
White Collar Jobs: భారత వైట్ కాలర్ సెగ్మెంట్ జూలైలో నియామకాలు ఏడాది ప్రాతిపధికన 7శాతం వృద్ధి చెందాయి. డాక్టర్లు, సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు వంటి ఆఫీసుల్లో చేసే జాబ్స్ వైట్ కాలర్ కిందకు వస్తాయి. ప్రధానంగా నాన్ ఐటీ రంగాలైన హాస్పిటాలిటీలో డిమాండ్ 26శాతం, ఇన్సూరెన్స్ రంగంలో 22శాతం, ఎడ్యుకేషన్ రంగంలో16శాతం, ఆయిల్ అండ్ గ్యాస్ రంగంలో13శాతం నియామకాలు పెరిగినట్లు ప్రముఖ రిక్రూట్మెంట్ ఫ్లాట్ ఫారం నౌకరీ తాజా నివేదికలో వెల్లడించింది.
ఐటీ రంగంలో నియామకాలు గత ఏడాదితో పోలిస్తే ఈ జూలై 2025లో స్థిరంగా ఉన్నాయని తేలింది. కానీ ఏఐ, మెషిన్ లెర్నింగ్ ఉద్యోగాలకు ఎక్కువ డిమాండ్ కనిపించినట్లు నౌకరీ చెప్పింది. వీటి నియామకాలు 41శాతం వృద్ధిని నమోదు చేశాయి. నాన్ ఐటీ రంగాల్లో.. ముఖ్యంగా ఫ్రెషర్స్ కోసం ఎక్కువ డిమాండ్ కనిపించిందని నౌకరీ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ పవన్ గోయల్ వెల్లడించారు. నెలవారీ ట్రెండ్లను, నౌకరీ డాట్ కామ్ లోని కొత్త జాబ్ లిస్టింగ్లు, రిక్రూటర్ సెర్చ్ ఆధారంగా నౌకరీ జాబ్ స్పైక్ రిపోర్ట్ రెడీ చేసింది.
గత ఏడాది జూలైతో పోలిస్తే ఈ ఏడాదిలో ఫ్రెషర్ నియామకాలు 8శాతం పెరిగాయి. 16 ఏళ్లకు పైగా అనుభవం ఉన్న ప్రొఫెషనల్స్ నియామకాలు 13శాతం వృద్ధి చెందాయి. వీరిని యూనికార్న్ 23శాతం, స్టార్టప్స్ 10శాతం ఎక్కువగా నియామకాలు చేపట్టాయని తేలింది. పశ్చిమ భారతదేశంలో నియామకాలు ఊపందు కున్నాయి. గుజరాత్లోని సూరత్ (18శాతం), జామ్ నగర్ (12శాతం), రాజస్థాన్లోని ఉదయపూర్ (12శాతం), జోధ్పూర్ (11శాతం) లో నియామకాలు ఎక్కువగా జరిగాయి.