
వాషింగ్టన్: హెచ్1బీ వీసా వార్షిక ఫీజును అమాంతం లక్ష డాలర్లకు పెంచుతూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బిగ్ బాంబ్ పేల్చిన విషయం తెలిసిందే. 2025, సెప్టెంబర్ 21 అర్ధరాత్రి 12:01 గంటల నుంచి హెచ్1బీ వీసా కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. హెచ్1బీ వీసా వార్షిక ఫీజును ట్రంప్ భారీగా పెంచడంతో అమెరికాలోని ప్రముఖ టెక్ కంపెనీలు అల్లాడిపోతున్నాయి. ఏం చేయాలో అర్ధంకాక అమెరికా బయట ఉన్నా హెచ్1బీ వీసాదారులను 24 గంటల్లో తిరిగి రావాలని ఆదేశించాయి. అలాగే.. అమెరికాలో ఉన్న హెచ్1బీ వీసా హోల్డర్స్‌కు దేశం విడిచి వెళ్లొద్దని ఆదేశాలు జారీ చేశాయి.
అయితే.. హెచ్1బీ వీసా నిబంధనల్లో ట్రంప్ ప్రభుత్వం చేపట్టిన మార్పులపై కొంత గందరగోళం నెలకొంది. ట్రంప్ పెంచిన లక్షల డాలర్లు ఫీజు కొత్తగా హెచ్1బీ వీసా తీసుకునే వారికి వర్తిస్తుందా..? లేక ఇప్పటికే హెచ్1బీ వీసా ఉన్న వారికి కూడా ఈ పెంపు అమలు అవుతుందా అనే దానిపై సంధిగ్ధం నెలకొంది. వీసా ఫీజు పెంపు కేవలం కొత్తవారికే అయితే.. మరీ హెచ్1బీ వీసా హోల్డర్స్‌ను కంపెనీలు 24 గంటల్లో తిరిగి రావాలని ఎందుకు ఆదేశిస్తున్నాయనే దానిపై క్లారిటీ లేదు.
ఈ క్రమంలో హెచ్1బీ వీసా నిబంధనల మార్పుపై ట్రంప్ పరిపాలనా సీనియర్ అధికారి ఒకరు క్లారిటీ ఇచ్చారు. H-1B వీసాపై ప్రకటించిన లక్షల డాలర్ల వార్షిక రుసుము కేవలం కొత్త దరఖాస్తుదారులకు మాత్రమే వర్తిస్తుందని ఆయన వివరించారు. ఇప్పటికే H-1B వీసా ఉన్న వాళ్లకు ఈ నిబంధన వర్తించదని క్లారిటీ ఇచ్చారు. H-1B వీసా హోలర్డ్స్ 2025, సెప్టెంబర్ 21 అర్ధరాత్రి 12:01 గంటల లోపు అమెరికాకు తిరిగి రావడం లేదా దేశాన్ని విడిచి వెళ్లాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు.
హెచ్ 1బీ వీసాలు టెక్నాలజీ రంగంలో పనిచేసే వారికే ఎక్కువగా ఇస్తారు. దీంతో అమెరికాలోని ప్రముఖ కంపెనీలు హెచ్ 1 బీ వీసా ద్వారా విదేశాల నుంచి ఉద్యోగులను రిక్రూట్ చేసుకుంటాయి. ముఖ్యంగా ఐటీ ఉద్యోగులే ఇందులో ఎక్కువగా ఉంటారు. ఇతర రంగాల్లోఉద్యోగం చేసేందుకు వెళ్లే వారైనా సరే హెచ్ 1 బీ వీసాతో పనిచేస్తూ ఇక్కడ రెసిడెన్షియల్ స్టేటస్ లేదా గ్రీన్ కార్డు కోసం ప్రయత్నిస్తుంటారు.
ఇలా హెచ్ 1 బీ వీసా ద్వారా అమెరికా వెళ్లే వారిలో ఇండియన్సే 70 శాతం ఉంటారు. H-1B వీసాపై అమెరికా తీసుకొచ్చిన తాజా ఆర్డర్స్ భారత్లో ప్రకంపనలు రేపుతున్నా యి. లక్షల మంది భారతీయులు ఈ వీసాల కిందే దశాబ్దాలుగా అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్నారు. వలస విధానాలపై కఠిన చర్యలలో భాగంగా ట్రంప్ H-1B వీసా వార్షిక ఫీజును భారీగా పెంచడంతో అమెరికాలోని భారతీయుల ఉద్యోగాలు ప్రమాదంలో పడ్డాయి.