Deepika Padukone : ‘కల్కి’ వివాదంపై మౌనం వీడిన దీపికా.. నాగ్‌ అశ్విన్‌కు పరోక్షంగా కౌంటర్!

Deepika Padukone : ‘కల్కి’ వివాదంపై మౌనం వీడిన దీపికా.. నాగ్‌ అశ్విన్‌కు పరోక్షంగా కౌంటర్!

రెబల్ స్టార్ ప్రభాస్ కథనాయకుడిగా 'కల్కి 2898 AD' సినిమా సీక్వెల్ నుండి దీపికా పదుకొణె తప్పుకున్నారంటూ నిర్మాణ సంస్థ ప్రకటించడంతో సినీ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. సోషల్ మీడియాలో రకరకాల కథనాలు వెలువడుతున్నాయి.  గొంతెమ్మ కోరికలు తీర్చలేకే ఆమెను ఈ సినిమా నుంచి తప్పించారంటూ ఊహాగానాలకు తెరతీశాయి. అంతే కాకుండా ఆ నిర్మాణ సంస్థ అధిక నిబద్ధత లేదంటూ పరోక్షంగా దీపికపై చేసిన వ్యాఖ్యలు ఈ వివాదాన్ని మరింత హీటెక్కించింది. 

అటు 'కల్కి' వివాదంపై దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ సైతం పరోక్షంగా స్పందించారు. "జరిగిన దాన్ని ఎవరూ మార్చలేరు. కానీ, తర్వాత ఏం జరగాలో మీరు ఎంచుకోవచ్చు" అని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. అయితే ఈ వివాదంపై దీపికా ఎలా స్పందిస్తారోనని అందరూ ఎదురుచూస్తున్న తరుణంలో.. ఆమె ఒక అనూహ్యమైన అస్త్రంతో రంగంలోకి దిగారు.  సోషల్ మీడియా వేదికగా ఆసక్తికరంగా ఒక పోస్ట్ రూపంలో ఇన్ డైరెక్ట్ గా ' కల్కి' వివాదంపై రియాక్ట్ అయ్యారు.  

తను షారుఖ్‌ ఖాన్‌తో కలిసి నటిస్తున్నట్లు కొత్త సినిమా'కింగ్' ను తన ఇన్‌స్టాగ్రామ్‌లో  దీపికా ధ్రువీకరించారు. శనివారం షారుఖ్‌ ఖాన్‌తో కలిసి ఉన్న ఒక ఫోటోను షేర్‌ చేశారు. ఈ ఫోటోలో వీరిద్దరూ చేతులు పట్టుకుని ఉండటం, వెనుక సినిమా సెట్‌ కనిపించడం అభిమానులను ఆకట్టుకుంది. ఈ పోస్ట్, 'కల్కి' వివాదంపై దీపిక తెలివిగా ఇచ్చిన సమాధానం అని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఇది కేవలం ఒక సినిమా ప్రకటన కాదు, ఆమె వైఖరిని స్పష్టంగా తెలియజేసే ఒక శక్తివంతమైన సందేశం అని భావిస్తున్నారు.

ఈ ఫోటోకు ఆమె రాసిన క్యాప్షన్‌ కూడా ఇప్పుడు చర్చకు కేంద్రబిందువుగా మారింది. "18 ఏళ్ల క్రితం 'ఓం శాంతి ఓం' సినిమా షూటింగ్‌లో షారుఖ్‌ నాకు నేర్పిన మొదటి పాఠం ఏమిటంటే, ఒక సినిమాను తయారు చేసే అనుభవం, ఆ సినిమాను ఎవరితో కలిసి చేస్తామన్నది దాని విజయం కంటే చాలా ముఖ్యమైనది" అని దీపికా పేర్కొన్నారు. అంతేకాకుండా, "నేను ఈ పాఠాన్ని అంగీకరిస్తూ, అప్పటి నుండి నేను తీసుకున్న ప్రతి నిర్ణయానికి ఇదే సూత్రం ఆధారంగా ఉంది. అందుకేనేమో మేము కలిసి మా ఆరవ సినిమాను చేస్తున్నాం" అని ఆమె రాసుకొచ్చారు. ఈ పోస్ట్, 'కల్కి' నిర్మాణ సంస్థకు, దర్శకుడు నాగ్‌ అశ్విన్‌కు దీపికా పదుకొణె ఇచ్చిన పరోక్ష కౌంటర్‌ అని నెటిజన్లు భావిస్తున్నారు. 

 

'కల్కి' వివాదం వెనుక దీపికాకు, నిర్మాణ సంస్థకు మధ్య అభిప్రాయ బేధాలు, లేదా కాల్షీట్ల సమస్యలు ఉండవచ్చునని సినీ వర్గాలు భావిస్తున్నాయి. కానీ, ఈ వివాదానికి దీపికా తన సినిమాలతోనే సమాధానం చెప్పడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఆమె ప్రస్తుతం అల్లు అర్జున్‌తో అట్లీ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా 'AA22xA6'లో కూడా నటిస్తున్నారు. 'కల్కి' తర్వాత 'కింగ్' వంటి భారీ ప్రాజెక్ట్‌లో భాగం కావడం, తన కెరీర్‌ బలమైన పునాదులపై ఉందని దీపికా స్పష్టం చేస్తున్నారు.