
మాస్కో: రష్యా మాజీ అధ్యక్షుడు దిమిత్రి మెద్వెదెవ్ రెచ్చగొట్టే వ్యాఖ్యలకు ప్రతిస్పందనగా రష్యా సమీప జలాల్లో న్యూక్లియర్ సబ్‌మెరైన్స్ మోహరించామని అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలకు రష్యన్ పార్లమెంట్ సభ్యుడు విక్టర్ వోడోలాట్స్కీ కౌంటర్ ఇచ్చారు. రష్యా సమీపంలోకి ట్రంప్ పంపిన రెండు అమెరికన్ జలాంతర్గాములను ఎదుర్కోవడానికి మా దగ్గర తగినన్ని న్యూక్లియర్ సబ్‌మెరైన్స్ సిద్ధంగా ఉన్నాయని అన్నారు. ట్రంప్ బెదిరింపులకు రష్యా స్పందించాల్సిన అవసరం లేదని అమెరికా ప్రెసిడెంట్ కామెంట్స్‌ను లైట్ తీసుకున్నారు.
‘‘రష్యాకు ఇప్పటికే మహాసముద్రాలపై ఉన్నతమైన వ్యూహాత్మక నియంత్రణ ఉంది. ప్రపంచ మహాసముద్రాలలో అమెరికా కంటే రష్యన్ అణు జలాంతర్గాముల సంఖ్య చాలా ఎక్కువ. రష్యా సమీపంలో మోహరించాలని ట్రంప్ ఆదేశించిన రెండు అణు జలాంతర్గాములు చాలా కాలంగా మా నియంత్రణలోనే ఉన్నాయి. కాబట్టి జలాంతర్గాముల గురించి ట్రంప్ చేసిన వ్యాఖ్యలకు రష్యా స్పందించాల్సిన అవసరం లేదు. అమెరికా సబ్‌మెరైన్స్ ను తిరగనివ్వండి’’ అని పేర్కొన్నారు విక్టర్ వోడోలాట్స్కీ.
కాగా, రష్యా-ఇండియా సంబంధాలపై అక్కసు వెళ్లగక్కుతూ.. ఇప్పటికే పతనమైన తమ ఆర్థిక వ్యవస్థలను రష్యా, భారత్ మరింత దిగజార్చుకుంటాయని ట్రంప్ కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. ట్రంప్ వ్యాఖ్యలకు రష్యా మాజీ అధ్యక్షుడు మెద్వెదెవ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. రష్యాది డెడ్ ఎకానమీ అన్న ట్రంప్.. ది వాకింగ్ డెడ్ చిత్రాలను గుర్తుంచుకోవాలని వార్నింగ్ ఇచ్చారు. అవి ఎంత ప్రమాదకరమో ఆలోచించుకోవాలని హెచ్చరించారు. రష్యా.. ఇజ్రాయెల్, ఇరాన్ మాదిరిగా కాదని.. తమకు పంపే ప్రతి హెచ్చరిక కూడా ముప్పేనని.. యుద్ధం వైపు ఓ అడుగని హాట్ కామెంట్స్ చేశారు. మెద్వెదెవ్ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన ట్రంప్.. అతడి రెచ్చగొట్టే వ్యాఖ్యలకు ప్రతిస్పందనగా రష్యా సమీప జలాల్లోకి న్యూ్క్లియర్ సబ్‌మెరైన్స్ తరలించాలని అమెరికా సైన్యాన్ని ఆదేశించానని తెలిపారు.