Asia Cup 2025: శనక బాధ్యతయుత ఇన్నింగ్స్.. బంగ్లా ముందు ఛాలెంజింగ్ టార్గెట్

Asia Cup 2025: శనక బాధ్యతయుత ఇన్నింగ్స్.. బంగ్లా ముందు ఛాలెంజింగ్ టార్గెట్

ఆసియా కప్ సూపర్-4 లో బంగ్లాదేశ్ తో జరుగుతున్న సూపర్ -4 మ్యాచ్ లో శ్రీలంక బ్యాటింగ్ లో రాణించింది. శనివారం (సెప్టెంబర్ 20)  దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక భారీ స్కోర్ చేసింది. సీనియర్ ప్లేయర్ శనక (64:37 బంతుల్లో: 3 ఫోర్లు, 6 సిక్సర్లు)హాఫ్ సెంచరీకి తోడు కుశాల్ మెండీస్ కీలక ఇన్నింగ్స్ ఆడడంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. శనక 64 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. బంగ్లా బౌలర్లలో ముస్తాఫిజుర్ మూడు వికెట్లు పడగొట్టాడు. మెహెదీ రెండు.. తస్కిన్ అహ్మద్ ఒక వికెట్ తీసుకున్నారు.  

ఈ మ్యాచ్ లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ కు దిగిన శ్రీలంకకు ఓపెనర్లు నిస్సంక, కుశాల్ మెండీస్ శుభారంభాన్ని ఇచ్చారు. తొలి వికెట్ కు ఐదు ఓవర్లలో 44 పరుగులు జోడించి పర్వాలేదనిపించారు. 22 పరుగులు చేసిన నిస్సంకను తస్కిన్ అహ్మద్ పెవిలియన్ కు చేర్చి బంగ్లాకు తొలి వికెట్ అందించాడు. కాసేపటికే శ్రీలంక వరుసగా రెండు వికెట్లు కోల్పోవడంతో కష్టాల్లో పడింది. మూడు వికెట్ల నష్టానికి 65 పరుగులతో ఉన్న జట్టును శనక ఆదుకున్నాడు. సీనియర్ గా తన అనుభవాన్ని చూపించాడు. కుశాల్ పెరీరా (16), అసలంక (21)తో కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. 

కుశాల్ పెరీరాతో 32 పరుగులు.. అసలంకతో కలిసి 57 పరుగులు జోడించాడు. చివర్లో వరుసగా వికెట్లు కోల్పోవడంతో లంక జట్టు భారీ స్కోర్ చేయడంలో విఫలమైంది. అసలంక, మెండీస్, హసరంగా స్వల్ప వ్యవధిలో ఔటయ్యారు. చివరి వరకు క్రీజ్ లో ఉన్న శనక 64 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. తొలి 10 ఓవర్లలో 72 పరుగులు చేసిన శ్రీలంక.. చివరి 10 ఓవర్లలో 96 పరుగులు చేసి బంగ్లా ముందు ఛాలెంజింగ్ టోటల్ ఉంచింది.