యాదిలో.. ఫాదర్​ ఆఫ్​ ఇండియన్​ కెమిస్ట్రీ : సర్ ప్రఫుల్ల చంద్రరాయ్

యాదిలో.. ఫాదర్​ ఆఫ్​ ఇండియన్​ కెమిస్ట్రీ : సర్ ప్రఫుల్ల చంద్రరాయ్

సర్ ప్రఫుల్ల చంద్రరాయ్ 1861 ఆగస్టు 2న జన్మించాడు. తండ్రి హరిస్ చంద్ర రాయ్ పెద్ద భూస్వామి. 1870లో వాళ్ల కుటుంబం మొత్తం కలకత్తాకు వెళ్లిపోవడంతో ప్రఫుల్లా రాయ్​ అక్కడి హేర్ స్కూల్‌లో చేరాడు. అప్పుడే అతిసార వ్యాధి సోకడంతో కొన్నేండ్లు ఇంట్లోనే చదువుకున్నాడు. కోలుకున్న తర్వాత ఆల్బర్ట్ స్కూల్​లో చేరాడు. 1879లో ఎంట్రన్స్ ఎగ్జామ్ పాసయ్యి పండిత ఈశ్వర చంద్ర విద్యాసాగర్ స్థాపించిన ‘మెట్రో పాలిటన్ ఇన్​స్టిట్యూట్’లో చేరాడు. అదే టైంలో తండ్రి చేసిన అప్పుల వల్ల కుటుంబ ఎస్టేట్స్ హారతి కర్పూరంలా కరిగిపోయాయి. అయినా ప్రఫుల్లా భయపడలేదు. 1882లో గిల్ క్రిస్ట్ స్కాలర్​షిప్ పరీక్షలో ఉత్తీర్ణుడు కావడంతో పై చదువులకు యూరప్ వెళ్లడానికి అవకాశం దొరికింది. 

1882 అక్టోబర్​లో ఆయన ఎడిన్ బర్గ్ యూనివర్సిటీలో చేరాడు. రాయ్​ తీసుకున్న సబ్జెక్టులు కెమిస్ట్రీ, ఫిజిక్స్, బోటనీ, జువాలజీ. కానీ.. ఆయన మాత్రం కెమిస్ట్రీ మీదే అభిరుచి పెంచుకున్నాడు. కష్టపడి చదివి ఇన్ ఆర్గానిక్ కెమెస్ట్రీలో థీసిస్​ రాసి, 1888లో డిగ్రీ పొందాడు. తర్వాత ఆయనకు గిల్​క్రిస్ట్ ఫౌండేషన్ నుంచి ప్రత్యేక స్కాలర్​షిప్​, హోప్ ప్రైజ్ స్కాలర్​షిప్ ఇచ్చి.. ఎడింబర్గ్ యూనివర్సిటీ కెమికల్ సొసైటీకి వైస్- ప్రెసిడెంట్​గా ఎన్నుకొని గౌరవించారు. 

1888లో ఇండియాకు తిరిగి వచ్చి కలకత్తా ప్రెసిడెన్సీ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్​గా చేరాడు. యువ విద్యార్థుల్లో రీసెర్చ్​ పట్ల ఆసక్తి పెంపొందించేందుకు చాలా కృషి చేశాడు. 1896లో ‘మెర్క్యురస్​ నైట్రైట్’ ఆవిష్కరణతో ఎంతో ఖ్యాతిని పొందాడు. 1916లో రిటైర్​ అయ్యాడు. తర్వాత యూనివర్సిటీ కాలేజీ ఆఫ్ సైన్స్​కు చెందిన కెమికల్ లాబొరేటరీస్ డైరెక్టర్​గా చేరాడు. ఆయన 15 సంవత్సరాల జీతం పూర్తిగా లాబొరేటరీ పరికరాలు, రీసెర్చ్ ఫెలోషిప్స్ కోసమే ఖర్చు చేశాడు. 1936లో ‘ఎమెరిటస్ ప్రొఫెసర్ ఆఫ్ కెమిస్ట్రీ’గా కలకత్తా యూనివర్సిటీలో చేరాడు.  

రాయ్​ ఎన్నో పరిశ్రమలు నెలకొల్పడానికి కారకుడయ్యాడు. తన ఇంట్లోనే ఫార్మాస్యూటికల్స్ తయారీ ప్లాంట్​ ఏర్పాటుచేశాడు.  కొన్ని రోజుల్లో ఆయన బెడ్ రూం తప్ప మిగతా ఇల్లంతా ఒక ఫ్యాక్టరీలా మారిపోయింది. ఆయన తయారుచేసిన ప్రొడక్ట్స్ నాణ్యమైనవిగా గుర్తింపు పొందాయి. వ్యాపారం వేగంగా విస్తరించింది. 1902లో ‘ది బెంగాల్ కెమికల్ అండ్ ఫార్మాస్యూటికల్ వర్క్స్’ పేరుతో 2 లక్షల రూపాయలతో ఒక లిమిటెడ్​ కంపెనీ పెట్టాడు. తన వాటా లాభాలతో రాయ్​ ఒక ట్రస్ట్ ఏర్పాటుచేశాడు.  సొంత జిల్లా ఖుల్నాలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేశాడు. ఇప్పుడు బెంగాల్ కెమికల్ అండ్ ఫార్మాస్యూటికల్ వర్క్స్​ ప్రపంచవ్యాప్తంగా పేరొందింది.

పది సంవత్సరాల పరిశోధన, కఠిన పరిశ్రమ ఫలితంగా ‘హిస్టరీ ఆఫ్ హిందూ కెమిస్ట్రీ’ రెండు వాల్యూమ్స్​ ప్రచురించాడు. అవి ఆయనకు ఎంతో పేరు తెచ్చిపెట్టాయి. బెంగాల్ విద్య, రాజకీయ రంగాల్లో కూడా తనదైన ముద్రవేశాడు. 1911లో ఆయనకు ‘కంపానియన్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఇండియన్ ఎంపైర్’ అనే బిరుదు ఇచ్చారు. ఆ తర్వాత ‘నైట్ హుడ్’ ప్రదానం చేశారు. 1934 లో ఆయనను ‘ఆనరరీ ఫెలో ఆఫ్ ది కెమికల్ సొసైటీ ఆఫ్ లండన్’గా ఎన్నుకున్నారు. అంతేకాదు రాయ్​ ‘ఫాదర్​ ఆఫ్​ ఇండియన్​ కెమిస్ట్రీ’గా కూడా గుర్తింపు దక్కించుకున్నాడు. 

- మేకల  మదన్​మోహన్​ రావు కవి, రచయిత