పెంచిన ‘ఆసరా పెన్షన్’ ఈరోజు నుండే: నేరుగా లబ్ధిదారుల అకౌంట్లలో పైసలు

పెంచిన ‘ఆసరా పెన్షన్’ ఈరోజు నుండే: నేరుగా లబ్ధిదారుల అకౌంట్లలో పైసలు

పెంచిన ఆసరా పెన్షన్ల​ను రాష్ట్ర ప్రభుత్వం సోమవారం నుంచి అందజేయనుంది. ఇందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. లబ్ధిదారులకు ఇప్పటికే పెన్షన్ పేపర్లను పంపిణీ చేసింది. దీంతో లబ్ధిదారుల బ్యాంకు, పోస్టాఫీసు ఖాతాల్లో పెన్షన్లు జమకానున్నాయి.

కొత్తగా మరో 7 లక్షల మంది
వికలాంగులకు ఇస్తున్న రూ.1,500 పెన్షన్ ను రూ.3,016కు.. వితంతువులు, గీత, చేనేత, బీడీ కార్మికులు, హెచ్ఐవీ, బోదకాలు బాధితులకు ఇస్తున్న రూ.1,000 పెన్షన్​ను రూ.2,016కు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అలాగే పెన్షన్ అర్హత వయసును 62 ఏళ్ల నుంచి 57 ఏళ్లకు తగ్గిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ప్రభుత్వం ఇప్పటి వరకు 39 లక్షల మందికి ఆసరా పెన్షన్లు ఇస్తోంది. ఇందుకు రూ.5,500 కోట్లు ఖర్చు చేస్తోంది. వయసు తగ్గింపుతో పెన్షన్ తీసుకునే వారు కొత్తగా మరో 7 లక్షల మంది యాడ్ అవుతారని అధికారులు అంచనా వేస్తున్నారు. కాగా, ఈ ఏడాది ప్రవేశపెట్టిన ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ లో పెన్షన్ల కోసం రూ.12,600 కోట్ల నిధులను ప్రభుత్వం కేటాయించింది.

నిదానంగా లబ్ధిదారుల ఎంపిక
పెంచిన పెన్షన్ ను ఏప్రిల్ నుంచి ఇస్తామని సీఎం కేసీఆర్.. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత ప్రకటించారు. కానీ జనవరి నుంచి వరుసగా గ్రామ పంచాయతీ, ఎమ్మెల్సీ, లోక్ సభ, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు జరగడం వల్ల లబ్ధిదారుల ఎంపిక ఆలస్యమైంది. ప్రస్తుతం అన్ని జిల్లాల్లో పూర్తయినా, హైదరాబాద్ లో పెండింగ్​లో ఉందని సెర్ప్ అధికారులు చెబుతున్నారు. హైదరాబాద్ కలెక్టరేట్, జీహెచ్ఎంసీ అధికారుల మధ్య సమన్వయం లోపం వల్ల ఆలస్యమవుతోందని అంటున్నారు. ఈనెల 25 కల్లా ఎంపిక పూర్తి  చేయాల్సి ఉంది. కానీ 3 రోజులే గడువు ఉండటంతో ఆ లోగా అర్హుల ఎంపిక పూర్తి కాకపోవచ్చని తెలుస్తోంది. 25 కల్లా అర్హుల జాబితా ఖరారు చేసి ఇస్తేనే వచ్చే నెల కొత్త వాళ్లకు పెన్షన్ ఇవ్వటం సాధ్యమవుతుందని సెర్ప్ డైరెక్టర్ నవీన్ కుమార్ తెలిపారు.

ప్రతినెల తగ్గుతున్నరు
ప్రతి నెల ఆసరా పెన్షన్ తీసుకునే వారి సంఖ్య తగ్గుతోంది. యావరేజ్ గా 5 వేల మంది తగ్గుతున్నారని అధికారులు చెబుతున్నారు. జూన్ నెలలో
రాష్ట్రవ్యాప్తంగా 39,09,786 లక్షల మంది పెన్షన్ అందుకున్నారు.

మున్సిపల్ ఎన్నికల కోసమేనా?
రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కోడ్ వల్ల అడ్డంకులు ఎదురు కాకుండా ఉండేందుకే పెన్షన్లను పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో పెన్షన్ పత్రాల పంపిణీ కార్యక్రమాన్ని శనివారం పూర్తి చేశారు.

 

జూన్​లో పెన్షన్ తీసుకున్న వారు

వృద్ధు లు 12,99,177
వికలాంగులు 4,90,306
వితంతువులు 14,37,654
చేనేత కార్మికులు 37,135
గీత కార్మికులు 62,529
హెచ్ఐవీ బాధితులు 28,471
బోదకాలు బాధితులు 14,132
బీడీ కార్మికులు 4,08487
ఒంటరి మహిళలు 1,31949
మొత్తం 39,09,786

25లోగా ఎంపిక పూర్తి కావాలి

‘‘ఆసరా పెన్షన్ల లబ్ధిదారుల ఎంపిక పక్రియను ఈ నెల 25 కల్లా పూర్తి చేయాలి. ఇందుకు 2018 నవంబర్​లో రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రకటించిన ఓటర్ జాబితాను పరిగణనలోకి తీసుకోవాలి. హైదరాబాద్  జిల్లాలో 57 ఏళ్లకు పైబడిన వారి జాబితాను రూపొందించాలి.

—- దానకిషోర్, జీహెచ్ఎంసీ కమిషనర్