‌లో ఆయన వివిధ కార్యక్రమాలకు హాజరయ్యారని ఢిల్లీ మాజీ సీఎం అతిశీ విమర్శించారు. రాష్ట్రంలో ప్రధాన్‌‌పతి (గ్రామాల్లో మహిళ సర్పంచ్‌‌ అయితే ఆమె భర్త పాలన వ్యవహారాలు చూడటం) పాలన నడుస్తోందని ఎద్దేవా చేశారు. దీనిపై బీజేపీ నేతలు స్పందిస్తూ.. సీఎం భర్త ప్రభుత్వ మీటింగ్‌‌లో కూర్చుంటే తప్పేముందని ప్రశ్నించారు. 

అసలేం జరిగిందంటే..

ఆదివారం షాలిమర్‌‌ బాగ్‌‌లో డెవలప్‌‌మెంట్‌‌ ప్రాజెక్టులకు సంబంధించి జరిగిన రివ్యూ మీటింగ్‌‌లో రేఖా గుప్తా పక్కన ఆమె భర్త మనీశ్‌‌ గుప్తా కూర్చొని ఉన్నారు. మీటింగ్‌‌కు సంబంధించిన ఫొటోలను సీఎం రేఖా గుప్తా ఇన్‌‌స్టాగ్రామ్‌‌, సీఎంవో అఫీషియల్‌‌ ‘ఎక్స్‌‌’అకౌంట్‌‌లో పోస్ట్‌‌ చేశారు. దీనిపై ఆప్‌‌ లీడర్‌‌ సౌరభ్‌‌ భరద్వాజ్‌‌ మాట్లాడుతూ.. ఢిల్లీ ప్రభుత్వంలో ఎలాంటి పదవీ లేని మనీశ్​ గుప్తా ఉన్నతాధికారుల సమావేశంలో ఏ హోదాలో పాల్గొన్నారని నిలదీశారు. 

అధికారిక సమావేశంలో అనధికారిక వ్యక్తులు కూర్చోవడం రాజ్యాంగ విరుద్ధం అన్నారు. ఇది గ్రామ స్థాయిలో మహిళా సర్పంచ్‎ల భర్తలు అధికారం చెలాయించడాన్ని గుర్తుచేస్తోందని విమర్శించారు. మనీశ్ గుప్తా ప్రభుత్వ మీటింగ్‌‌లో పాల్గొనడంతో పాటు తనిఖీలు కూడా నిర్వహిస్తున్నారని, ఇది ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీస్తుందని పేర్కొన్నారు. అధికారులకు ఆఫీషియల్‌‌గా ఆర్డర్స్‌‌ కూడా ఇస్తున్నారన్నారు.