
- మద్యంపై ఆదాయం పెంచేందుకేనన్న శ్రీనివాస్ గౌడ్
హైదరాబాద్, వెలుగు: మద్యంపై ఆదాయాన్ని పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం రకరకాల ప్రయత్నాలు చేస్తున్నదని బీఆర్‌ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఎక్సైజ్ పాలసీ గడువు నవంబర్ దాకా ఉన్నా.. ఇప్పుడే కొత్త మద్యం దుకాణాలకు ప్రభుత్వం దరఖాస్తులను ఆహ్వానించాలని చూస్తున్నదని ఆరోపించారు. శుక్రవారం తెలంగాణ భవన్‌లో మీడియాతో ఆయన మాట్లాడారు. దరఖాస్తు ధరను రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు పెంచుతున్నారని ఆరోపించారు. బెల్ట్ షాపులు లేకుండా చేస్తామని చెప్పి.. అడుగడుగునా మద్యం షాపులు తెరిచేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదన్నారు
. మద్యం మాఫియాను పెంచి పోషించి కల్లు దుకాణాలను మూసివేసే కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. ఖజానా నింపుకోవడానికి ప్రతి గ్రామంలో మద్యం దుకాణాలు తెరుస్తున్నారన్నారు. మద్యం టెట్రా ప్యాక్‌లు తెస్తూ మద్యాన్ని ఏరులై పారేలా చేస్తున్నారని విమర్శించారు. రెండు షాపుల్లో కల్తీ కల్లు ఘటనలు జరిగాయనే నెపంతో మొత్తం కల్లు దుకాణాలపై దాడులు చేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఫైర్ అయ్యారు.