40 ఏండ్లు దాటిన వారు వైద్య పరీక్షలు చేయించుకోవాలి : కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

40 ఏండ్లు దాటిన వారు వైద్య పరీక్షలు చేయించుకోవాలి : కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

కామారెడ్డి, వెలుగు : 40 ఏండ్లు పైబడిన వారు వైద్య పరీక్షలు చేయించుకోవాలని కలెక్టర్​ ఆశిష్​ సంగ్వాన్ పేర్కొన్నారు.  శుక్రవారం కామారెడ్డి గవర్నమెంట్​ హాస్పిటల్, కామారెడ్డి టౌన్​లో స్వయం సహాయక సంఘ సభ్యులకు నిర్వహించిన  వైద్య శిబిరాన్ని పరిశీలించి మాట్లాడారు. మధ్య వయస్సువారికి వ్యాధులు సోకే అవకాశం ఎక్కువగా ఉంటుందని, ముందే టెస్టులు చేయించుకుంటే సమస్యను అధిగమించవచ్చన్నారు.  సదరం  క్యాంపునకు అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. అడిషనల్ కలెక్టర్​ చందర్​,  హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటేశ్వర్లు,  మున్సిపల్ కమిషనర్ రాజేందర్,  ఆర్ఎంవోలు, డాక్టర్లు పాల్గొన్నారు.  

నాణ్యమైన కోడిగుడ్లను సప్లై​ చేయాలి

కామారెడ్డిటౌన్​, వెలుగు : అంగన్​వాడీ కేంద్రాలు, రెసిడెన్షియల్ స్కూల్స్​కు  నాణ్యమైన కోడిగుడ్లను సప్లై​ చేయాలని కలెక్టర్ ఆశిష్​ సంగ్వాన్ ఏజెన్సీలకు సూచించారు. శుక్రవారం  కోడిగుడ్ల సప్లై  కోసం టెండర్లను ప్రారంభించి మాట్లాడారు. ప్రభుత్వ విద్యాసంస్థల్లో పోషకాహారం అందించాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమన్నారు.  అడిషనల్ కలెక్టర్​ చందర్,  అధికారులు వెంకటేశ్, దయానంద్,  సతీశ్​యాదవ్ పాల్గొన్నారు. 
    
ఆపరేషన్ ముస్కాన్​లో 68 పిల్లల గుర్తింపు       

కామారెడ్డి, వెలుగు : ఆపరేషన్ ముస్కాన్​లో భాగంగా కామారెడ్డి జిల్లాలో 68 మంది పిల్లలను గుర్తించినట్లు కలెక్టర్​ ఆశిష్ సంగ్వాన్ తెలిపారు.  పోలీసు, రెవెన్యూ, కార్మిక, బాలల పరిరక్షణ విభాగం, చైల్డ్ లైన్ ఆధ్వర్యంలో ఆపరేషన్​ ముస్కాన్ జూలై 1 నుంచి 31 వరకు చేపట్టామన్నారు.  బాల కార్మికులు, వీధి బాలల గుర్తింపు, తప్పిపోయిన పిల్లల గుర్తించి రక్షణ కల్పించామన్నారు. బాల కార్మికులను పనిలో పెట్టుకున్న వారిపై కేసులు నమోదు చేసినట్లు 
తెలిపారు.