ఎన్నికల్లో మళ్లీ పోటీ చేయను.. ఎమ్మెల్యే కడియం శ్రీహరి కీలక ప్రకటన

ఎన్నికల్లో మళ్లీ పోటీ చేయను.. ఎమ్మెల్యే కడియం శ్రీహరి కీలక ప్రకటన

హైదరాబాద్: పార్టీ ఫిరాయింపులపై స్పీకర్ నోటీసులు ఇచ్చిన వేళ స్టేషన్ ఘన్‎పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కీలక వ్యాఖ్యలు చేశారు. మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేయనని ఆయన సంచలన ప్రకటన చేశారు. ఇవే నా చివరి ఎన్నికలు అని 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు చెప్పాను.. ఇప్పుడు మళ్లీ చెబుతున్నా ఇకపై ఎన్నికల్లో పోటీ చేయనని తేల్చిచెప్పారు.

శనివారం (సెప్టెంబర్ 20) స్టేషన్ ఘనపూర్‎లో షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ చేశారు ఎమ్మెల్యే కడియం శ్రీహరి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యపై ఇన్‏డైరెక్ట్‎గా సెటైర్లు వేశారు. తాను కేవలం నియోజకవర్గ అభివృద్ధి కోసమే పనిచేస్తానని.. కొందరి లాగా చిలిపి చేష్టలు, చిల్లర పనులు చేయనని ఎద్దేవా చేశారు. ఎక్కడికైనా వెళితే నాటుకోడి కూర, బ్లాక్ లేబుల్ మందు అడగనని.. అలాగే మిగిలిన భోజనం టిఫిన్‎లో పెట్టుకొని తీసుకుపోనని సెటైర్ వేశారు.

తనపై వ్యక్తిగత దూషణలే కాకుండా, కుటుంబ సభ్యులను సైతం దూషిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసిన కడియం.. మనిషికైతే చెప్పొచ్చు కానీ పశు లక్షణాలు ఉన్న వ్యక్తికి  ఏం చెప్పలేమని హాట్ కామెంట్ చేశారు. 21 నెలల్లో  నియోజకవర్గానికి రూ.1025 కోట్ల నిధులు తెచ్చానని.. రాబోయే మూడేళ్లలో మరో రూ.2 వేల కోట్ల నిధులు తెచ్చి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని స్పష్టం చేశారు. తాను ఎప్పటికీ తప్పు చేయను.. ఎవరికీ తలవంచనని అన్నారు.