గుజరాత్ ఎన్నికల్లో ఆప్, ఎస్పీ, బీఎస్పీ, బీటీపీ జోరు

గుజరాత్ ఎన్నికల్లో ఆప్, ఎస్పీ, బీఎస్పీ, బీటీపీ జోరు

అహ్మదాబాద్: పోయినసారి ఎన్నికల్లో చాలా తక్కువ ఓట్లే వచ్చినా.. తమ క్యాండిడేట్లలో చాలా మంది డిపాజిట్లు కూడా దక్కించుకోకపోయినా.. ఈసారి కూడా తగ్గేదేలే అన్నట్లుగా ఆప్, ఎస్పీ, బీఎస్పీ, బీటీపీ పార్టీలు గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల బరిలోకి పెద్దఎత్తున క్యాండిడేట్లను పోటీకి దింపాయి. వచ్చే నెల 1, 5 తేదీల్లో రెండు దశల్లో అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్​ జరగనుంది. రాష్ట్ర అసెంబ్లీలో మొత్తం 182 సీట్లు ఉండగా, ప్రస్తుతం బీజేపీకి 110, కాంగ్రెస్ కు 60, బీటీపీకి ఇద్దరు, ఇద్దరు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు ఉన్నారు. మరో 8 సీట్లు ఖాళీగా ఉన్నాయి. అయితే, పోయినసారి(2017) ఎన్నికల్లో1 శాతం కన్నా తక్కువ ఓట్లే తెచ్చుకున్న ఆప్, ఎస్పీ, బీఎస్పీ, బీటీపీ పార్టీలు ఈసారి భారీగా క్యాండిడేట్లను రంగంలోకి దింపాయి. అధికార పార్టీ బీజేపీ అన్ని స్థానాల్లో పోటీ చేస్తుండగా, ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ 179 సీట్లలో పోటీ చేస్తోంది. కాంగ్రెస్ మిత్రపక్షం ఎన్సీపీ రెండు చోట్ల బరిలోకి దిగింది. తొలిసారిగా ఎంఐఎం కూడా 13 మందిని రంగంలోకి దించింది.    

ఎస్పీ.. గెలిచిన ఓట్లు 0.01%

పోయిన ఎన్నికల్లో కేవలం నాలుగు సీట్లలో పోటీ చేసిన సమాజ్ వాదీ పార్టీ (ఎస్పీ).. 0.01 శాతం ఓట్లు మాత్రమే పొందింది. ఇప్పుడు 17 సీట్లలో పోటీ చేస్తోంది. ఇటీవల ఎన్సీపీ నుంచి ఎస్పీలో చేరిన ఎమ్మెల్యే కంధల్ భాయ్ జడేజానే ఈ పార్టీకి ఇక్కడ మెయిన్ క్యాండిడేట్ గా ఉన్నారు. ఎస్పీ తరఫున 2017లో పోటీ చేసిన నలుగురూ డిపాజిట్లు కోల్పోయారు. 

బీటీపీ.. రెండు సీట్లు గెలిచినా.. 

భారతీయ ట్రైబల్ పార్టీ(బీటీపీ) పోయినసారి కంటే ఇప్పుడు 4 రెట్లు ఎక్కువగా, 26 సీట్లలో పోటీ చేస్తోంది. 2017 ఎన్నికల్లో ఈ పార్టీ రెండు సీట్లను గెలుచుకుంది. కానీ 0.74 శాతం ఓట్లు మాత్రమే పొందింది. బీటీపీ నుంచి పోటీ చేసినవారిలో నలుగురికి 
డిపాజిట్లు కూడా గల్లంతయ్యాయి. 

బీఎస్పీ.. డిపాజిట్లన్నీ గల్లంతు 

2017 గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) కూడా 0.69 ఓట్లు మాత్రమే పొందింది. ఆ పార్టీ క్యాండిడేట్లంతా డిపాజిట్లు కోల్పోయారు. పోయిన ఎన్నికల్లో 139 మందికి బీఎస్పీ టికెట్లు ఇచ్చింది. ఈసారి 101 మంది క్యాండిడేట్లను బరిలోకి దింపింది.  

ఎన్సీపీ.. ఒక సీటు గెలిచినా.. 

పోయిన ఎన్నికల్లో ఎన్సీపీ పొత్తు లేకుండా 58 సీట్లకు పోటీ చేసింది. 56 మంది డిపాజిట్లు గల్లంతయ్యాయి. పార్టీకి 0.62 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. అయితే, ఒక సీటును మాత్రం గెలవగలిగింది. కానీ ఆ ఒక్క ఎమ్మెల్యే కంధల్ భాయ్ ఇటీవలే ఎస్పీలో చేరారు. 

 

ఆప్.. డిపాజిట్లు గల్లంతు 

2017 నాటి గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో  ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) 29 సీట్లలో పోటీ చేసింది. ఎక్కడా డిపాజిట్ కూడా దక్కలేదు. మొత్తంగా 0.1 శాతం ఓట్లు మాత్రమే పడ్డాయి. కానీ.. ఈసారి ఏకంగా 181 సీట్లలో ఆప్ తన క్యాండిడేట్లను ఎన్నికల బరిలోకి దింపింది. 

ఇండిపెండెంట్లు 700పైనే.. 

గుజరాత్​లో పోయిన అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 794 మంది ఇండిపెండెంట్లు పోటీ చేశారు. వీరిలో ఇద్దరు ఎమ్మెల్యేలుగా గెలిచారు. ఈసారి రెండు విడతల్లో కలిపి మొత్తం 724 మంది స్వతంత్రులుగా బరిలో నిలిచారు.