
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఇవాళ ఉదయం అరెస్ట్ అయిన అమిత్ అరోరా రిమాండ్ రిపోర్టులో ఎమ్మెల్సీ కవిత పేరును ఈడీ ప్రస్తావించడం కలకలం సృష్టించింది. ఆమ్ ఆద్మీ పార్టీకి కమీషన్ల కోసమే ఢిల్లీ లిక్కర్ పాలసీలో అత్యధికంగా మార్జిన్ పెట్టారని అందులో ఆరోపించారు. ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున విజయ్ నాయర్ రూ.100 కోట్ల ముడుపులు తీసుకున్నట్లు చెప్పారు. విజయ్ నాయర్ కు సౌత్ గ్రూప్ నుంచి వంద కోట్లు అందాయని, సౌత్ గ్రూప్ లో ఎమ్మెల్సీ కవిత, ఏపీ వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు, శరత్ రెడ్డి ఉన్నారని ఈడీ తెలిపింది.
32 పేజీల ఈడీ రిమాండ్ రిపోర్టులోని పలు కీలక అంశాలివీ..
- ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా పేరును కీలకంగా ప్రస్తావించిన ఈడీ.
- ఢిల్లీలోని 32 జోన్లలో జోన్ల వారీగా లిక్కర్ లైసెన్సులు పొందినవాళ్లలో సమీర్ మహేందు, మాగుంట రాఘవ, శరత్ చంద్రారెడ్డి, అమిత్ అరోరాకు చెందిన కంపెనీలు ఉన్నాయి. మరికొన్ని కంపెనీల వెనుక ఎవరున్నారు అనేది ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది.
- ఎక్సైజ్ పాలసీ తయారీలో కీలకంగా ఉన్న మంత్రుల బృందంలో మనీశ్ సిసోడియా, సత్యేంద్ర జైన్, కైలాష్ గెహ్లాట్ ఉన్నారు. నిపుణుల కమిటీ రిపోర్ట్, పబ్లిక్ సూచనలకు విరుద్ధంగా ఢిల్లీ మంత్రుల బృందం లిక్కర్ పాలసీని తయారు చేసింది. పాలసీ ఫైనల్ అయిన 3 నెలల తర్వాత ఆలస్యంగా పబ్లిక్ డొమైన్ లో పెట్టారు.
- హోల్ సేల్ లిక్కర్ వ్యాపారాన్ని తయారీ నుంచి వేరు చేసి, పూర్తిగా ప్రైవేటుకే ఇచ్చేలా లిక్కర్ పాలసీలో ఢిల్లీ మంత్రుల బృందం మార్పులు చేసింది.
- లిక్కర్ విక్రయాల ద్వారా హోల్సేల్ మద్యం సంస్థలకు వచ్చే లాభం పాత పాలసీలో 5 శాతమే ఉంది. అయితే దీన్ని అరవింద్ కేజ్రీవాల్ సర్కారు ఏకంగా 12 శాతానికి పెంచింది. ఇంత భారీగా పెంచడానికి అర్థంలేని కారణాలను చూపించారు. మరోవైపు ఎక్స్ పర్ట్ కమిటీ రిపోర్ట్ ను అమలు చేయలేదు.
- కొన్ని నిర్ధారించని ప్రాంతాల్లో షాపులు తీయలేమన్న పేరుతో లైసెన్స్ పొందినవారి ఫీజును భారీగా తగ్గించారు. కానీ గత మూడేళ్ల కంటే ఈ పాలసీ కాలంలో సేల్స్ భారీగా పెరిగాయి. కొన్ని షాపులు తీయలేకపోవడం వల్ల వారికి ఎలాంటి నష్టం కలగలేదు. కానీ లైసెన్స్ ఫీజు తగ్గించడం వల్ల వ్యాపారులకు రూ.719 కోట్ల అనవసర లాభం కలిగించారు. ఈ మేరకు ఖజానాకు నష్టం జరిగింది. లైసెన్స్ ఫీజులను తగ్గించడం, పలు ఇతర మినహాయింపుల కారణంగా రూ.2,873 కోట్ల నష్టం జరిగింది.
- లిక్కర్ పాలసీలో మార్పులపై నిందితుల మధ్య పాలసీ డాక్యుమెంట్ షేర్ అయినట్లు వాట్సాప్ డేటా ఉంది.
ఆధారాలు దొరకకుండా 153 ఫోన్లు ధ్వంసం
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో దాదాపు 36 మంది నిందితులు/అనుమానితులు ఉన్నారని అమిత్ అరోరా రిమాండ్ రిపోర్టులో ఈడీ పేర్కొంది. వారందరూ దాదాపు 170 ఫోన్లను వినియోగించారని.. అయితే వాటిలో కేవలం 17 ఫోన్లే తమకు దొరికాయని ఈడీ తెలిపింది. అమిత్ అరోరా వాడిన 11 ఫోన్లను, ఎమ్మెల్సీ కవిత వాడిన 10 ఫోన్లను ఆధారాలు దొరకకుండా ధ్వంసం చేశారని పేర్కొంది. ఈ కేసులో ధ్వంసమైన 153 ఫోన్ల విలువ దాదాపు రూ.1.38 కోట్లు ఉంటుందని ఈడీ అంచనా వేసింది.
ఎవరీ అమిత్ అరోరా ?
గురుగ్రామ్ కు చెందిన అమిత్ అరోరా బడ్డీ రిటైల్ కంపెనీ డైరెక్టర్గా ఉన్నారు. ఢిల్లీ మద్యం పాలసీ రూపకల్పనలో ఆయన కీలకంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా సన్నిహితుల్లో అమిత్ ఒకరు.ఇవాళ ఉదయం ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ మద్యం వ్యాపారి అమిత్ అరోరాను అరెస్ట్ చేసింది. సిసోడియాకు అర్జున్ పాండే, దినేశ్ అరోరా, అమిత్ అరోరా అత్యంత సన్నిహితులు కాగా.. వీరిలో దినేశ్ అరోరా సీబీఐ కేసులో అప్రూవర్గా మారాడు. అధికారులు అతడి స్టేట్మెంట్ కూడా రికార్డు చేశారు.
సీబీఐ ఛార్జ్షీట్ లో ఏముంది ?
మరోవైపు ఈ కేసులో సీబీఐ తొలి ఛార్జ్షీట్ ఫైల్ చేసింది. సుమారు 10 వేల పేజీల ఛార్జ్షీట్ ను రౌస్ అవెన్యూ కోర్టులో అధికారులు దాఖలు చేశారు. ఛార్జ్షీట్ లో A1 గా కుల్దీప్ సింగ్, A2 గా నరేంద్ర సింగ్, A3గా విజయ్ నాయర్, A4 గా అభిషేక్ బోయిన పల్లి ఉన్నారు. ఈ కేసులో మొదట సీబీఐ విచారణ జరపగా.. తర్వాత ఈడీ రంగంలోకి దిగింది. విజయ్ నాయర్, అభిషేక్ రావుకు ఇప్పటికే సీబీఐ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. దానిపై స్టే ఇచ్చేందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది.