నిత్య పెళ్లికూతురు.. 8 మందిని పెళ్లి చేసుకుని 9వ సారి దొరికింది.. మోసం చేసి లక్షలు వెనకేసింది !

నిత్య పెళ్లికూతురు.. 8 మందిని పెళ్లి చేసుకుని 9వ సారి దొరికింది.. మోసం చేసి లక్షలు వెనకేసింది !

పెళ్లి అంటే చాలా మందికి వేడుక.. జీవితకాల ప్రయాణానికి తొలి అడుగు. మూడు ముళ్లు ఏడు అడుగులతో ఇద్దరు ఒక్కటయ్యే అద్భుత ఘటన. కానీ ఆమె మాత్రం 27 ముడులు.. 63 అడుగులు వేస్తూ నిత్యకళ్యాణం పచ్చతోరణం అన్నట్లుగా ముందుకు సాగుతూనే ఉంది. 12 ఏళ్ల కూతురు ఉన్నప్పటికీ ఇంకా కొత్త పెళ్లికూతురు అవుతూనే ఉంది. ఎనిమిది మందిని పెళ్లి చేసుకుని చివరికి తొమ్మిదో పెళ్లిలో దొరికిపోవడంతో ఈ నిత్య పెళ్లి కూతురు బండారం బయటపడింది. 

వివరాల్లోకి వెళ్తే.. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌ కు చెందిన సమీరా ఫాతిమా నిత్య పెళ్లి కూతురిగా రికార్డు సృష్టించింది. పెళ్లిళ్లు చేసుకోవడం.. బ్లాక్ మెయిల్ చేసి లక్షల్లో వసూలు చేయడం.. భర్తలను చెట్లపాలు చేయడం ఆమెకు వెన్నతో పెట్టిన విద్య. ఒకరి తర్వాత ఒకరు ఇలా ఎనిమిది మందిని వివాహం చేసుకుని, వారి నుండి లక్షల రూపాయలు వసూలు చేసిన ఈమె గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

టీచర్ గా పనిచేసే సమీరా ఫాతిమాకు తక్కువ టైమ్ లో ఎక్కువ డబ్బు సంపాదించాలని పక్కదారి పట్టింది.  గత 15 సంవత్సరాలుగా కనీసం 8 మంది పురుషులను పెళ్లి చేసుకుని మోసం చేసిందని పోలీసులు తెలిపారు. ఈమె 9వ పెళ్లికి ప్రయత్నిస్తుండగా పోలీసులకు పట్టుబడింది. 

పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. సమీరా మ్యాట్రిమోనీ, సోషల్ మీడియాలో డబ్బున్న పురుషులను టార్గెట్ చేసి వారికి రిక్వెస్ట్ పెడుతుంది. మొదట తాను వితంతువును అని, కష్టాల్లో ఉన్నానని చెప్పి సానుభూతి పొందుతుంది. వారితో మాటలు కలిపి పెళ్లివరకు తీసుకొస్తుంది.

ఫోన్ కాల్స్ రికార్డు చేసి బ్లాక్ మెయిల్:

మగవారికి గాలం వేసి ఎలాగోలా పెళ్లి చేసుకుంటుంది. పెళ్లైన తర్వాత భర్తలకు తెలియకుండా వారి మాటలను సీక్రెట్ గా  రికార్డు చేస్తుంది. ఆ రికార్డులను ఎడిట్ చేసి, బ్లాక్ మెయిల్ చేసి, వారిపై తప్పుడు కేసులు పెట్టి డబ్బులు వసూలు చేస్తుంది. ఈమె బాధితులు చాలా మందే ఉన్నారు.  సమీరా తన నుంచి రూ. 50 లక్షలు తీసుకుందని ఒకరు ఫిర్యాదు చేయగా, మరొకరు రూ. 15 లక్షలు వసూలు చేసిందని కంప్లైంట్ ఇచ్చారు.

►ALSO READ | వీళ్లు మామూలోళ్లు కాదు.. స్టాక్ ట్రేడింగ్.. B2B ఎక్స్పోర్ట్స్ పేరుతో కోట్లలో మోసాలు.. ఎలా చిక్కారంటే..

ఈమె రిజర్వ్ బ్యాంక్ అధికారులను కూడా మోసం చేసిందని ఆరోపణలు ఉన్నాయి. ఆమె ఈ మోసాలను ఒక ముఠాలో భాగంగా చేసిందని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదైన తర్వాత చాలా రోజులుగా సమీరా ఫాతిమా పరారీలో ఉంది. ఒక సందర్భంలో అరెస్టైనప్పటికీ గర్భవతిగా ఉన్నానని చెప్పి తప్పించుకుంది. అయితే, ఆమె చివరి భర్త ఇచ్చిన సమాచారం ఆధారంగా, నాగ్‌పూర్‌లోని ఒక టీ దుకాణంలో ఆమె 9వ పెళ్లి కోసం ప్రయత్నిస్తుండగా పోలీసులు అరెస్టు చేశారు.

విడాకులు తీసుకోకుండానే వరుస పెళ్లిళ్లు:

సమీరాకు 12 ఏళ్ల కూతురు ఉందని పోలీసులు తెలిపారు. ఇటీవలే మరో బిడ్డకు జన్మనిచ్చింది, కానీ ఆమె తండ్రి ఎవరో ఇంకా స్పష్టంగా తెలియదని చెప్పారు. గిట్టిఖాదన్ పోలీస్ స్టేషన్ సీనియర్ ఇన్ స్పెక్టర్ కైలాష్ దేశ్మానే మాట్లాడుతూ ఆమెకు కోర్టు మూడు రోజుల పోలీసు కస్టడీ రిమాండ్ మంజూరు చేసినట్లు తెలిపారు. ఎనిమిది మంది భర్తలు తమ బాధలను వివరిస్తూ అఫిడవిట్లు సమర్పించారని ఆయన పేర్కొన్నారు. 

ఈమె వెనుక ఇంకేదైనా ముఠా ఉందా.. ఎంత డబ్బు వసూలు చేసిందీ అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆమె ఎనిమిది మంది పురుషులతో పెళ్లి చేసుకున్నప్పటికీ, ఎవరితోనూ విడాకుల తీసుకోకుండానే వరుస పెళ్లిళ్లు చేసుకుందని పోలీసులు తెలిపారు.