H-1B వీసా ఫీజును ట్రంప్ భారీగా పెంచడంపై ఇండియా రెస్పాన్స్ ఇదే..

H-1B వీసా ఫీజును ట్రంప్ భారీగా పెంచడంపై ఇండియా రెస్పాన్స్ ఇదే..

H-1B వీసా దరఖాస్తు ఫీజును సంవత్సరానికి లక్ష డాలర్లకు అంటే మన కరెన్సీలో 88 లక్షల రూపాయలకు పెంచే ఉత్తర్వుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం చేసిన పరిణామం మన దేశంలో తీవ్ర చర్చనీయాంశమైంది. అమెరికాలో హెచ్ 1 బీ వీసా హోల్డర్లలో 72 శాతం మంది భారతీయులే కాపడమే ఇందుకు కారణం. H-1B వీసా అమెరికా తీసుకొస్తున్న కొత్త నిబంధనలపై మన దేశం తాజాగా స్పందించింది. H-1B వీసా కొత్త నిబంధనలను పరిశీలిస్తున్నామని, తాజా పరిణామాలపై అధ్యయనం చేస్తున్నామని భారత విదేశాంగ శాఖ తెలిపింది.

ఈ పరిణామం అమెరికాతో పాటు ఇండియాలోని సంస్థలను ప్రభావితం చేసే అంశమని, అమెరికా తీసుకున్న తాజా నిర్ణయంతో ఎన్నో కుటుంబాలకు ఇబ్బందులు వస్తాయని విదేశాంగ శాఖ అభిప్రాయపడింది. అమెరికాలో H-1B వీసాపై ఉద్యోగాల్లో కొనసాగుతున్న నైపుణ్యం కలిగిన ఉద్యోగుల వల్ల, వారి రాకపోకల వల్ల రెండు దేశాలకు పరస్పరం లబ్ధి చేకూరుతుందని భారత విదేశాంగ శాఖ అభిప్రాయం వ్యక్తం చేసింది. ఇది చాలా సున్నితమైన అంశమని, కొత్త వీసా నిబంధనలతో తలెత్తే ఇబ్బందులను అమెరికా గుర్తిస్తుందని ఆశిస్తున్నామని భారత్ తెలిపింది.

హెచ్ 1బీ వీసాలు టెక్నాలజీ రంగంలో పనిచేసే వారికే ఎక్కువగా ఇస్తారు. దీంతో అమెరికాలోని ప్రముఖ కంపెనీలు హెచ్ 1 బీ వీసా ద్వారా విదేశాల నుంచి ఉద్యోగులను రిక్రూట్ చేసుకుంటాయి. ముఖ్యంగా ఐటీ ఉద్యోగులే ఇందులో ఎక్కువగా ఉంటారు. ఇతర రంగాల్లోఉద్యోగం చేసేందుకు వెళ్లే వారైనా సరే హెచ్ 1 బీ వీసాతో పనిచేస్తూ ఇక్కడ రెసిడెన్షియల్ స్టేటస్ లేదా గ్రీన్ కార్డు కోసం ప్రయత్నిస్తుంటారు. ఇలా హెచ్ 1 బీ వీసా ద్వారా అమెరికా వెళ్లే వారిలో ఇండియన్సే 70 శాతం ఉంటారు.

H-1B వీసాపై అమెరికా తీసుకొచ్చిన తాజా ఆర్డర్స్ భారత్లో ప్రకంపనలు రేపుతున్నా యి. లక్షల మంది భారతీయులు ఈ వీసాల కిందే దశాబ్దాలుగా అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్నారు. వలస విధానాలపై కఠిన చర్యలలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వైట్ హౌస్ ప్రకటించింది.