
ఇటీవల తన సినిమా 'దక్ష' ప్రమోషన్స్ సందర్భంగా మంచు లక్ష్మి ఒక జర్నలిస్ట్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా, ఆ జర్నలిస్ట్ ఆమె వస్త్రధారణపై వ్యాఖ్యలు చేస్తూ, "మీరు ముంబై వెళ్ళిన తర్వాత మీ డ్రెస్సింగ్ మారిపోయింది. 50 ఏళ్లకు దగ్గరవుతున్న ఓ మహిళ, 12 ఏళ్ల కూతురుకు తల్లి అయిన మీరు ఇలాంటి చిన్న బట్టలు వేసుకుని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే జనాలు ఏమనుకుంటారు?" అని ప్రశ్నించారు. ఈ ప్రశ్న వినగానే లక్ష్మి తీవ్రంగా స్పందించారు.
ఆమె ఆ జర్నలిస్ట్‌ను నేరుగా ప్రశ్నిస్తూ, "మీరు ఒక మగవాడిని ఇదే ప్రశ్న అడుగుతారా? మీకు అంత ధైర్యం ఉందా? మహేష్ బాబును కూడా 'మీకు ఇప్పుడు 50 ఏళ్లు వచ్చాయి, ఎందుకు షర్ట్ లేకుండా తిరుగుతున్నారు?' అని అడగగలరా? మరి ఒక మహిళను ఇదే విషయం ఎలా అడుగుతారు?" అని నిలదీశారు. అంతేకాకుండా, "మీరు అడిగే ప్రశ్నలనే చూసి జనాలు నేర్చుకుంటారు. ఒక జర్నలిస్ట్‌గా మీరు మరింత బాధ్యతగా ఉండాలి," అని గట్టిగా చెప్పారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో జర్నలిస్ట్ ప్రవర్తనపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.
చట్టపరమైన చర్యలకు ఉపక్రమించిన మంచు లక్ష్మి
ఈ సంఘటనను కేవలం ఒక వ్యక్తిగత అవమానంగా కాకుండా, మహిళలందరికీ ఎదురయ్యే సమస్యగా మంచు లక్ష్మి పరిగణించారు. దీనిపై ఆమె చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (TFCC) కు ఆమె అధికారికంగా ఒక లేఖ సమర్పించారు.
"భారతదేశం మహిళలను శక్తి స్వరూపిణిగా కొలుస్తుంది. అయినా, పని ప్రదేశాల్లో మహిళలు అగౌరవం, అవమానాలు ఎదుర్కొంటున్నారు. ఇలాంటివి కొనసాగకూడదు. నా కోసం మాత్రమే కాకుండా, నన్ను ఆదర్శంగా తీసుకునే యువ మహిళల కోసం కూడా దీనిపై గొంతెత్తడం నా బాధ్యత" అని ఆ లేఖలో మంచు లక్ష్మి పేర్కొన్నారు.
"ప్రజలకు అందుబాటులో ఉండే ఒక వ్యక్తిగా కఠినమైన ప్రశ్నలకు, విమర్శలకు నేను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాను అని ఆమె అన్నారు. కానీ, జర్నలిజం ముసుగులో జరిగే ఇలాంటి అవమానకరమైన వ్యాఖ్యలను నేను సహించను అని ఆమె స్పష్టం చేశారు. ఆ జర్నలిస్ట్ బహిరంగంగా క్షమాపణ చెప్పాలని, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ఆమె టీఎఫ్‌సీసీని కోరారు. గౌరవం అనేది ఒక ఎంపిక కాదు. బాధ్యత అనేది చర్చకు అతీతమైనది అని ఆమె ఘాటుగా తేల్చి చెప్పారు.
లక్ష్మికి మద్దతుగా హేమ
నటి హేమతో పాటు నటీమణుల నుంచి కూడా లక్ష్మికి మద్దతుగా నిలిచారు. ఇది కేవలం ఒక సెలబ్రిటీ సమస్య కాదని, ప్రతి మహిళ ఎదుర్కొనే సమస్య అని హేమ ఆవేదన వ్యక్తం చేశారు. కొంతమంది జర్నలిస్టులు బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నారని, సినిమా వాళ్లను లోకువగా చూస్తున్నారని తీవ్ర మండిపడ్డారు. "ఒక మహిళగా, ఒక నటిగా మంచు లక్ష్మికి ఈ పరిస్థితి ఎదురైనప్పుడు, 'మా' అధ్యక్షుడు మంచు విష్ణు సొంత చెల్లికే ఇలా జరిగితే, మరి మిగతా చిన్న ఆర్టిస్టుల పరిస్థితి ఏంటి?" అని హేమ ప్రశ్నించారు.
గతంలో తనపై వచ్చిన తప్పుడు వార్తలకు, తప్పుడు ప్రచారాలకు 'మా' సంఘం చాలా వేగంగా స్పందించిందని గుర్తు చేసుకున్నారు. నాపై తప్పుడు ప్రచారం చేసి.. నా 'మా' సభ్యత్వాన్ని కూడా తొలగించారు. నేను చాలా కష్టపడి మళ్లీ సభ్యత్వం పొందాల్సి వచ్చింది. మరి ఇప్పుడు మంచు లక్ష్మి విషయంలో ఎందుకు మౌనంగా ఉన్నారు? అని ఆమె నిలదీశారు. మరి దీనిపై తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.