
Bengaluru Techies: బెంగళూరులో ట్రాఫిక్ కష్టాలు రోజురోజుకూ తీవ్రతరం అవుతున్నాయి. నగరంలోని టెక్ కారిడార్లలో ట్రాఫిక్ కష్టాలు బుధవారాలు మరింత దారుణంగా మారిపోతున్నాయి. వారం ప్రారంభంలో ఐటీ దిగ్గజం టీసీఎస్ ఉద్యోగుల లేఆఫ్ గురించి ప్రకటన తర్వాత ఏఐతో రాబోతున్న లేఆఫ్స్ పరిశ్రమలోని ఉద్యోగులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. దీంతో చాలా మంది కంపెనీలు అందిస్తున్న వర్క్ ఫ్రమ్ హోం సదుపాయాలను కూడా వద్దనుకుంటున్నారు.
దీనంతటికీ కారణం ఐటీ ఉద్యోగుల్లో పెరిగిపోతున్న జాబ్ సెక్యూరిటీ భయాలేనని తేలింది. ఆఫీసులో కనిపించకపోతే తాము నిర్లక్ష్యానికి గురవుతామని, ఆఫీసులో కనిపించని వారికి జాబ్ సెక్యూరిటీ ఉందనే అభద్రతా భావం టెక్కీల్లో పెరిగిపోతోందని తేలింది. దీంతో బెంగళూరు రోడ్లపై ట్రాఫిక్ కష్టాలు మరింత తీవ్రరూపం దాల్చుతున్నాయి.
ALSO READ : రూ.30 రూపాయల కింగ్ ఫిషర్ బీరుపై ఇంత ట్యాక్స్ వేస్తున్నారా.. : కిక్ దింపుతున్న సోషల్ మీడియా పోస్టులు!
బెంగళూరు నగరంలోని ఓఆర్ఆర్ చుట్టుపక్కల ప్రాంతాల్లో దాదాపు 26 టెక్ పార్కులు ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న ఉద్యోగ అనిశ్చితులతో గత ఏడాది జూలైతో పోల్చితే ఈ ప్రాంతంలో 45 శాతం పెరిగినట్లు బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు. బుధవారాల్లో ఈ ట్రాఫిక్ పీక్ లెవెల్ కి పెరుగుతోందని, లక్షా 20వేల వాహనాలు రోడ్లపైకి వస్తున్నాయని చెప్పారు. వాస్తవానికి టెక్ ఉద్యోగుల్లో పెరిగిపోతున్న ఆందోళనలే దీనికి కారణంగా ఒక సాఫ్ట్‌వేర్ డెవలపర్ చెప్పారు.
ఒకప్పుడు బెంగళూరులో పనిచేస్తున్న ఐటీ ఉద్యోగులు ఎక్కువగా వర్క్ ఫ్రమ్ హోం ని ఇష్టపడినప్పటికీ ప్రస్తుతం ఉన్న జాబ్ ఇన్ సెక్యూరిటీ వారిని వద్దన్నా ఆఫీసులకు వెళ్లేలా చేస్తోంది. ప్రధానంగా విప్రో, ఇన్ఫోసిస్, హెచ్సీఎల్ టెక్ లాంటి కంపెనీలు హైబ్రిడ్ వర్క్ విధానం ఆఫర్ చేస్తున్నాయి. కానీ ప్రస్తుతం వాస్తవంగా ఆఫీసులకు రావటమే సేఫ్ అని చాలా మంది టెక్కీలు భావిస్తుండటం ట్రాఫిక్ కష్టాలను తారాస్థాయిలకు చేర్చింది. కొన్ని కంపెనీలు మాత్రం తప్పనిసరిగా వారానికి 5 రోజులు ఆఫీసులకు రావాలని కూడా ఉద్యోగులకు సూచించటం రద్దీ పెరగటానికి మరో కారణంగా మారింది.