జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో ' ది కేరళ స్టోరీ' చిత్రానికి రెండు అవార్డులు దక్కాయి. ఉత్తమ దర్శకుడు (సుదీప్తో సేన్', ఉత్తమ సినీమాటోగ్రఫీ ( వసంతను మొహపాత్రో) కేటగిరిల్లో పురస్కారాలు వరించాయి. అయితే ఈ అవార్డులు ఇవ్వడంపై రాజకీయ దుమారం రేగుతోంది. కేంద్ర ప్రభుత్వ చర్యలపై కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తీవ్రంగా తప్పు పట్టారు. కేరళ సంస్కృతిని కించపరిచేలా అబద్దాలతో తీసిన సినిమాకు అవార్డులా అంటూ మండిపడ్డారు. ప్రజల మధ్య చిచ్చు పెట్టే ఇలాంటి సినిమాలకు అవార్డులు ఇవ్వడం ద్వారా సంఘ్ పరివార్ విభజనాత్మక సిద్ధాంతాలను పరోక్షంగా అవార్డుల జ్యూరీ కమిటీ సమర్థించినట్లే అని మండిపడ్డారు. ఈ చర్యల వెనుక సంఘ పరివార్ ఎంజెడా ఉందని తాము భావిస్తున్నట్లు చెప్పారు.
సంఘ పరివార్ ఎజెండా..
కేరళను అప్రతిష్టపాలు చేసేలా, మత విద్వేషాలు రెచ్చగొట్టేలా అబద్ధాలతో రూపొందించిన ఈ చిత్రానికి అవార్డులు ఇవ్వడం ద్వారా జాతీయ ఐక్యత, మత సామరస్యం కోసం నిలబడిన భారతీయ సినిమా గొప్ప సంప్రదాయాన్ని అవార్డుల జ్యూరీ అగౌరపరిచిందని విజయన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మతపరమైన ఎంజెండాలను అమలు చేయడానికి సినిమాను ఒక సాధనంగా మార్చాలనే సంఘ పరివార్ ఎజెండాను ఇది సూచిస్తుందని విమర్శించారు. అవార్డుల కమిటీ చర్యలను తీవ్రంగా ఖడిస్తున్నామని చెప్పారు. దీనిపై ప్రతి మలయాళీ , దేశంలో ప్రజాస్వామ్యవాదులందరూ అన్యాయానికి వ్యతిరేకంగా గళం విప్పాలి. కళను మతపరమైన విభేదాలను పెంచడానికి ఉపయోగించే రాజకీయాలకు వ్యతిరేకంగా ప్రతి ఒక్కరూ నిలబడాలని కేరళ సీఎం విజయన్ పిలుపునిచ్చారు.
By honouring a film that spreads blatant misinformation with the clear intent of tarnishing Kerala’s image and sowing seeds of communal hatred, the jury of the #NationalFilmAwards has lent legitimacy to a narrative rooted in the divisive ideology of the Sangh Parivar. Kerala, a…
— Pinarayi Vijayan (@pinarayivijayan) August 1, 2025
కేరళను అప్రతిష్టపాలు చేసేలా..
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఈ జాతీయ పురస్కారాల ద్వారా ప్రజల మధ్య విద్వేష ప్రచారాన్ని లక్ష్యంగా చేసుకుందని ప్రతిపక్షనేత వి.డి. సతీశన్ ఆరోపించారు. మత విద్వేషం మాత్రమే లక్ష్యంగా ది కేరళ స్టోరీ చిత్రానికి జాతీయ అవార్డులు ఇచ్చారని విమర్శించారు. క్రైస్తవులపై దాడులకు నాయకత్వం వహిస్తున్న సంఘ్ పరివార్, మోదీ ప్రభుత్వం జాతీయ చలనచిత్ర అవార్డులను కూడా రాజకీయం చేశాయి. విభజన రాజకీయాలు నడిపే బీజేపీ, సంఘ్ పరివార్ కేరళ గురించి తప్పుడు విషయాలు ప్రచారం చేయడం ద్వారా రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నాయి. కానీ ఇది ఫలించదు అని సతీశన్ హెచ్చరించారు.
'ది కేరళ స్టోరీ' వివాదానికి కారణం..
'ది కేరళ స్టోరీ' చిత్రం దేశవ్యాప్తంగా, ముఖ్యంగా కేరళలో తీవ్ర వివాదాలకు దారితీసింది. కేరళకు చెందిన కొందరు మహిళలు ఇస్లాం మతంలోకి మారి తీవ్రవాద ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా లో చేరడం కథాంశం. ఇలా 32,000 మంది మహిళలు ఇలా ఇస్లామిక్ స్టేట్‌లో చేరారని సినిమాలో పేర్కొనడంపై గతంలో తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఇది వాస్తవాలకు దూరంగా ఉన్న, కేరళ సమాజాన్ని తప్పుగా చూపే చిత్రమని అనేక రాజకీయ పార్టీలు, సంస్థలు ఆరోపించాయి. ఈ సినిమా ప్రదర్శనను నిలిపివేయాలని కూడా డిమాండ్లు వచ్చాయి. ఈ వివాదాల నేపథ్యంలో, ఈ చిత్రానికి జాతీయ పురస్కారం లభించడం రాజకీయంగా మరో చర్చకు దారితీసింది
►ALSO READ | తెలుగు సినిమాలకు 7 జాతీయ అవార్డులు అభినందనీయం
ఇప్పుడు ఇది కేంద్ర ప్రభుత్వం, సంఘ్ పరివార్ తమ మతపరమైన, రాజకీయ ఎజెండాను ముందుకు తీసుకెళ్లడానికి జాతీయ వేదికలను కూడా ఉపయోగిస్తున్నాయని విమర్శకులకు ఒక ఆయుధంగా మారింది. భారతదేశంలో కళ, రాజకీయాలు విడదీయలేనివిగా మారాయన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. 'ది కేరళ స్టోరీ' సుదీప్తో సేన్ దర్శకత్వంలో విపుల్ అమృత్లాల్ షా నిర్మించారు. ఈ చిత్రంలో అదా శర్మ, మోగితా బిహానీ, సోనియా బలానీ, సిద్ధి ఇద్నాని నటించారు. ఇది మే 5, 2023 న విడులైంది. ఈ హిందీ చిత్రంపై అప్పట్లోనే తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఇప్పడు ఈ చిత్రానికి జాతీయ అవార్డుల ప్రకటనతో మరో సారి తీవ్రదుమారానికి దారితీసింది.
