
ఆసియా కప్ జట్టులో చోటు దక్కకపోవడంపై టీమిండియా యంగ్ ప్లేయర్ యశస్వీ జైశ్వాల్ నోరు విప్పాడు. ఓ ఇంటర్వ్యూలో జైశ్వాల్ మాట్లాడుతూ.. జట్టు ఎంపిక అనేది సెలెక్టర్ల చేతులో ఉంటుందని అన్నాడు. వ్యక్తిగత ప్రదర్శన కంటే జట్టు కూర్పులో భాగంగా సెలెక్టర్లు టీమ్‌ను ఎంపిక చేస్తారని.. ఇందులో భాగంగానే ఆసియా కప్ జట్టులో తనకు చోటు దక్కలేదు కావచ్చని అభిప్రాయపడ్డాడు. జట్టులో చోటు దక్కలేదని నిరాశ చెందడం లేదని.. నా పని నేను చేసుకుంటూ ముందుకు వెళ్తానని స్పష్టం చేశాడు. ఏదో రోజు నాకు టైమ్ వస్తుందని.. అప్పటి వరకు వెయిట్ చేస్తానన్నాడు జైశ్వాల్. ఖాళీ సమయంలో ఆటను మరింత మెరుగుపర్చుకోవడంపై దృష్టి పెడతానన్నాడు.
2025 ఐపీఎల్, ఇంగ్లాండ్ టెస్ట్ టూర్లో ఓపెనర్ జైశ్వాల్ అద్భుతంగా రాణించాడు. దీంతో ఆసియా కప్ జట్టులో ఈ యువ బ్యాటర్‌కు బెర్తు పక్కా అని ప్రచారం జరిగింది. కానీ తీవ్రమైన పోటీ ఉండటంతో జైశ్వాల్‌ను ఆసియా కప్ జట్టుకు ఎంపిక చేయలేదు సెలెక్టర్లు. అప్పటికే అభిషేక్ శర్మ, శుభమన్ గిల్, సంజు శాంసన్ రూపంలో ఓపెనింగ్ స్థానానికి తీవ్రమైన పోటీ నెలకొనడంతో జైశ్వాల్‌ను పక్కనపెట్టారు సెలెక్టర్లు. అభిషేక్ శర్మ, శుభమన్ గిల్ జోడీకి ఓపెనింగ్ అవకాశం కల్పించారు.
జైస్వాల్ టీ20 కెరీర్:
డేరింగ్ అండ్ డాషింగ్ బ్యాటర్‌గా పేరున్న జైశ్వాల్ ఇప్పటి వరకు 23 అంతర్జాతీయ టీ20లు ఆడాడు. 164.31 స్ట్రైక్ రేట్, 36.15 సగటుతో 723 పరుగులు చేశాడు. ఇందులో ఐదు అర్ధ సెంచరీలు, ఒక సెంచరీ ఉన్నాయి.