పంజాబ్ ప్రజలు అద్బుతం సృష్టించారు

పంజాబ్ ప్రజలు అద్బుతం సృష్టించారు

ఆమ్ ఆద్మీ పార్టీ కాదు.. ఓ విప్లవమని అన్నారు ఆ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్. సీఎం చరణ్ జీత్ సింగ్ చన్నీ, నవజ్యోత్ సింగ్ సిద్ధూ, కెప్టెన్ అమరీందర్, సుఖ్ బీర్ సింగ్లను ఓడించి పంజాబ్ ప్రజలు అద్బుతం సృష్టించారని అన్నారు. ఆమ్ ఆద్మీ తరఫున పోటీ చేసిన ఓ సాధారణ వ్యక్తి చరణ్ జీత్ సింగ్ చన్నీని ఓడించిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. చన్నీని ఓడించిన వ్యక్తి మొబైల్ రిపేరింగ్ షాపులో పనిచేస్తారని, ఆయన తల్లి ఓ ప్రభుత్వ పాఠశాలలో క్లీనర్ అని చెప్పారు. ఓ సాధారణ వాలంటీర్ మజీతియాను ఓడించారన్న కేజ్రీవాల్.. సామాన్యులు పోరాటం చేయాల్సిన సమయం వచ్చిందనడానికి ఇదే నిదర్శనమని అన్నారు. పంజాబ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్న భగవంత్ సింగ్ మాన్కు అభినందనలు తెలిపారు.

విద్యార్థులు మెడిసిన్ చదివేందుకు ఉక్రెయిన్ వెళ్లాల్సిన అవసరం లేని భారత్ ను సృష్టిద్దామని అరవింద్ కేజ్రీవాల్ పిలుపునిచ్చారు. పంజాబ్ ఎన్నికల ఫలితాలతో ప్రజలు కేజ్రీవాల్ టెర్రరిస్టు కాదు.. నిజమైన దేశభక్తున్నని నిరూపించారని చెప్పారు. ఈ సందర్భంగా బ్రిటీషర్లను వెళ్లగొట్టినా వ్యవస్థను మార్చకపోతే ప్రయోజనం లేదన్న భగత్ సింగ్ మాటల్ని కేజ్రీవాల్ గుర్తుచేశారు. గత 75 ఏళ్లుగా అధికారంలో ఉన్న పార్టీలు బ్రిటీష్ వ్యవస్థను కొనసాగించాయని అందుకే దేశ ప్రజలు పేదరికంలో కూరుకుపోయారని అభిప్రాయపడ్డారు. రాజకీయాల్లో నిజాయితీగా వ్యవహరిస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ వ్యవస్థను సమూలంగా మార్చేస్తుందని కేజ్రీవాల్ హామీ ఇచ్చారు.